‘రోహిత్ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి’
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్ధి రోహిత్ వేముల మృతికి కారణమైన ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఎబీవీపీకి చెందిన కేంద్ర మంత్రులు బండారు దత్తత్రేయ, సృ్మతీఇరానీ, ఎమ్మెల్సీ రాంచంద్రరావు, వీసీ అప్పారావులను అరెస్ట్ చేయాలని, జాతీయ ఎస్సీ కమీషన్ ఆదేశాన్ని అమలు చేయాలని డాక్టర్ ఆనంద్ తెల్ తుంబ్డే, ప్రకాష్ అంబేద్కర్లు డిమాండ్ చేశారు.
రోహిత్ వేముల న్యాయపోరాట సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం హైదర్గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... రోహిత్ వేముల మృతి కారణమైన దోషులను అరెస్ట్ చేయాలని 29 సోమవారం నాంపల్లిలోని గాంధీభవన్ ప్రకాశం హాల్లో బహిరంగసభను నిర్వహించనున్నట్లు వారు తె లిపారు. వీసీ అప్పారావు దళిత విద్యార్థులను సాంఘీక బహిష్కరణకు గురిచేయడంతో 15 రోజులు ఉద్యమించిన న్యాయం జరగకపోవంతో జనవరి 17న రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు.
ఈ ఘటన జరిగి 7 నెలలు గడుస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు రోహిత్ ఎస్సీ కాదని, బీసీ అని దుష్ర్పచారం చేస్తూ నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని వారు మండిపడ్డారు. గుంటూరు జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికతో పాటు జాతీయ ఎస్సీ కమిషన్ రోహిత్ ఎస్సీఅని డిక్లేర్ చేస్తూ సైబరాబాద్ పోలీసులకు ఎస్సీ, ఎస్టీ కేసు విచారణ వెంటనే పూర్తి చేసి, రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం చేయాలని అదేశించి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించి కూడా 4 నెలల గడుస్తుందని అన్నారు.
దళితుల పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకంగా, అగ్రకుల పక్షపతిగా చంద్రబాబు, వెంకయ్య నాయుడు, సుజానాచౌదరిల అడుగులకు మడుగులోత్తుతూ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతుందని మండిపడ్డారు. రోహిత్ మృతికి కారణమైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి, వారిని శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. సోమవారం జరిగే సభను దళితులు, మేదావులు, ప్రజా, కుల సంఘాల నాయకులు విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, బంగారి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.