వార్ వన్‌ సైడే.. | War One saide .. | Sakshi
Sakshi News home page

వార్ వన్‌ సైడే..

Published Sun, Aug 25 2013 12:32 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM

వార్ వన్‌ సైడే.. - Sakshi

వార్ వన్‌ సైడే..

సాక్షి, మచిలీపట్నం/ అవనిగడ్డ, న్యూస్‌లైన్ : వార్ వన్‌సైడ్ అయ్యింది.. మెజార్టీ కూడా బాగానే వచ్చింది.. సాధించిన విజయంతో టీడీపీ జబ్బలు చరుచుకుంటోంది.. అసలు సంగతేంటంటే అవనిగడ్డలో తెలుగుదేశం పార్టీకి రానున్నది గడ్డుకాలమేనన్న సంగతి తేటతెల్లమవుతోంది. ఎన్నికలు జరిగిన తీరును, స్వతంత్రులకు పోలైన ఓట్లను నిశితంగా గమనిస్తే టీడీపీకి రానున్న కాలంలో ఎదురుగాలి తప్పదనే సంకేతాలు వెలువడినట్టు అయ్యింది.

తమ స్థానాన్ని పదిలపర్చుకునేందుకు సానుభూతి మంత్రాన్ని జపించినా, టీడీపీకి ప్రధాన పార్టీలు పోటీ లేకపోయినా స్వతంత్రులతో అవస్థలు తప్పలేదు. నామమాత్రపు పోటీలోనూ దివిసీమలోని ఒక కీలక సామాజిక వర్గం స్వతంత్రులకు అనుకూలంగా ఓటేసింది. అదే ప్రధాన పార్టీలు బరిలో ఉంటే టీడీపీకి అడ్రస్ గల్లంతయ్యే ప్రమాదం కూడా ఉందన్న సంగతిని ఉప ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి.
 
భారీ మెజారిటీ..


 అవనిగడ్డ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. టీడీపీ అభ్యర్థి అంబటి శ్రీహరిప్రసాద్‌కు 75,282 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి సైకం రాజశేఖర్‌కు 13,638 ఓట్లు పోలయ్యాయి. మరో స్వతంత్ర అభ్యర్థి రావు సుబ్రహ్మణ్యంకు 3,389 ఓట్లు వచ్చాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో అంబటి బ్రహ్మణయ్యకు పోలైన మొత్తం ఓట్లకంటే ప్రస్తుత ఉప ఎన్నికల్లో శ్రీహరిప్రసాద్‌కు వచ్చిన మెజార్టీయే ఎక్కువని, పోటీ ఏకపక్షం అయ్యిందని టీడీపీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయాయి. 2009 సార్వత్రిక ఎన్నికల్లో అంబటి బ్రాహ్మణయ్యకు మొత్తం 55,314 ఓట్లు వచ్చాయి. అంతకంటే ఎక్కువగా ఇప్పుడు శ్రీహరిప్రసాద్‌కు 61,644 ఓట్ల మెజార్టీ వచ్చింది.
 
చెమటోడ్చిన నేతలు..

 అంబటి బ్రాహ్మణయ్య మృతితో జరిగిన ఈ ఎన్నికల్లో సానుభూతి మంత్రాన్ని జపించిన టీడీపీ తొలి నుంచి ఏకగ్రీవం పైనే ఆశపెట్టుకున్నా ఫలించలేదు. ప్రధాన పార్టీలు పోటీచేయకపోయినా స్వతంత్రులు మాత్రం పోటీకి నిలిచారు. కొంతమందిని బతిమాలో, బుజ్జగించో ఉపసంహరింపజేసినా ఇద్దరు అభ్యర్థులు మాత్రం బరిలో కొనసాగారు. ఏకగ్రీవం కావాల్సిన స్థానం ఎన్నికల వరకు రావడంతో టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది. గెలుపు ఖాయం కావాల్సిన స్థానంలో అనుకోనిది ఏదైనా జరిగినా, మెజారిటీ తగ్గినా పార్టీ పరువు పోతుందనే సంశయంతో ఆ పార్టీ నేతలు చెమటోడ్చాల్సి వచ్చింది.

పార్టీ జిల్లా కన్వీనర్ ఉమ సహా జిల్లా స్థాయి నాయకులు ఆరు మండలాల బాధ్యతలు ఒక్కొక్కరు తీసుకుని ప్రచారం, పర్యవేక్షణ చేశారు. ఇక్కడ పోటీలో లేని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బహిష్కరణ పిలుపు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్, టీడీపీ వ్యతిరేక ఓటర్లు మాత్రం పోలింగ్‌కు దూరంగా ఉండిపోయారు. సమైక్యాంధ్ర ఉద్యమం, ఎన్నికల బహిష్కరణ, మాగాణి పనులు వంటి కారణాలతో టీడీపీపై ఆసక్తిలేని వారంతా ఓటు హక్కు వినియోగించుకోలేదు. పోలైన మొత్తం ఓట్లలో అత్యధికం తెలుగుదేశం పార్టీ శ్రేణులు అత్యంత శ్రద్ధగా తమకు అనుకూలంగా వేయించుకున్నవే కావడం గమనార్హం. చివరికి సానుభూతి పవనాలు వీయడం, ప్రధాన పార్టీలు పోటీ చేయకపోవడం, ఇద్దరు స్వతంత్రులతో నామమాత్రంగానే పోటీ ఉండటం వంటి అంశాలు తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చాయి.

 పోటీ నామమాత్రమే అయినా..

 నియోజకవర్గంలో అంబటి కుటుంబాన్ని, టీడీపీని వ్యతిరేకిస్తున్నవారు ఎన్నికలు జరగాలని కోరుకున్నా, ప్రధాన పార్టీలు పోటీ లేకపోవడంతో స్వతంత్రులను రంగంలోకి దించారు. స్వతంత్రులు సైతం గట్టి పోటీ ఇవ్వలేకపోవడంతో పోరు నామమాత్రంగానే మారింది. అయినా స్వతంత్రులకు ఇక్కడ పోలైన ఓట్లు కూడా చర్చనీయాంశమయ్యాయి. నామమాత్రపు పోటీలోనే స్వతంత్ర అభ్యర్థి సైకం రాజశేఖర్‌కు 13,638 ఓట్లు వచ్చాయి. నియోజకవర్గంలో ఒక సామాజికవర్గం ఓట్లు టీడీపీకి దూరమవుతున్నాయన్న వాదనను స్వతంత్ర అభ్యర్థికి వచ్చిన ఓట్లు తేటతెల్లం చేశాయి. వైఎస్సార్‌సీపీ గుర్తుగా ప్రచారంలో ఉన్న ఫ్యాన్‌ను ఈ ఎన్నికల్లో మరో స్వతంత్ర అభ్యర్థి రావు సుబ్రహ్మణ్యానికి ఎన్నికల అధికారులు కేటాయించారు. పెద్దగా ప్రయత్నం చేయకుండానే ఆ అభ్యర్థికి 3,389 ఓట్లు పడటం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement