జాబిల్లి చెల్లాయివే!
‘అంతకుముందు ఆ తరువాత’ ‘బందిపోటు’, ‘అమీతుమీ’, ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన ఇషా రెబ్బా పదహారణాల తెలుగు అమ్మాయి. తొలి సినిమా ‘అంతకు ముందు
ఆ తరువాత’లో అనన్యలాగే స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి. తేనెచూపులమ్మాయి ఇషా గురించి కొన్ని ముచ్చట్లు...
నెమలీక
ఆ భాష ఈ భాష మాసు క్లాసు అని తేడా లేకుండా సినిమాలు చూడటం అంటే ఇషాకు బోలెడు ఇష్టం. కానీ సినిమాల్లోకి రావాలని మాత్రం అనుకోలేదు. అయితే ఎంబీయే చదువుకునే రోజుల్లో మాత్రం మోడలింగ్ చేసింది. ఆ రోజుల్లోనే ఒకరోజు... ‘‘నేను సినిమాల్లో నటించాలనుకుంటున్నాను’’ అని ఇంట్లో చెప్పేసింది. వాళ్లేమీ నో చెప్పలేదు కానీ చదువు తరువాత అని చెప్పారు. అలా ఎంబీయే పూర్తి చేసిన ఇషా, ఇంద్రగంటి మోహనకృష్ణ ‘అంతకు ముందు ఆ తరువాత’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
అంతకు ముందు ఆ తరువాత
‘అంతకు ముందు ఆ తరువాత’ సినిమాలో నటించేటప్పుడు ‘యాక్షన్’ అనే మాట వినబడగానే ‘అయ్య బాబోయ్’ అనుకునేదట. కడుపు నొప్పి వచ్చేదట. ఇలాంటి సమయాల్లోనే సహనటులు ఇచ్చే సపోర్ట్ చాలా అవసరం అంటోంది ఇషా. ఈ సపోర్ట్ లభించడం వల్లే అంతకుముందు ఎలా ఉన్నా ఆ తరువాత మాత్రం దూసుకెళ్లగలిగింది. సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన ఇషా తొలి సినిమాతోనే భేష్ అనిపించుకుంది. ‘బందిపోటు’ తరువాత ఒక తమిళ సినిమాలో కూడా నటించింది. ఇషా చేతిపై నెమలీక టాటూ కనిపిస్తుంది. ఈ నెమలీక సంకల్పబలానికి ప్రతీకట!
తీరిక వేళల్లో
‘ఇప్పుడు ఇది చేశాం. నిరూపించుకున్నాం’ ‘ ఆ తరువాత నెక్స్›్టలీగ్కు వెళ్లిపోవాలి’ ఇలాంటి స్ట్రాటజీలేవి తనకు లేవు అంటుంది ఇషా. ‘మంచి కథ ఉన్న సినిమాలో నటిస్తే చాలు. మంచి క్యారెక్టర్ చేస్తే చాలు’ అంటున్న ఇషా తీరిక వేళల్లో సంగీతాన్ని వినడానికి ఇష్టపడుతుంది. ఇళయరాజా, ఏ.ఆర్.రెహమాన్లు ఆమె అభిమాన సంగీత దర్శకులు.
కొంచెం డిఫరెంట్గా!
పరిశీలన అనేది వృథా పోదు అని నమ్ముతుంది. వివిధ సందర్భాల్లో వ్యక్తుల పరిశీలన తన నటనకు ఉపకరిస్తుంది అంటున్న ఇషా ఇప్పుడు ఉన్న అందరూ హీరోలతో కలిసి నటించాలనుకుంటోంది. ఒక సినిమాలో పోషించిన పాత్రకు మరో సినిమాలో పోషించిన పాత్రకు వైవిధ్యం కనిపించడానికి ప్రాధాన్యత ఇస్తుంది.
స్ట్రెస్బస్టర్
అబ్బాయిలెవరికీ ఎదురుకాని ప్రశ్న, అమ్మాయిలకే ఎదురయ్యే ప్రశ్న: ‘వంట వచ్చా?’ఈ ప్రశ్న గురించి ఖండనమండనల మాట ఎలా ఉన్న ఇషా రెబ్బాకు మాత్రం వంట భేషుగ్గా వచ్చట. అది తన స్ట్రెస్బస్టర్ అని కూడా చెబుతుంది.