ఇష్టానికి విరుద్ధంగా కేటాయించొద్దు
గవర్నర్‌కు ఏపీ భవన్ ఉద్యోగుల వినతి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ భవన్లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను ఏ రాష్ట్రం వారిని ఆ రాష్ట్రానికి కేటాయించాలని ఏపీభవన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్, కల్చరల్ అసోసియేషన్ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేసింది. ఇష్టానికి విరుద్ధంగా ఉద్యోగులను వేరే రాష్ట్రాలకు కేటాయించరాదని కోరింది. ఈ మేరకు గురువారం గవర్నర్‌కు లేఖ రాసినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్‌రావు, ప్రధాన కార్యదర్శి బాలకోటేశ్వర్రావు, కోశాధికారి లింగరాజులు తెలిపారు.
ఏపీ భవన్లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల విభజన ఇష్టారీతిగా చేశారని, ఆంధ్రా ప్రాంతం వారిని తెలంగాణకు, తెలంగాణ ప్రాంతం వారిని ఆంధ్రా ప్రాంతానికి వారి మనోభీష్టానికి విరుద్ధంగా కేటాయిస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేశారని తెలిపారు. దీనిని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఉద్యోగులను ఏ ప్రాంతంవారిని ఆ ప్రాంతానికి కేటాయించిన అనంతరం ఏవైనా పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని డెప్యుటేషన్లతో భర్తీ చేయాలని కోరారు. ఇక ఏపీ భవన్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల వారికి ఆప్షన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.