మొండి చేయి
అనంతపురం అగ్రికల్చర్ : వాతావరణ బీమాలో రైతులకు మొండిచేయి చూపారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రైతన్నలు సర్వం కోల్పోయినా అధికారులు, బీమా సంస్థ ఏమాత్రం కరుణ చూపలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా పది మండలాల రైతులకు చిల్లిగవ్వ కూడ దక్కే పరిస్థితి లేకుండా పోయింది. వివరాల్లోకి వెళితే 2013-14 సంవత్సరంలో వేరుశనగ పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వాతావరణ బీమా పథకం కింద నష్టపరిహారం విడుదల చేసింది.
జిల్లాలో 53 మండలాల్లోని 4,22,613 మంది రైతులకు రూ. 226,93,06,907 విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఒకేసారి 10 మండలాల రైతులకు నయా పైసా కూడా విడుదల చేయకుండా జాబితాలో జీరో అని పేర్కొనడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. చెన్నేకొత్తపల్లి, గుత్తి, గోరంట్ల, గుంతకల్లు, కుందుర్పి, మడకశిర, నల్లచెరువు, నంబులపూలకుంట, తాడిమర్రి, తాడిపత్రి మండలాలకు నష్టపరిహారం మంజూరు కాలేదు. అధికారుల లెక్కల ప్రకారం గతేడాది ఈ మండలాల్లో విస్తారంగా వర్షాలు కురిసి సమృద్ధిగా వర్షాలు పడ్డాయట.
వాస్తవంగా 63 మండలాలు కరువు మండలాలుగా ప్రభుత్వమే ప్రకటించింది. ఏ మండలంలో కూడా అదునులో వర్షాలు పడిన దాఖలాలు లేవు. దీంతో మెట్ట భూముల్లో పంటలు సాగు చేసిన రైతులంతా తీవ్రంగా నష్టపోయారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే అధికారులు మాత్రం ఏకంగా వాతావరణ బీమాలో నుంచి పది మండలాలను తప్పించడం విమర్శలకు దారితీస్తోంది. వాతావరణ బీమా మంజూరు విషయంలో ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని బీమా ప్రీమియం చెల్లించిన రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
రఘువీరా సొంతమండలానికే దిక్కులేదు
రాష్ట్రంలో పంటల బీమా అంటే గతంలో అందరూ అనంతపురం జిల్లా వైపు చూశారు. ఎందుకంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి హయాంలో అత్యధికంగా జిల్లాకు పంటల బీమా, నష్టపరిహారం రూపంలో రూ.వందల కోట్లు మంజూరయ్యాయి. అప్పట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న రఘువీరారెడ్డి కూడా జిల్లాకు నిధులు తీసుకురావడంలో కృషి చేశారు. గతేడాది రెవెన్యూ శాఖ మంత్రిగా రఘువీరారెడ్డి ఉన్నా.. వాతావరణ బీమాలో మడకశిరకు మెండిచేయి ఎదురు కావడం వ్యవసాయ శాఖలో చర్చనీయాంశమైంది.