Anantapur Agriculture Market Committee
-
ప్రజారోగ్యంతో చెలగాటం
మామిడి రూపంలో విషపదార్థం యథేచ్ఛగా విక్రయాలు అనంతపురం అగ్రికల్చర్ : నిగనిగలాడుతూ నోరూరించేలా ఉన్న మామిడి పండ్లనుకొని ఇంటికి తీసుకువెళ్తున్న సగటు వినియోగదారుడు తాను కొన్నది పండ్ల రూపంలో ఉన్న విష పదార్థమని తెలుసుకోలేకపోతున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా ప్రజారోగ్యానికి హాని కలి గించేలా పక్వానికి రాకముందే కాల్షియం కార్బైడ్‌తో మాగబెట్టిన మామిడిని యథేచ్చగా విక్రయిస్తున్నా అధికార యంత్రాంగం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎక్కడ చూసినా కాల్షియం కార్బైడ్ గుళికలే కనిపిస్తున్నాయి. పండ్లను మాగబెట్టిన గోదాముల్లోకి వెళితే అక్కడ శ్వాస తీసుకునేందుకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ మందు ప్రభావం ఏ స్థాయిలో ఉన్న ది దీంతో అర్థమవుతుంది. పచ్చికాయలను కుప్పగా పోసి అందులో కాల్షియం కార్బైడ్ గుళి కలు నింపిన ప్యాకెట్లు వేస్తే కేవలం 12 గం టల్లోనే నిగనిగలాడే రంగుతో కాయలు పళ్లుగా మారిపోతాయి. సాధారణంగా సహజ పద్ధతిలో వరిగడ్డి ద్వారా లేదా రైపనింగ్ చాంబర్లలో ఇథలీన్ గ్యాస్ ద్వారా మాగబెట్టేందుకు కనీసం మూడు రోజులు పడుతుంది. తొందరగా మార్కెట్లో సొమ్ము చేసుకోవాలన్న స్వార్థంతో కొందరు ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్ గుళికలు లేదా అలాంటిదే మరోరకమైన పిచికారి మందు ద్వారా మామిడి కాయలను మాగబెడుతున్నారు. ఇది బహిరంగ రహస్యమే అయినా ఇటు ఫుడ్‌సేప్టీ అధికారులు కాని, అటు మార్కెటింగ్ శాఖ అధికారులు కాని ప్రమాదకర మామిడిపండ్ల విక్రయాన్ని అరికట్టడంలో ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని సర్వత్రా విమర్శలున్నాయి. -
మొండి చేయి
అనంతపురం అగ్రికల్చర్ : వాతావరణ బీమాలో రైతులకు మొండిచేయి చూపారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రైతన్నలు సర్వం కోల్పోయినా అధికారులు, బీమా సంస్థ ఏమాత్రం కరుణ చూపలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా పది మండలాల రైతులకు చిల్లిగవ్వ కూడ దక్కే పరిస్థితి లేకుండా పోయింది. వివరాల్లోకి వెళితే 2013-14 సంవత్సరంలో వేరుశనగ పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వాతావరణ బీమా పథకం కింద నష్టపరిహారం విడుదల చేసింది. జిల్లాలో 53 మండలాల్లోని 4,22,613 మంది రైతులకు రూ. 226,93,06,907 విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఒకేసారి 10 మండలాల రైతులకు నయా పైసా కూడా విడుదల చేయకుండా జాబితాలో జీరో అని పేర్కొనడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. చెన్నేకొత్తపల్లి, గుత్తి, గోరంట్ల, గుంతకల్లు, కుందుర్పి, మడకశిర, నల్లచెరువు, నంబులపూలకుంట, తాడిమర్రి, తాడిపత్రి మండలాలకు నష్టపరిహారం మంజూరు కాలేదు. అధికారుల లెక్కల ప్రకారం గతేడాది ఈ మండలాల్లో విస్తారంగా వర్షాలు కురిసి సమృద్ధిగా వర్షాలు పడ్డాయట. వాస్తవంగా 63 మండలాలు కరువు మండలాలుగా ప్రభుత్వమే ప్రకటించింది. ఏ మండలంలో కూడా అదునులో వర్షాలు పడిన దాఖలాలు లేవు. దీంతో మెట్ట భూముల్లో పంటలు సాగు చేసిన రైతులంతా తీవ్రంగా నష్టపోయారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే అధికారులు మాత్రం ఏకంగా వాతావరణ బీమాలో నుంచి పది మండలాలను తప్పించడం విమర్శలకు దారితీస్తోంది. వాతావరణ బీమా మంజూరు విషయంలో ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని బీమా ప్రీమియం చెల్లించిన రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రఘువీరా సొంతమండలానికే దిక్కులేదు రాష్ట్రంలో పంటల బీమా అంటే గతంలో అందరూ అనంతపురం జిల్లా వైపు చూశారు. ఎందుకంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి హయాంలో అత్యధికంగా జిల్లాకు పంటల బీమా, నష్టపరిహారం రూపంలో రూ.వందల కోట్లు మంజూరయ్యాయి. అప్పట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న రఘువీరారెడ్డి కూడా జిల్లాకు నిధులు తీసుకురావడంలో కృషి చేశారు. గతేడాది రెవెన్యూ శాఖ మంత్రిగా రఘువీరారెడ్డి ఉన్నా.. వాతావరణ బీమాలో మడకశిరకు మెండిచేయి ఎదురు కావడం వ్యవసాయ శాఖలో చర్చనీయాంశమైంది. -
అనంత’ రైతును ఆదుకున్న వైఎస్
భారీ రాయితీలతో రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ల పరికరాలు అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ల పాలనలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న వ్యవసాయ రంగం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రగతి బాట పట్టింది. ప్రధానంగా 2003లో ప్రారంభమైన బిందు( డ్రిప్), తుంపర(స్ప్రింక్లర్లు) సేద్యం పథకం నిత్య క్షామ పీడిత జిల్లా ‘అనంత’లోని రైతుల పాలిట వరమైంది. వైఎస్ సీఎంగా ఉన్న ఆరేళ్ల కాలంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, ఇతర రైతులకు 90 శాతం మేర భారీగా రాయితీలు కల్పించి, అడిగిన వెంటనే డ్రిప్, స్ప్రింక్లర్లు అందించి సూక్ష్మసాగు సేద్యాన్ని పెంచారు. ఆయన హయాంలో 2004-05 నుంచి 2009-10 వరకు మొత్తం రూ.277.45 కోట్ల రాయితీలు ఇచ్చి, 1.13 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సాగు పరికరాలు అందించారు. తద్వారా జిల్లాలో పండ్ల తోటల పెంపకం అభివృద్ధి చెందింది. దీంతో జిల్లా ‘ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’గా ఖ్యాతినార్జించింది. వైఎస్ మరణానంతరం వచ్చిన ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలోని ఐదేళ్ల వ్యవధిలో జిల్లా రైతులకు గ్రహణం పట్టింది. దరఖాస్తు చేసుకుని ఏడాది పాటు ఎదురు చూసినా డ్రిప్, స్ప్రింక్లర్లు అందలేదు. ఈ పథకం బడ్జెట్ కుదించడం, ఎస్సీ, ఎస్టీలు మినహా ఇతర రైతులకు భూ విస్తీర్ణాన్ని బట్టి రాయితీలు నిర్దేశించడంతో సూక్ష్మ సాగు సేద్యం అటకెక్కింది. వీరి పాలనలో జిల్లాలో కేవలం 58 వేల హెక్టార్లకు డ్రిప్, స్ప్రింక్లర్లు అందించి, రూ.200.98 కోట్లు మాత్రమే రాయితీలు కల్పించారు.