స్టడీ సెంటర్లకు సేవలు కొనసాగించాలి: హైకోర్టు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు, అంబేద్కర్ యూనివర్సిటీల సేవలు నిలిపివేయడంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ అంశంపై 'సాక్షి' కథనానికి స్పందించిన న్యాయస్థానం... ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శులు కలిసి మాట్లాడుకోవాలని గతవారమే సూచించిన విషయం తెలిసిందే. అయితే ఎలాంటి పురోగతి లేకపోవటంతో విద్యార్థుల భవిష్యత్ నేపథ్యంలో హైకోర్టు విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న స్టడీ సెంటర్లకు సేవలు కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది. అలాగే ఆగస్ట్ 1వ తేదీ నుంచి ఉద్యోగుల జీతాలను ఏపీ ప్రభుత్వమే చెల్లించాలని సూచించింది. ఈ వివాదాన్ని ఎనిమిది వారాల్లోగా తెల్చాలని కేంద్ర హోంశాఖకు ఆదేశిస్తూ, తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
కాగా ఆంధ్రప్రదేశ్‌లోని క్యాంపస్‌లకు తన సేవల్ని నిలిపేస్తూ శ్రీపొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఏపీలోని క్యాంపస్‌లకు గతంలో మాదిరిగా యథాతథంగా తన సేవల్ని కొనసాగించేలా తెలుగు వర్సిటీని ఆదేశించాలని కోరుతూ ఉన్నత విద్యాశాఖ డిప్యూటీ కార్యదర్శి జి.కన్నందాస్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇందులో తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ను ప్రతివాదిగా పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు విశ్వవిద్యాలయానికి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, కూచిపూడి, శ్రీశైలం ప్రాంతాల్లో క్యాంపస్‌లు ఉన్నాయని, ఇందులో 348 మంది విద్యార్థులు చదువుతున్నారని, అలాగే బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారని వివరించారు. తెలుగు విశ్వవిద్యాలయం తన సేవల్ని ఆంధ్రప్రదేశ్‌లో క్యాంపస్‌లకు నిలిపేయడం వల్ల వీరంతా ఇబ్బందులు పడుతున్నారని తెలిపిన విషయం తెలిసిందే.