ధనుష్ లెక్క తప్పిందా?
విజయం ఇచ్చే ఉత్సాహం కంటే అపజయం కలిగించే నిరుత్సాహ ఫలితాలే అధికంగా ప్రభావం చూపుతాయని చెప్పవచ్చు. సక్సెస్ ముందుకు నడిపిస్తే ప్లాప్ వెనకడుగు వేయిస్తుంది. ఇందుకు తాజా ఉదాహరణగా నటుడు ధనుష్ పేర్కొనవచ్చు. ఈ యువ స్టార్ నటుడు ఇప్పటి వరకూ వరుస విజయాలతో దూసుకుపోయారు. రాంజ నా, షమితాబ్ వంటి చిత్రాలతో నటుడుగా బాలీవుడ్ స్థాయికి ఎదిగారు. సింగర్‌గా వైదిస్ కొలెవైరి పాటతో అనూహ్యంగా ప్రాచుర్యం పొందారు. ఒక నిర్మాతగా జాతీయ స్థాయిలో అవార్డులను అందుకున్నారు. కాక్కముట్టై, విచారణై చిత్రాలు ధనుష్‌ను ఉత్తమ చిత్రాల నిర్మాతగా ఖ్యాతిని ఆపాదించి పెట్టాయి.
దీంతో మరింత ఉత్సాహంతో ఇటీవల అమ్మా కణక్కు అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం తన గత చిత్రాల స్థాయిలోనే విజయం సాధించడంతో పాటు, జాతీయస్థాయిలో అవార్డులను అందిస్తుందని ఆశించారు.అయితే అమ్మా కణక్కు(అమ్మ లెక్క)చిత్రానికి ధనుష్ లెక్క తప్పింది. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు.
పెద్దగా లాభాలను తెచ్చిపెట్టలేదు. ఇక విమర్శకులను సైతం మెప్పించలేక పోయిందనే ప్రచారం జరిగింది. వెరసీ ఇవన్నీ ధనుష్‌ను నిరాశపరచాయట. దీంతో కొంత కాలం చిత్ర నిర్మాణానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారన్న ప్రచారం కోలీవుడ్‌లో జరుగుతోంది. అయితే నటుడిగా మాత్రం ధనుష్ చాలా బిజీగా ఉన్నారన్నది గమనార్హం.