ఇప్పుడు తెలుగు సినిమాలే సెంటరాఫ్ ఎట్రాక్షన్!
‘‘హారర్ సినిమాలను అంతగా ఇష్టపడను. మాములుగా దెయ్యాలంటే మనుషులు భయపడుతుంటారు. కానీ, మా ‘ఆనందోబ్రహ్మ’ చిత్రంలో మాత్రం మనుషులకు దెయ్యాలు భయపడతాయి. డైరెక్టర్ మహి చెప్పిన ఈ పాయింట్ ఎగై్జటింగ్గా అనిపించింది’’ అన్నారు తాప్సీ. ఆమె ప్రధాన పాత్రలో వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ‘షకలక’ శంకర్, తాగుబోతు రమేశ్ కీలక పాత్రల్లో మహి.వి. రాఘవ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆనందోబ్రహ్మ’. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈరోజు విడుదలవుతున్న సందర్భంగా తాప్సీ చెప్పిన విశేషాలు...
► స్టార్టింగ్ టు ఎండింగ్ ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో నటించడంతోనే నా పనైపోయిందనుకోను... ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నా వంతు కృషి చేస్తాను. అది నటిగా నా బాధ్యత. ఈ సినిమాలో స్టార్ హీరోలు లేరు. అందుకే నా వంతుగా మూవీ ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నాను. సినిమా చేసేటప్పుడు నా సలహాలను డైరెక్టర్ మహి.వి. రాఘవ్ గౌరవించారు. నేను కూడా ఆయన దగ్గర కొన్ని దర్శకత్వ మెళకువలు నేర్చుకున్నా.
► ఒకప్పుడు నేను చేసిన తమిళ, తెలుగు చిత్రాలు అంతగా ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి. అందుకే క్యారెక్టర్, స్క్రిప్ట్ పరంగా రాజీపడకూడదనుకున్నాను. హిందీలో స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉన్న సినిమాలు చేస్తూ కొంత కాలం తీరిక లేకుండా ఉన్నాను. అలా అని హిందీలోనే యాక్ట్ చేస్తానని కాదు.. అక్కడ సినిమాల పరంగా నాకు కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. తెలుగు సినిమాలను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇప్పుడు తెలుగు సినిమాలు సెంటరాఫ్ ఎట్రాక్షన్గా నిలుస్తున్నాయి.
► ప్రస్తుతం హిందీలో ‘జుడ్వా 2’ చేస్తున్నాను. తమిళంలో ఓ సినిమా చేద్దామనుకుంటున్నాను. ‘ఆనందోబ్రహ్మ’ సినిమా ఫలితం కోసం ఎగై్జట్గా ఎదురు చూస్తున్నాను. తెలుగులో మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. నాకు క్రీడలంటే చాలా ఇష్టం. భవిష్యత్లో ఎవరైనా క్రీడాకారుల జీవిత చరిత్రలో నటించే అవకాశం వస్తే వదులుకోను.