కోలీవుడ్ పై మోహం
తమిళ నటులు ధనుష్, మాధవన్, సిద్దార్థ్ లాంటి వారు బాలీవుడ్‌లో నటించడానికి ఆసక్తి చూపుతుంటే అక్కడి స్టార్ నటుడు అభిషేక్ బచ్చన్ లాంటి వారు తమిళ చిత్రాల్లో నటించాలనే ఆకాంక్షను వ్యక్తం చేయడం విశేషం. ఇటీవల చెన్నైకి వచ్చిన అభిషేక్ బచ్చన్ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఆయన మాట్లాడుతూ చెన్నై తనకు రెండో ఇల్లు లాంటిదన్నారు. తాను షూటింగ్ లేని సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైకి వచ్చి వెళుతుంటానని చెప్పారు.
సినిమాకు సంబంధించినంత వరకు కె ప్టెన్ దర్శకుడేనన్నారు. నూతన దర్శకులను ప్రోత్సహించడానికి తానెప్పుడూ ఆసక్తి చూపుతానన్నారు. తానింతకు ముందు మణిరత్నం దర్శకత్వంలో నటించానని గుర్తు చేశారు. తమిళంలో మంచి కథలతో వైవిధ్యభరిత చిత్రాల నిర్మాణానికి ఇక్కడ నిర్మాతలు ప్రాధాన్యతనిస్తున్నారని పేర్కొన్నారు. అందువల్లే తమిళ చిత్రాల్లో నటించాలనే ఆసక్తి తనకు కలుగుతోందన్నారు. త్వరలోనే తన కోరిక నెరవేరుతుందని భావిస్తున్నానని అభిషేక్ బచ్చన్ అన్నారు.