Ambedkar Nagar Colony
-
ఆ 340 ‘డబుల్’ ఫ్లాట్ల మాటేంటి?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని అంబేడ్కర్ నగర్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం తీసుకున్న పేదల స్థలాల్లో వ్యాపార అవసరాలకు నిర్దేశించినవి ఉన్నాయో లేవో చెప్పాలని తెలంగాణ సర్కార్‌ను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం నిర్మించే 620 ఫ్లాట్లలో 280 ఫ్లాట్లను ఎంపిక చేసిన వారికి ఉచితంగా కేటాయిస్తే మిగిలిన 340 ఫ్లాట్ల మాటేంటో చెప్పాలంది. పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్‌ను సింగిల్ జడ్జి వద్ద దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావుల ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. తమ భూమిలో డబుల్ బెడ్రూం ఫ్లాట్లు ప్రభుత్వం నిర్మిస్తోందంటూ జగన్నాథ్ సింగ్, మరో 8 మంది రిట్ దాఖలు చేశారు. దీనిపై యథాతథస్థితి ఉత్తర్వుల్ని సింగిల్ జడ్జి ఎత్తేయడంతో నిర్మాణానికి ఇబ్బందులు తొలిగాయి. ఈ ఉత్తర్వులపై పిటిషనర్ అప్పీల్ దాఖలు చేయగా కోర్టు విచారించింది. డబుల్బెడ్రూం ఇళ్ల కోసం 280 మంది ఇష్టపూర్వకంగా స్థలాలిచ్చారని, అక్కడి 340 ఫ్లాట్లు విక్రయించి ప్రభుత్వం వ్యాపారం చేయబోతోం దని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలున్న ప్రాంతంలో 2 పడకల ఫ్లాట్ల నిర్మాణానికి స్థలమివ్వడానికి ఇష్టపడే వారు ముందుకొచ్చారని ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి చెప్పారు. -
బాధితులకు ‘జాక్’ బాసట
అంబేద్కర్ కాలనీ క్రమబద్ధీకరణకు డిమాండ్ సాక్షి, ముంబై: ఎంతో మంది పేదలకు నిలువ నీడ లేకుండా చేస్తూ బీఎంసీ అధికారులు తూర్పు ములుండ్ బాబాసాహెబ్ అంబేద్కర్‌నగర్‌లో 130 గుడిసెలను కూలగొట్టడంపై ముంబై తెలంగాణ జాక్ (ఎంటీ జాక్) ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందుగా నోటీసులు ఇవ్వకుండానే డెవలపర్లు ఈ నెల 21న ఈ గుడిసెలను నేలమట్టం చేశారు. మురికివాడల సంరక్షణ చట్టానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం 2000 సంవత్సరం కంటే ముందు వేసుకున్న గుడిసెలను క్రమబద్ధీకరించి సదుపాయాలు కల్పిస్తారు. ఈ చట్టం ముంబైలోని మూడు లక్షల గుడిసెలను రక్షిస్తుందన్న అంచనా. అంబేద్కర్‌నగర్ కాలనీవాసులకుకూడా ఈ చట్టం ఎందుకు వర్తింపజేయడం లేదని జాక్ ప్రశ్నించింది. ఇక్కడున్న ప్రతి గుడిసెను 2000 కంటే ముందే నిర్మించారని స్పష్టం చేసింది. వీళ్లంతా 1985 నుంచే ఇక్కడ నివసిస్తున్నట్టు నిరూపించగల పత్రాలూ ఉన్నందున, కూల్చివేతలు చట్ట వ్యతిరేకమని స్పష్టం చేసింది. తమకు అదే స్థలంలోనే తిరిగి ఇళ్లు కట్టించాలి లేదా ప్రత్యామ్నాయం చూపెట్టాలనే డిమాండ్‌తో బాధితులు గత నెల 21 నుంచి ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. వీరిలో ఇరవై శాతం తెలుగు ప్రజలు. అంబేద్కర్‌నగర్ వాసుల న్యాయపరమైన పోరాటానికి ‘ఘర్ బచావ్-ఘర్ బనావ్ ఆందోళన్’ సంస్ధ నాయకురాళ్లు మేథా పాట్కర్, పూనం కనోడియా నాయక త్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంటీ జాక్ సభ్యులు శుక్రవారం సాయంత్రం ఘటనాస్థలానికి వెళ్లి నిర్వాసితులకు మద్దతు ప్రకటించారు. ములుండ్, భాండుప్ ప్రాంతాల్లోని తెలుగువారితోపాటు త్వరలోనే దీక్షలో పాల్గొంటామని ‘జాక్’ కన్వీనర్ బి. ద్రవిడ్ మాదిగ, గాది లక్ష్మణ్ తెలిపారు. ముంబైలోని ఇతర తెలుగు సంఘాలు ఈ ఆందోళనలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.