మరోసారి అమ్మగా అమలాపాల్
వివాహానికి ముందు ఆ తరువాత అమలాపాల్ నటనలో మార్పును సులభంగానే గ్రహించవచ్చు. ఆమె చిత్రాల ఎంపికలోను అది స్పష్టంగా కనిపిస్తోంది.పెళ్లికి ముందు అందరు హీరోయిన్ల మాదిరిగానే ఆ వయసుకు తగ్గట్టుగా హీరోలతో ఆటాపాట అంటూ లవ్, రొమాన్స్ పాత్రల్లో జాలీగా నటించేశారు. పెళ్లి తరువాత అమలాపాల్ నిర్ణయంలో చాలా మార్పు కనిపిస్తోందని స్పష్టంగా చెప్పవచ్చు.
వివాహానంతరం సెలెక్టెడ్ చిత్రాలే చేస్తాను అని ప్రకటించిన అమలాపాల్ అదే విధంగా ఇప్పుడు పాత్రల ఎంపిక విషయంలో తీసుకుంటున్న శ్రద్ధ, జాగ్రత్తలు ఆమె పరిపక్వతను తెలియజేస్తున్నాయి. అమలాపాల్ అంగీకరించిన తొలి చిత్రం పసంగ-2. అందులో సూర్యకు అర్ధాంగిగా ఇద్దరు పిల్లలకు తల్లిగా పరిణితి చెందిన నటనను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు.
ఎంతగా అంటే ఆ పాత్రలో నటించే అవకాశాన్ని తాను వదులుకుని ఉండకూడదు అని నటి జ్యోతిక వ్యక్తం చేసినంత. పసంగ-2లో అమలాపాల్ పాత్రను జ్యోతికతో నటింపజేయాలని ఆ చిత్ర దర్శకుడు పాండిరాజ్ ఆశించారు. ఆమె ఆసక్తి చూపకపోవడంతో అమలాపాల్‌ను ఎంపిక చేశారు. అమలాపాల్ తాజాగా మరోసారి అమ్మగా మారనున్నారు.ఈ చిత్రం పేరు అమ్మ కణక్కు(అమ్మలెక్క)విశేషం ఏమిటంటే పసంగ-2 చిత్రాన్ని నటుడు సూర్య నిర్మిస్తే, ఈ చిత్రాన్ని నటుడు ధనుష్ నిర్మిస్తున్నారు.
దనుష్ తన వండర్ బార్ ఫిలింస్ పతాకంపై ఎదిర్‌నీశ్చల్,వేలై ఇల్లా పట్టాదారి, కాక్కముట్టై, నానుమ్ ైరౌడీదాన్, తంగమగన్ వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. తాజాగా అమలాపాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అమ్మ కణక్కు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు సముద్రకని,రేవతి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అశ్వినీ అయ్యర్ కథ,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు.
ఇది హిందీలో తెరకెక్కిన నిల్ బెట్టే సన్నాట్టా చిత్రానికి రీమేక్. అక్కడ మంచి విజయం సాధించి అంతర్జాతీయ స్థాయిలో అవార్డును, ప్రశంసలను పొందిన ఈ చిత్రం తల్లీ కూతుళ్ల అనుబంధాన్ని ఆవిష్కరించే కథాంశం అని ధనుష్ ఇంతకు ముందే వెల్లడించారు. ఈ చిత్రం శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.