అందాల కోవెల.. అమ్మపల్లి
ప్రాచీన కళా వైభవానికి చిహ్నంగా ప్రాకారాలు..
శంషాబాద్ రూరల్: ఆహ్లాదకర వాతావరణం..ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న అమ్మపల్లి (శ్రీసీతారామచంద్రస్వా మి) ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మండలంలోని నర్కూడ సమీపంలో ఉన్న అతి పురాతనమైన ఈ ఆలయం ప్రాకారాలు నాటి కళా వైభవానికి ప్రతీకగా నిలిచాయి. ఎత్తై ఆలయం ప్రధాన గోపురంతో పాటు ఆలయానికి ఈశాన్యంలో ఉన్న కోనేరు, కల్యాణ మండపం నిర్మాణ శైలి ఆకట్టుకుంటుంది. సుమారు ఐదు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆలయానికి 600 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయ నిర్మాణం 14వ శతాబ్దంలో జరిగినట్లు ఆలయ చరిత్ర చెబుతుంది.
ధర్మప్రచార నిమిత్తం శ్రీరామచంద్రుడు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ అమ్మపల్లి వద్ద బస చేసినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. ఆలయంలో శ్రీసీతారామచంద్ర, లక్ష్మణ సమేత హనుమాన్ విగ్రహ మూర్తులను ప్రతిష్ఠించారు. ఆలయం ఆవరణలో శివాలయం, ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయి. ఆలయ విశిష్టతను గుర్తించిన ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇన్‌టాక్) సంస్థ అమ్మపల్లి దేవాలయానికి ‘హెరిటేజ్ - 2010’ అవార్డును ప్రకటించారు.
ఘనంగా శ్రీరామనవమి వేడుకలు..
ప్రతి ఏటా ఇక్కడ శ్రీరామనవమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. పునర్వసు నక్షత్రం సందర్భంగా ప్రతి నెలా ఆలయంలో స్వామి కల్యాణాన్ని నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి, మహా శివరాత్రి పర్వదినంలో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఇలా వెళ్లొచ్చు
శంషాబాద్ పట్టణానికి 5 కిలో మీటర్ల దూరంలో షాబాద్ రోడ్డు ఉన్న ఈ ఆలయానికి సులువుగా చేరుకోవచ్చు. ఆర్టీసీ బస్సులు, ఆటో సౌకర్యం ఉంది. గచ్చిబౌలి నుంచి వచ్చేవారు ఔటర్‌మీదుగా ఆలయానికి రావచ్చు. చార్మినార్, అఫ్జల్‌గంజ్, రాజేంద్రనగర్ ప్రాంతాల నుంచి ఇటు వైపు బస్సు సౌకర్యాలు ఉన్నాయి.