నారాయణఖేడ్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం
మెదక్ : మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నిక శనివారం ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైంది. ఈ ఉప ఎన్నికల కోసం 286 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రోనార్డ్ రాస్ వెల్లడించారు. అలాగే 142 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నట్లు తెలిపారు. నారాయణఖేడ్లోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ రోనాల్డ్ రాస్ పరిశీలించారు. 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలాగే ఉప ఎన్నిక విధుల్లో 3 వేల మంది పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారని చెప్పారు. ఈ ఉప ఎన్నికల్లో 1,88,857 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని పేర్కొన్నారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణఖేడ్ నియోజకవరం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పటోళ్ల కిష్టారెడ్డి గెలుపొందారు. అయితే గతేడాది ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో నారాయణఖేడ్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డి... టీఆర్ఎస్ అభ్యర్థిగా మహారెడ్డి భూపాల్ రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా మహారెడ్డి విజయపాల్ రెడ్డి బరిలో నిలిచారు. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 16న లెక్కిస్తారు.