సాక్షి, మచిలీపట్నం / చల్లపల్లి-న్యూస్‌లైన్ : అవనిగడ్డ ఉప ఎన్నికల్లో ప్రచార పర్వం సోమవారంతో ముగిసింది. ప్రధాన పార్టీలు సానుభూతితో పోటీకి దూరంగా ఉన్నా ఇద్దరు స్వతంత్రులు బరిలో నిలవడంతో టీడీపీ ఏకగ్రీవ యత్నాలకు గండిపడింది. దీంతో ఐదు దశాబ్దాల అవినిగడ్డ నియోజకవర్గ చరిత్రలో ప్రధాన పార్టీలు బరిలో లేకుండా జరుగుతున్న తొలి పోరుగా ఈ ఎన్నిక నిలిచింది.
ప్రచార పర్వం ఆఖరి రోజైన సోమవారం టీడీపీ అభ్యర్థి అంబటి శ్రీహరిప్రసాద్, స్వతంత్ర అభ్యర్థులు సైకం రాజశేఖర్, రావు సుబ్రహ్మణ్యం పలు ప్రాంతాల్లో ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ప్రచార పర్వం ముగియడంతో ఓటర్లను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
పోలింగ్ రేపే..
ఈ నెల 21న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. నియోజకవర్గంలో 1,87,200 మంది ఓటర్లు ఉండగా వారిలో 93,893 మంది మహిళలు, 93,307 మంది పురుషులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. 241 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లో వెబ్ కెమెరాలు అమర్చుతున్నారు. ఉప ఎన్నికల కోసం 265 మంది పోలింగ్ ఆఫీసర్లు, 265 మంది అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు, 530 మంది పోలింగ్ సిబ్బంది, 265 మంది వెబ్ కాస్టింగ్ సిబ్బందిని నియమించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి జి.రవి, జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఈవీఎంలను అవనిగడ్డ డిగ్రీ కళాశాలలో భద్రపరుస్తారు. ఈ నెల 24న అదే కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.
ఓట్ల కోసం పాట్లు..
అవనిగడ్డ ఉప ఎన్నికకు సమైక్యాంధ్ర సెగ తగిలితే ఇబ్బంది తప్పదని భావించిన తెలుగుదేశం పార్టీ జిల్లా నేతలు ఓటు ద్వారా సమైక్య నినాదం చాటాలంటూ కొత్త ప్రచారాన్ని తెరమీదకు తెచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమంపై ఆసక్తి చూపుతున్న అవనిగడ్డ ఓటర్లు ఉప ఎన్నికల రోజున ఓటుకు దూరంగా ఉంటే వచ్చే ప్రమాదాన్ని పసిగట్టిన టీడీపీ ఓటు ద్వారా సమైక్య నినాదం అంటూ కొత్త పల్లవి అందుకున్నారు.
టీడీపీ అభ్యర్థి అంబటి శ్రీహరిప్రసాద్‌కు మద్దతుగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్, నేతలు కొనకళ్ల బుల్లయ్య, చలమలశెట్టి రామానుజయ, కొల్లు రవీంద్ర, లంకిశెట్టి బాలాజీ ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల బడ్జెట్‌కు ఆమోదముద్ర..
అవనిగడ్డ ఉప ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా ఉన్నతాధికారులు రూ.55 లక్షలు బడ్జెట్ కేటాయించారు. ఆ మొత్తం నిధులు విడుదలై ఖర్చు చేయాలంటే ప్రభుత్వ ఖజానా శాఖ ఆమోదముద్ర పడాల్సిందే. ఆ శాఖ సిబ్బంది కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉండటంతో బడ్జెట్‌కు ఆమోదముద్ర పడటం ఇబ్బంది అవుతుందని తొలుత భావించారు. ఎన్నికల ప్రక్రియ కావడంతో ప్రత్యేకంగా జిల్లా ఖజానా శాఖ అధికారులు సోమవారం బడ్జెట్ కేటాయింపులకు ఆమోదం తెలిపి అవనిగడ్డ ఉప ఖజానా కార్యాలయానికి పంపించారు.
అరుదైన రికార్డు..
టీడీపీ మినహా ప్రధాన పార్టీలేవీ బరిలో లేకుండా స్వతంత్రుల కారణంగా ఎన్నికలు జరుగుతున్న అరుదైన రికార్డును ఈ ఎన్నికల ప్రక్రియతో అవనిగడ్డ నియోజకవర్గం సొంతం చేసుకోనుంది. 1967లో ఏర్పడిన ఈ నియోజకవర్గం 48 ఏళ్ల కాలంలో 12 ఎన్నికలు చవిచూసింది. ప్రస్తుత ఎన్నికలతో ఇక్కడ రెండు పర్యాయాలు ఉప పోరు జరిగినట్టు అవుతుంది. నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటుతో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడంతో 1985లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతో పాటు అవనిగడ్డకు ఉప ఎన్నికలు జరిగాయి.
ముగిసిన ప్రచారం
Published Tue, Aug 20 2013 12:19 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement