Ammapalli temple
-
ఆలయంలో అనుకోకుండా ఎదురుపడ్డ గవర్నర్ తమిళిసై, ఎమ్మెల్సీ కవిత..
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై, ఎమ్మెల్సీ కవిత అనుకోకుండా ఒకరికి ఒకరు తారసపడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని అమ్మపల్లి (శ్రీ సీతారామచంద్రస్వామి) ఆలయం వద్ద ఈ సంఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. అమ్మపల్లి ఆలయం వద్ద బతుకమ్మ సంబురాల నిర్వహణకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలోకి వెళ్లి అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్తో కలిసి పూజలు నిర్వహిస్తుండగా.. కాసేటికి ఊహించని విధంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అక్కడికి చేరుకున్నారు. నేరుగా ఆలయంలోకి వెళ్లారు. అప్పటికే అక్కడ పూజలు నిర్వహిస్తున్న కవిత.. గవర్నర్ను చూసి పలకరించారు. పూజ అనంతరం బతుకమ్మ ఉత్సవాలకు రావాలని కోరగా.. తాను స్వామి పూజలు జరిపిస్తానని గవర్నర్ జవాబిచ్చారు. పూజల తర్వాత కవిత ఆలయం గర్భగుడి నుంచి బయటకు వెళ్లగా.. ప్రత్యేక పూజల అనంతరం గవర్నర్ ఉత్తర ద్వారం ద్వారా బయటకు వెళ్లిపోయారు. కొత్తూరు మండలంలోని చేగూరు వద్ద ఉన్న కన్హాశాంతి వనం ఆశ్రమానికి వెళ్లిన గవర్నర్.. తిరుగు ప్రయాణంలో అమ్మపల్లికి వచ్చారు. గవర్నర్ ఆకస్మిక రాకతో ఆలయం అధికారులు, పోలీసులు కాసేపు పరుగులు పెట్టాల్సి వచ్చింది. తెలంగాణ మెల్లగా తెరిపిన పడుతోంది: ఎమ్మెల్సీ కవిత తెలంగాణ మెల్ల మెల్లగా మళ్లీ తెరిపిన పడుతోందని, తెలంగాణ రాకముందు అనుకున్నవి ఒక్కొక్కటి నిజమవుతున్నాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. బతుకమ్మ సంబురాలకు హాజరైన సందర్భంగా ఆమె మాట్లాడారు. 11వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాని చెప్పారు. అంతకుముందు మహిళలతో కలిసి కవిత పూలతో బతుకమ్మను పేర్చారు. బతుకమ్మను నెత్తిన పెట్టుకుని ఆలయంలో తిరిగారు. పాటలు పాడి, ఆడుతూ అందరినీ ఉత్సాహపరిచారు. చదవండి: బెంజ్ సీఈవోకు తప్పని ట్రాఫిక్ కష్టాలు.. కిలోమీటర్లు నడిచి, ఆటో ఎక్కి -
రాముడు నడయాడిన పవిత్ర భూమి..కోరిన కోర్కెలు తీర్చే కోదండ రామాలయం
-
అందాల కోవెల.. అమ్మపల్లి
ప్రాచీన కళా వైభవానికి చిహ్నంగా ప్రాకారాలు.. శంషాబాద్ రూరల్: ఆహ్లాదకర వాతావరణం..ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న అమ్మపల్లి (శ్రీసీతారామచంద్రస్వా మి) ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మండలంలోని నర్కూడ సమీపంలో ఉన్న అతి పురాతనమైన ఈ ఆలయం ప్రాకారాలు నాటి కళా వైభవానికి ప్రతీకగా నిలిచాయి. ఎత్తై ఆలయం ప్రధాన గోపురంతో పాటు ఆలయానికి ఈశాన్యంలో ఉన్న కోనేరు, కల్యాణ మండపం నిర్మాణ శైలి ఆకట్టుకుంటుంది. సుమారు ఐదు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆలయానికి 600 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయ నిర్మాణం 14వ శతాబ్దంలో జరిగినట్లు ఆలయ చరిత్ర చెబుతుంది. ధర్మప్రచార నిమిత్తం శ్రీరామచంద్రుడు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ అమ్మపల్లి వద్ద బస చేసినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. ఆలయంలో శ్రీసీతారామచంద్ర, లక్ష్మణ సమేత హనుమాన్ విగ్రహ మూర్తులను ప్రతిష్ఠించారు. ఆలయం ఆవరణలో శివాలయం, ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయి. ఆలయ విశిష్టతను గుర్తించిన ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇన్టాక్) సంస్థ అమ్మపల్లి దేవాలయానికి ‘హెరిటేజ్ - 2010’ అవార్డును ప్రకటించారు. ఘనంగా శ్రీరామనవమి వేడుకలు.. ప్రతి ఏటా ఇక్కడ శ్రీరామనవమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. పునర్వసు నక్షత్రం సందర్భంగా ప్రతి నెలా ఆలయంలో స్వామి కల్యాణాన్ని నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి, మహా శివరాత్రి పర్వదినంలో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇలా వెళ్లొచ్చు శంషాబాద్ పట్టణానికి 5 కిలో మీటర్ల దూరంలో షాబాద్ రోడ్డు ఉన్న ఈ ఆలయానికి సులువుగా చేరుకోవచ్చు. ఆర్టీసీ బస్సులు, ఆటో సౌకర్యం ఉంది. గచ్చిబౌలి నుంచి వచ్చేవారు ఔటర్మీదుగా ఆలయానికి రావచ్చు. చార్మినార్, అఫ్జల్గంజ్, రాజేంద్రనగర్ ప్రాంతాల నుంచి ఇటు వైపు బస్సు సౌకర్యాలు ఉన్నాయి.