ఫేస్బుక్ కలిపింది ఇద్దరినీ!!
మెదడులో ట్యూమర్ వచ్చి, దాని కారణంగా మతిమరుపుతో బాధపడుతున్న ఓ భారతీయుడిని ఫేస్బుక్ కారణంగా గుర్తుపట్టగలిగారు. సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో గల భారతీయ రాయబార కార్యాలయం వద్ద అతడు స్పృహకోల్పోయి పడి ఉన్నాడు. తమిళనాడులోని విల్లిపురానికి చెందిన దనిగైవేల్ గుణశేఖరన్ అనే ఈ వ్యక్తి ఫొటోను కొన్ని తమిళ సంస్థలు ఫేస్బుక్లో పోస్ట్ చేశాయి. దాదాపు 8వేల మంది అతడి ఫొటోను షేర్ చేశారు. దీంతో ఎట్టకేలకు ఒకరు అతడిని గుర్తుపట్టారు.
అక్టోబర్ నెలలో గుణశేఖరన్‌ను గమనించిన రాయబార కార్యాలయం అధికారులు అతడిని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే అతడికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని, మతిమరుపుతో కూడా బాధపడుతున్నాడని గుర్తించారు. అతడికి తన పేరేంటో, సొంత ఊరేంటో, ఉద్యోగం ఎవరిచ్చారో, తన పాస్‌పోర్టు వివరాలేంటో.. ఏవీ గుర్తులేవు. దీంతో రాయబార కార్యాలయ అధికారులకు అతడో పెద్ద పజిల్‌గా మారాడు. సౌదీ ప్రభుత్వం క్షమాభిక్ష పథకం అమల్లో ఉన్నా, గుణశేఖరన్ గురించి ఏమీ తెలియకపోవడంతో ఎవరూ ఏమీ చేయలేకపోయారు. దీంతో భారత రాయబార కార్యాలయ వర్గాలు తమిళ సంఘాలను సంప్రదించగా, ఓ సంస్థ ఫేస్బుక్ ద్వారా అతడి వివరాలు తెలుసుకుంది. అతడి పాస్‌పోర్ట్, వీసా కాపీలు అతడి భార్య వద్ద ఉన్నాయి. వాటి ఆధారంగా భారత అధికారులను సంప్రదించారు. ఇప్పుడు భారత రాయబార కార్యాలయం వాళ్లే అతడి చికిత్స ఖర్చులు చెల్లించారు. గుణశేఖరన్‌ను చెన్నై పంపేందుకు ఏర్పాట్లు చేశారు.