Ambati Srihariprasad
-
టీడీపీలో రె‘బెల్స్’..
అర్జునుడి అసమ్మతి బాణం నూజివీడు ఇవ్వకుంటే బందరు బరిలో పోటీ? ఈ నెల 19 డెడ్‌లైన్? బాబు ఎదుట ముత్తంశెట్టి అనుచరుల నిరసన నూజివీడు, పెనమలూరుపై హరికృష్ణ పంతం నామినేషన్ వేసేందుకు జయమంగళ సన్నద్ధం సాక్షి,మచిలీపట్నం : జిల్లా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి రాజుకుంటోంది. ఇప్పటికే గన్నవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, పెనమలూరులో మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, చలసాని పండు సతీమణి పద్మావతి, అవనిగడ్డలో సిట్టింగ్ ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్ అనుయాయులు తీవ్ర అసమ్మతితో రగులుతున్నారు. దీనికితోడు అవనిగడ్డలో టిక్కెట్ ఇస్తామని బాబు చెప్పడంతో నోవా విద్యాసంస్థల చైర్మన్ ముత్తంశెట్టి కృష్ణారావు దాదాపు మూడు నెలలుగా కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఆయనకు కాకుండా కాంగ్రెస్ నుంచి వచ్చిన మండలి బుద్ధప్రసాద్‌కు టిక్కెట్ ఖరారు చేయడంతో చంద్రబాబు తీరుపై ముత్తంశెట్టి మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబును తణుకులో కలిసిన ముత్తంశెట్టి అనుచరులు అవనిగడ్డ సీటు కోసం పట్టుబట్టారు. బాబు అందుకు సానుకూలంగా స్పందించకపోవడంతో ఆయన ముంగిటే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అర్జునుడి అసమ్మతి బాణం... టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న బచ్చుల అర్జునుడు అసమ్మతి బాణం వేశారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పైకి మాత్రం చంద్రబాబుపై నమ్మకం ఉందని చెప్పినా.. టిక్కెట్ రాకుంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. గత రెండు పర్యాయాలుగా ఆయన టీడీపీ టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో టిక్కెట్ రాని ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తానని బాబు హామీ ఇచ్చారు. టిక్కెట్ రాని బచ్చుల ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేయలేదని చంద్రబాబుకు అప్పట్లో పలువురు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలోనే బచ్చులకు ఎమ్మెల్సీ ఇవ్వకపోగా ఈసారి కూడా టిక్కెట్ ఇచ్చేందుకు బాబు ఆసక్తి చూపలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే టిక్కెట్ ఇస్తానని, నూజివీడులో పార్టీ కోసం పనిచేయాలని ఆర్నేల్ల క్రితం చెప్పిన బాబు ఇప్పుడు బచ్చులకు ఇవ్వకపోతే ఆయన రెబెల్‌గా మారే అవకాశం ఉంది. గన్నవరం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు టిక్కెట్ ఇచ్చే ప్రయత్నం చేయడాన్ని బచ్చుల వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో నూజివీడు, బందరు నియోజకవర్గాల్లో ఏదోక చోట నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తన టిక్కెట్ విషయంలో ఏ నిర్ణయం తీసుకునేదీ 19 వరకు డెడ్‌లైన్ పెట్టడం గమనార్హం. నూజివీడు టిక్కెట్ ‘హరీ’.. ముద్దరబోయిన తన సీటు తన్నుకుపోతున్నాడని బాధపడుతున్న బచ్చులకు మరోవైపు హరికృష్ణ రూపంలో సమస్య వచ్చి పడింది. తెలుగుదేశంలో ఎన్టీఆర్ వారసుడిగా హరికృష్ణ సీటు పోరును గురువారం తీవ్రం చేసిన సంగతి తెల్సిందే. తనకు పెనమలూరు, నూజివీడులో ఏదో ఒకటి ఇవ్వాలని హరికృష్ణ అడిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పెనమలూరులో బోడే ప్రసాద్‌కు బీ-ఫారం ఇచ్చేయడంతో మిగిలిన నూజివీడుపై హరి కన్నేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నూజివీడు టిక్కెట్ కూడా హరీ అవుతుందని బచ్చుల బాధపడుతున్నట్టు సమాచారం. జయమంగళకు లైన్‌క్లియర్..? సీమాంధ్ర ప్రాంతంలో బీజేపీలో తెలుగుదేశం పొత్తు వ్యవహారం బెడిసికొట్టే అవకాశం ఉండటంతో బీజేపీకి కేటాయించిన సీట్లలోను టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పొత్తులో భాగంగా జిల్లాలో కైకలూరు నియోజకవర్గంతో పాటు విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గం బీజేపీకి కేటాయించారు. బీజేపీ పొత్తుపై నీలినీడలు కమ్ముకోవడంతో ఆ పార్టీకి కేటాయించిన సీట్లలో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయాలని చంద్రబాబు సంకేతాలు ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో బీజేపీకి కేటాయించిన కైకలూరు నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణకు లైన్‌క్లియర్ అయినట్టు చెబుతున్నారు. దీంతో ఈ నెల 19న ఆయన నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీతో మళ్లీ పొత్తు కుదిరితే మరి జయమంగళ సంగతేంటి అనేది అనుమానమే? -
వార్ వన్ సైడే..
సాక్షి, మచిలీపట్నం/ అవనిగడ్డ, న్యూస్‌లైన్ : వార్ వన్‌సైడ్ అయ్యింది.. మెజార్టీ కూడా బాగానే వచ్చింది.. సాధించిన విజయంతో టీడీపీ జబ్బలు చరుచుకుంటోంది.. అసలు సంగతేంటంటే అవనిగడ్డలో తెలుగుదేశం పార్టీకి రానున్నది గడ్డుకాలమేనన్న సంగతి తేటతెల్లమవుతోంది. ఎన్నికలు జరిగిన తీరును, స్వతంత్రులకు పోలైన ఓట్లను నిశితంగా గమనిస్తే టీడీపీకి రానున్న కాలంలో ఎదురుగాలి తప్పదనే సంకేతాలు వెలువడినట్టు అయ్యింది. తమ స్థానాన్ని పదిలపర్చుకునేందుకు సానుభూతి మంత్రాన్ని జపించినా, టీడీపీకి ప్రధాన పార్టీలు పోటీ లేకపోయినా స్వతంత్రులతో అవస్థలు తప్పలేదు. నామమాత్రపు పోటీలోనూ దివిసీమలోని ఒక కీలక సామాజిక వర్గం స్వతంత్రులకు అనుకూలంగా ఓటేసింది. అదే ప్రధాన పార్టీలు బరిలో ఉంటే టీడీపీకి అడ్రస్ గల్లంతయ్యే ప్రమాదం కూడా ఉందన్న సంగతిని ఉప ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి. భారీ మెజారిటీ.. అవనిగడ్డ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. టీడీపీ అభ్యర్థి అంబటి శ్రీహరిప్రసాద్‌కు 75,282 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి సైకం రాజశేఖర్‌కు 13,638 ఓట్లు పోలయ్యాయి. మరో స్వతంత్ర అభ్యర్థి రావు సుబ్రహ్మణ్యంకు 3,389 ఓట్లు వచ్చాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో అంబటి బ్రహ్మణయ్యకు పోలైన మొత్తం ఓట్లకంటే ప్రస్తుత ఉప ఎన్నికల్లో శ్రీహరిప్రసాద్‌కు వచ్చిన మెజార్టీయే ఎక్కువని, పోటీ ఏకపక్షం అయ్యిందని టీడీపీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయాయి. 2009 సార్వత్రిక ఎన్నికల్లో అంబటి బ్రాహ్మణయ్యకు మొత్తం 55,314 ఓట్లు వచ్చాయి. అంతకంటే ఎక్కువగా ఇప్పుడు శ్రీహరిప్రసాద్‌కు 61,644 ఓట్ల మెజార్టీ వచ్చింది. చెమటోడ్చిన నేతలు.. అంబటి బ్రాహ్మణయ్య మృతితో జరిగిన ఈ ఎన్నికల్లో సానుభూతి మంత్రాన్ని జపించిన టీడీపీ తొలి నుంచి ఏకగ్రీవం పైనే ఆశపెట్టుకున్నా ఫలించలేదు. ప్రధాన పార్టీలు పోటీచేయకపోయినా స్వతంత్రులు మాత్రం పోటీకి నిలిచారు. కొంతమందిని బతిమాలో, బుజ్జగించో ఉపసంహరింపజేసినా ఇద్దరు అభ్యర్థులు మాత్రం బరిలో కొనసాగారు. ఏకగ్రీవం కావాల్సిన స్థానం ఎన్నికల వరకు రావడంతో టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది. గెలుపు ఖాయం కావాల్సిన స్థానంలో అనుకోనిది ఏదైనా జరిగినా, మెజారిటీ తగ్గినా పార్టీ పరువు పోతుందనే సంశయంతో ఆ పార్టీ నేతలు చెమటోడ్చాల్సి వచ్చింది. పార్టీ జిల్లా కన్వీనర్ ఉమ సహా జిల్లా స్థాయి నాయకులు ఆరు మండలాల బాధ్యతలు ఒక్కొక్కరు తీసుకుని ప్రచారం, పర్యవేక్షణ చేశారు. ఇక్కడ పోటీలో లేని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బహిష్కరణ పిలుపు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్, టీడీపీ వ్యతిరేక ఓటర్లు మాత్రం పోలింగ్‌కు దూరంగా ఉండిపోయారు. సమైక్యాంధ్ర ఉద్యమం, ఎన్నికల బహిష్కరణ, మాగాణి పనులు వంటి కారణాలతో టీడీపీపై ఆసక్తిలేని వారంతా ఓటు హక్కు వినియోగించుకోలేదు. పోలైన మొత్తం ఓట్లలో అత్యధికం తెలుగుదేశం పార్టీ శ్రేణులు అత్యంత శ్రద్ధగా తమకు అనుకూలంగా వేయించుకున్నవే కావడం గమనార్హం. చివరికి సానుభూతి పవనాలు వీయడం, ప్రధాన పార్టీలు పోటీ చేయకపోవడం, ఇద్దరు స్వతంత్రులతో నామమాత్రంగానే పోటీ ఉండటం వంటి అంశాలు తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చాయి. పోటీ నామమాత్రమే అయినా.. నియోజకవర్గంలో అంబటి కుటుంబాన్ని, టీడీపీని వ్యతిరేకిస్తున్నవారు ఎన్నికలు జరగాలని కోరుకున్నా, ప్రధాన పార్టీలు పోటీ లేకపోవడంతో స్వతంత్రులను రంగంలోకి దించారు. స్వతంత్రులు సైతం గట్టి పోటీ ఇవ్వలేకపోవడంతో పోరు నామమాత్రంగానే మారింది. అయినా స్వతంత్రులకు ఇక్కడ పోలైన ఓట్లు కూడా చర్చనీయాంశమయ్యాయి. నామమాత్రపు పోటీలోనే స్వతంత్ర అభ్యర్థి సైకం రాజశేఖర్‌కు 13,638 ఓట్లు వచ్చాయి. నియోజకవర్గంలో ఒక సామాజికవర్గం ఓట్లు టీడీపీకి దూరమవుతున్నాయన్న వాదనను స్వతంత్ర అభ్యర్థికి వచ్చిన ఓట్లు తేటతెల్లం చేశాయి. వైఎస్సార్సీపీ గుర్తుగా ప్రచారంలో ఉన్న ఫ్యాన్‌ను ఈ ఎన్నికల్లో మరో స్వతంత్ర అభ్యర్థి రావు సుబ్రహ్మణ్యానికి ఎన్నికల అధికారులు కేటాయించారు. పెద్దగా ప్రయత్నం చేయకుండానే ఆ అభ్యర్థికి 3,389 ఓట్లు పడటం గమనార్హం. -
ముగిసిన ప్రచారం
సాక్షి, మచిలీపట్నం / చల్లపల్లి-న్యూస్‌లైన్ : అవనిగడ్డ ఉప ఎన్నికల్లో ప్రచార పర్వం సోమవారంతో ముగిసింది. ప్రధాన పార్టీలు సానుభూతితో పోటీకి దూరంగా ఉన్నా ఇద్దరు స్వతంత్రులు బరిలో నిలవడంతో టీడీపీ ఏకగ్రీవ యత్నాలకు గండిపడింది. దీంతో ఐదు దశాబ్దాల అవినిగడ్డ నియోజకవర్గ చరిత్రలో ప్రధాన పార్టీలు బరిలో లేకుండా జరుగుతున్న తొలి పోరుగా ఈ ఎన్నిక నిలిచింది. ప్రచార పర్వం ఆఖరి రోజైన సోమవారం టీడీపీ అభ్యర్థి అంబటి శ్రీహరిప్రసాద్, స్వతంత్ర అభ్యర్థులు సైకం రాజశేఖర్, రావు సుబ్రహ్మణ్యం పలు ప్రాంతాల్లో ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ప్రచార పర్వం ముగియడంతో ఓటర్లను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోలింగ్ రేపే.. ఈ నెల 21న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. నియోజకవర్గంలో 1,87,200 మంది ఓటర్లు ఉండగా వారిలో 93,893 మంది మహిళలు, 93,307 మంది పురుషులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. 241 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లో వెబ్ కెమెరాలు అమర్చుతున్నారు. ఉప ఎన్నికల కోసం 265 మంది పోలింగ్ ఆఫీసర్లు, 265 మంది అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు, 530 మంది పోలింగ్ సిబ్బంది, 265 మంది వెబ్ కాస్టింగ్ సిబ్బందిని నియమించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి.రవి, జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఈవీఎంలను అవనిగడ్డ డిగ్రీ కళాశాలలో భద్రపరుస్తారు. ఈ నెల 24న అదే కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఓట్ల కోసం పాట్లు.. అవనిగడ్డ ఉప ఎన్నికకు సమైక్యాంధ్ర సెగ తగిలితే ఇబ్బంది తప్పదని భావించిన తెలుగుదేశం పార్టీ జిల్లా నేతలు ఓటు ద్వారా సమైక్య నినాదం చాటాలంటూ కొత్త ప్రచారాన్ని తెరమీదకు తెచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమంపై ఆసక్తి చూపుతున్న అవనిగడ్డ ఓటర్లు ఉప ఎన్నికల రోజున ఓటుకు దూరంగా ఉంటే వచ్చే ప్రమాదాన్ని పసిగట్టిన టీడీపీ ఓటు ద్వారా సమైక్య నినాదం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. టీడీపీ అభ్యర్థి అంబటి శ్రీహరిప్రసాద్‌కు మద్దతుగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్, నేతలు కొనకళ్ల బుల్లయ్య, చలమలశెట్టి రామానుజయ, కొల్లు రవీంద్ర, లంకిశెట్టి బాలాజీ ప్రచారం నిర్వహించారు. ఎన్నికల బడ్జెట్‌కు ఆమోదముద్ర.. అవనిగడ్డ ఉప ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా ఉన్నతాధికారులు రూ.55 లక్షలు బడ్జెట్ కేటాయించారు. ఆ మొత్తం నిధులు విడుదలై ఖర్చు చేయాలంటే ప్రభుత్వ ఖజానా శాఖ ఆమోదముద్ర పడాల్సిందే. ఆ శాఖ సిబ్బంది కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉండటంతో బడ్జెట్‌కు ఆమోదముద్ర పడటం ఇబ్బంది అవుతుందని తొలుత భావించారు. ఎన్నికల ప్రక్రియ కావడంతో ప్రత్యేకంగా జిల్లా ఖజానా శాఖ అధికారులు సోమవారం బడ్జెట్ కేటాయింపులకు ఆమోదం తెలిపి అవనిగడ్డ ఉప ఖజానా కార్యాలయానికి పంపించారు. అరుదైన రికార్డు.. టీడీపీ మినహా ప్రధాన పార్టీలేవీ బరిలో లేకుండా స్వతంత్రుల కారణంగా ఎన్నికలు జరుగుతున్న అరుదైన రికార్డును ఈ ఎన్నికల ప్రక్రియతో అవనిగడ్డ నియోజకవర్గం సొంతం చేసుకోనుంది. 1967లో ఏర్పడిన ఈ నియోజకవర్గం 48 ఏళ్ల కాలంలో 12 ఎన్నికలు చవిచూసింది. ప్రస్తుత ఎన్నికలతో ఇక్కడ రెండు పర్యాయాలు ఉప పోరు జరిగినట్టు అవుతుంది. నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటుతో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడంతో 1985లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతో పాటు అవనిగడ్డకు ఉప ఎన్నికలు జరిగాయి.