► ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు
► బరిలో 13 మంది అభ్యర్థులు
► ప్రధాన పోటీ టీఆర్‌ఎస్- కాంగ్రెస్ మధ్యనే
► 243 పోలింగ్‌స్టేషన్లలో ఏర్పాట్లు పూర్తి
► 19న ఫలితాలు
హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో సోమవారం జరిగే ఉప ఎన్నిక పోలింగ్‌కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నియోజకవర్గంలోని 243 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి వెంకటరెడ్డి మృతితో జరుగుతున్న ఈ ఉప ఎన్నికను అధికార టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొంది.
13 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన ఈ ఉప ఎన్నికలో ప్రధాన పోటీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యనే నెలకొంది. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ తరుపున దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితా రెడ్డి బరిలో నిలిచారు. ఆమెకు తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీ మద్ధతు ప్రకటించి ప్రచారం చేశాయి. సీపీఎం అభ్యర్థిగా సీపీఐ మద్ధతుతో పోతినేని సుదర్శన్ పోటీ చేశారు.
అధికార టీఆర్‌ఎస్ తరుపున ఎన్నికల ఇన్‌చార్జిగా రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు వ్యవహరించి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను నియోజకవర్గంలోని 4 మండలాల్లో మోహరించి, విజయం కోసం శ్రమించారు. కాంగ్రెస్ తరుపున పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన మల్లు భట్టి విక్రమార్క, ఇతర మాజీ మంత్రులు ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డికి మద్ధతు ప్రకటించిన టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ తెలంగాణ నాయకులు కాంగ్రెస్ నేతలతో కలిసి ఉమ్మడి ప్రచారం నిర్వహించారు. రెండు పార్టీలు విజయంపై ధీమాతో ఉండగా, ఓటరు తీర్పు ఎలా ఉంటుందో ఈనెల 19న వెలువడే ఫలితాల్లో తేలనుంది.
రేపే పాలేరు ఉప ఎన్నిక పోలింగ్
Published Sun, May 15 2016 8:56 PM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement