‘అమ్మహస్తం’లో సరుకుల కుదింపు!
హైదరాబాద్: ‘అమ్మహస్తం’ పథకంలోని సరుకులను కుదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమ్మహస్తం పేరుతో 9 రకాల నిత్యావసర వస్తువులను రేషన్‌షాపుల ద్వారా అందించడం తెలిసిందే. వాటిలో నుంచి ఇప్పటికే పామాయిల్ సరఫరాను నిలిపివేయగా, పసుపు, చింతపండు, కారంపొడిని ఈ పథకం నుంచి తొలగించాలని నిర్ణయించారు. మంగళవారం ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సచివాలయంలోని తన చాంబర్లో నిర్వహించిన పౌర సరఫరాల శాఖ అధికారుల సమావేశంలో ఈ రెండు పథకాలపై సమీక్ష జరిపారు.
గోధుమ ధరలు పెరిగిన నేపథ్యంలో రేషన్‌షాపుల్లో ఇస్తున్న గోధుమలు, గోధుమపిండి స్థానంలో ఏదో ఒకదాన్నే సబ్సిడీ ధరలకు అందించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆహార భద్రత పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలన్న అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. సబ్సిడీ కింద రూపాయికి కిలో బియ్యం పథకానికి రూ. 1400 కోట్లు, అమ్మహస్తం పథకానికి రూ. 400 కోట్లు ప్రభుత్వం భరించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
కొత్త రేషన్ కార్డుల జారీకి అధికారిక కమిటీ
ప్రస్తుత రేషన్‌కార్డుల స్థానంలో ఐటీ సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త కార్డుల జారీ మార్గదర్శకాలను రూపొందించేందుకు ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయితీరాజ్ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.