బీమా... ఓ డ్రామా
Published Thu, Aug 11 2016 10:58 PM | Last Updated on Mon, Oct 8 2018 4:31 PM
– గతేడాది ఆగస్టు 1 8 నాటికి 40 శాతం తక్కువగా వర్షాలు
– అన్ని మండలాలను కరువు జాబితాలోకి చేర్చాలని నివేదిక
– కానీ.. 24 మండలాలకే బీమా పరిమితం చేయడం విశేషం
అనంతపురం అగ్రికల్చర్ :
వాతావరణ బీమా పథకం ‘అనంత’ వేరుశనగ రైతులను మాయ చేస్తోంది. ఈ ఏడాది జరిగిపోయింది. వచ్చే ఏడాదైనా న్యాయం జరుగుతుందనే ఆశతో ఎదురు చూస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ‘పాలిచ్చే ఆవును అమ్మేసి దున్నను కొన్న’ చందంగా గ్రామం యూనిట్‌గా అమలవుతున్న పంటల బీమా ద్వారా లబ్ధి పొందుతున్న తరుణంలో 2011లో బలవంతంగా వాతావరణ బీమా పథకాన్ని అమలులోకి తెచ్చి ఇబ్బందుల్లోకి నెట్టేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐదేళ్లుగా వాతావరణ బీమా కింద విడుదలవుతున్న పరిహారాన్ని చూస్తే నిజంగానే రైతులకు ఒక్కసారి కూడా న్యాయం జరగలేదు. 2015కు సంబంధించి తాజాగా మంజూరు చేసిన రూ.109 66 కోట్లు పరిహారాన్ని చూస్తే వాతావరణ బీమా ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థమవుతుంది. చివరకు రైతులు చెల్లించిన ప్రీమియం కూడా వెనక్కి రాని విధంగా బీమా కంపెనీ మాయ చేస్తోంది. ఈ క్రమంలో ఈసారి కూడా 24 మండలాల రైతులకు కూడా కంటి తుడుపుగా పరిహారం మంజూరు చేసినట్లు కనిపిస్తోంది.
జిల్లాలో కరువు ఉందని అధికారిక నివేదిక
వర్షాలు లేక జిల్లాలో పంటలు దారుణంగా దెబ్బ తిని కరువు పరిస్థితులు రాజ్యమేలుతున్నాయని గతేడాది ఆగస్టు మూడో వారంలో జిల్లా అధికారులు నివేదిక పంపారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అనంతపురం జిల్లాలో 52 మండలాలు కరువు బారిన పడ్డాయని ప్రకటించింది.
జూన్, జూలై, ఆగస్టు 18వ తేదీ నాటికి జిల్లాలో ఉన్న 63 మండలాల్లో 45 మండలాల్లో వర్షపాతం తక్కువగానూ (డెఫిసీట్), 7 మండలాల్లో మరీ తక్కువ (స్కానిటీ)గానూ మిగతా 11 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు. సుమారు 40 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. పంట దిగుబడులు గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉన్నందున జిల్లాలోని 63 మండలాలను కరువు జాబితాలోకి చేర్చాలని అధికార యంత్రాంగం నివేదించింది. కానీ.. వాతావరణ బీమా కొన్ని మండలాలకు పరిమితం చేస్తూ పరిహారం మంజూరు చేయడం.. 39 మండలాలను పూర్తిగా విస్మరించడంపై రైతులు కన్నెర చేస్తున్నారు.
ఆగస్టు చివర్లో ఆశాజనకంగా వర్షాలు
జూన్ నుంచి మొహం చాటేసిన వరుణుడు ఆగస్టు 18 తర్వాత కరుణించాడు. ఆగస్టుతో పాటు సెప్టెంబర్‌లో కూడా మంచి వర్షాలు పడ్డాయి. ఖరీఫ్ ముగిసే నాటికి 40 శాతం తక్కువగా ఉన్న స్థాయి నుంచి సాధారణ స్థాయికి చేరుకోవడం విశేషం. ఆగస్టులో 88.7 మిల్లీమీటర్లకు గానూ 88, సెప్టెంబర్‌లో 118.4కు గానూ 111 మి.మీ కురిసింది. ఎట్టకేలకు సీజన్ ముగిసేనాటికి 338.4 మి.మీకు 319 మి.మీ వర్షపాతం నమోదైంది. కానీ.. వాతావరణ బీమా మాయాజాలంతో ‘అనంత’ వేరుశనగ రైతులకు మరోసారి అన్యాయం జరిగిపోయింది.
Advertisement
Advertisement