weather insurance
-
రూ.353 కోట్లు బీమా పరిహారం జమ
అనంతపురం అగ్రికల్చర్ : వాతావరణ బీమా పరిహారం రూ.353 కోట్లు బ్యాంకుల్లో జమ అయినట్లు లీడ్ బ్యాంకు వర్గాలు తెలిపాయి. ఖరీఫ్–2016కు సంబంధించి 5.07 లక్షల మందికి మంజూరైన రూ.419 కోట్ల పరిహారంలో బజాజ్ కంపెనీ నుంచి తొలి విడతగా నాలుగు రోజుల కిందట రూ.153 కోట్లు, రెండో విడతగా శనివారం మరో రూ.200 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో మిగతా రూ.66 కోట్లు జమ చేసే అవకాశం ఉందన్నారు. ప్రీమియం కట్టిన రైతుల జాబితాలు పరిశీలించిన తర్వాత త్వరలోనే ఖాతాల్లోకి పరిహారం జమ చేయవచ్చని తెలిపారు. -
అనుకున్నదే అయ్యింది !
జిల్లా రైతులకు మంజూరైన వాతావరణ బీమా రూ.419 కోట్లు రూ.37 కోట్లు ఫసల్ బీమా వచ్చే అవకాశం మొత్తం బీమా పరిహారం రూ.456 కోట్లు ! జిల్లాకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రూ.1,032.69 కోట్లు ఇందులో చంద్రబాబు సర్కారు ఇచ్చేది రూ.60.34 కోట్లే ఇన్సూరెన్స్ డబ్బు తమకు ఇవ్వాలన్న ప్రభుత్వం రైతులు కోర్టుకెళితే సమస్యలు వస్తాయన్న ఇన్సూరెన్స్ కంపెనీ ప్రభుత్వ వైఖరితో ఈసారి బీమా చేసేందుకు బజాజ్ కంపెనీ విముఖత హెచ్‌డీఎఫ్‌సీకి అప్పగింత ప్రభుత్వాన్ని, అధికారులను కోర్టుకు ఈడుస్తామంటున్న విపక్షాలు ’ రైతులను చంద్రబాబు సర్కారు మరోసారి దగా చేసింది. వారికి హక్కుగా దక్కాల్సిన ఇన్సూరెన్స్ సొమ్మును తన ఖాతాలో వేసుకుని.. దీంతో పాటు కాస్త చిల్లర విదిల్చి రైతులను ఆదుకునేందుకు తామేదో ఘన కార్యం చేశామని గొప్పలు చెప్పుకునేందుకు సిద్ధమైంది. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ చెల్లింపులో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం రైతులను దగా చేస్తోంది. అయినా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చోద్యం చూస్తున్నారు. ఇదేమి అన్యాయమని ప్రశ్నించకపోయినా..ఇలా చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని కూడా ముఖ్యమంత్రికి చెప్పలేకపోతున్నారు. మరోవైపు ‘తాను ఆడిందే ఆట..పాడిందే పాట’ అన్నట్లు చంద్రబాబు రూ.60 కోట్లు మాత్రమే ‘అనంత’ రైతులకు విదిల్చి.. రూ.1,032 కోట్లు ఇచ్చినట్లు తప్పుడు మాటలు చెబుతున్నారు. రూ.1,032.69 కోట్లతో ఇన్పుట్ నివేదికలు గత ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 15.15 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగైంది. మరో 4–5 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగయ్యాయి. వేరుశనగ రైతులు ఎకరాకు సగటున రూ.18 వేలు పెట్టుబడి పెట్టారు. వర్షాభావంతో పంట మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. పెట్టుబడులు, దిగుబడుల రూపంలో రూ.3,700 కోట్ల మేర రైతులకు నష్టం వాటిల్లింది. అయితే.. అధికారులు రూ.1,032.69 కోట్ల పంట నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఇందులో రూ.516.34 కోట్లు కేంద్ర ప్రభుత్వం తన వాటాగా విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మేరకు నిధులు విడుదల చేయాలి. కానీ రూ.60.34 కోట్లు మాత్రమే విడుదల చేస్తోంది. తక్కిన రూ.456 కోట్లను బీమా పరిహారం నుంచి సర్దుబాటు చేసి.. దాన్ని ఇన్పుట్ సబ్సిడీలో కలిపి ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇన్సూరెన్స్ సొమ్ము చెల్లింపులోనూ మోసమే.. ఇన్సూరెన్స్ అనేది రైతులకు, బజాజ్ అలయంజ్ కంపెనీకి సంబంధించిన విషయం. ఇందులో ప్రభుత్వ ప్రమేయం, జోక్యం అవసరం లేదు. రైతులు బ్యాంకులో పంట రుణం తీసుకుంటే కచ్చితంగా బీమా ప్రీమియం చెల్లించాలి. లేదంటే బ్యాంకరు రుణం ఇవ్వడు. అంటే రైతు తీసుకున్న రుణానికి ఇన్సూరెన్స్ చేశారన్న మాట! గత ఏడాది స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వేరుశనగకు ఎకరాపై రూ.19,500 చొప్పున రుణాన్ని మంజూరు చేశారు. ఇందులో పది శాతం ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాలి. గతేడాది 10 శాతం ప్రీమియంలో రెండు శాతం రైతుల వాటాగా రూ.56 కోట్లు చెల్లించారు. తక్కిన ఎనిమిది శాతాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాయి. ఈ లెక్కన ప్రభుత్వాలు చెల్లించిన ప్రీమియంతో కలిపి రూ.280 కోట్లు బీమా కంపెనీకి దక్కాయి. రైతులు పంట పూర్తిగా నష్టపోయినందున వారికి హక్కుగా దక్కాల్సిన ఇన్సూరెన్స్ మొత్తం రూ.2,954 కోట్లు. కానీ బీమా కంపెనీ ఇస్తోంది రూ.419 కోట్లు మాత్రమే. అంటే రైతులకు రూ.2,535 కోట్లు నష్టం వాటిల్లినట్లే! గత ఏడాది రైతులు చెల్లించిన ప్రీమియం, దానికి ఏడాదిగా వడ్డీ లెక్కిస్తే బీమా కంపెనీ అదనంగా చెల్లించేది నామమాత్రమేనని స్పష్టమవుతోంది. ప్రభుత్వ దగాతో రూ.456 కోట్ల నష్టం ప్రభుత్వ బాధ్యతగా ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రూ.1,032.69 కోట్లను సర్కారు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలి. అలాగే వాతావరణ, ఫసల్‌బీమా ద్వారా వచ్చే పరిహారం మొత్తం రూ.456 కోట్లను ఇన్సూరెన్స్ కంపెనీలు రైతుల ఖాతాల్లో వేయాలి. మొత్తంగా రైతులకు రూ.1,488.69 కోట్ల పరిహారం దక్కాలి. ఇన్పుట్ సబ్సిడీలో కేంద్రం వాటా రూ.516 కోట్లు పోనూ, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ మేరకు చెల్లించాలి. కానీ రూ.456 కోట్ల బీమా సొమ్మును తానే తీసేసుకుని..దీనికి రూ.60.34 కోట్లను జతచేసి మొత్తం ఇన్పుట్ సబ్సిడీ తానే ఇస్తున్నట్లు అసత్య ప్రకటనలు చేస్తోంది. ప్రభుత్వ దగా కారణంగా రైతులు రూ.456 కోట్ల మేర నష్టపోతున్నారు. కాగా.. పరిహారం డబ్బును వారం తర్వాత రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోర్టు కేసులతో అధికారుల్లో వణుకు...చేతులెత్తేసిన బజాజ్ కంపెనీ? ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌కు ముడిపెడితే కోర్టును ఆశ్రయిస్తామని రైతులు హెచ్చరించడంతో అధికారుల్లో వణుకు మొదలైంది. నిజానికి ప్రభుత్వం, అధికారులు, బీమా కంపెనీ చేస్తోంది తప్పు. బజాజ్ కంపెనీ పరిహారాన్ని రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయాలి. కానీ, ఆ మొత్తాన్ని తమకు ఇవ్వాలని కంపెనీపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి ఇచ్చే హక్కు కంపెనీకి లేదు. దీనిపై రైతులు కోర్టుకు వెళితే సంస్థ చిక్కుల్లో పడుతుంది. దీంతో ఈ ఏడాది వాతావరణ బీమా బాధ్యత నుంచి బజాజ్ కంపెనీ తప్పుకుంది. దీంతో ప్రభుత్వం హెచ్డీఎఫ్సీ ఇన్సూరెన్స్‌కు బాధ్యతలు అప్పగించింది. ఏదిఏమైనా పరిహారం పంపిణీ మొదలైన తర్వాత నిర్దిష్టమైన సాక్ష్యాలతో అందరినీ కోర్టుమెట్లు ఎక్కిస్తామని విపక్షాలు, రైతు సంఘాల ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. -
బీమా... ఓ డ్రామా
– గతేడాది ఆగస్టు 1 8 నాటికి 40 శాతం తక్కువగా వర్షాలు – అన్ని మండలాలను కరువు జాబితాలోకి చేర్చాలని నివేదిక – కానీ.. 24 మండలాలకే బీమా పరిమితం చేయడం విశేషం అనంతపురం అగ్రికల్చర్ : వాతావరణ బీమా పథకం ‘అనంత’ వేరుశనగ రైతులను మాయ చేస్తోంది. ఈ ఏడాది జరిగిపోయింది. వచ్చే ఏడాదైనా న్యాయం జరుగుతుందనే ఆశతో ఎదురు చూస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ‘పాలిచ్చే ఆవును అమ్మేసి దున్నను కొన్న’ చందంగా గ్రామం యూనిట్‌గా అమలవుతున్న పంటల బీమా ద్వారా లబ్ధి పొందుతున్న తరుణంలో 2011లో బలవంతంగా వాతావరణ బీమా పథకాన్ని అమలులోకి తెచ్చి ఇబ్బందుల్లోకి నెట్టేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా వాతావరణ బీమా కింద విడుదలవుతున్న పరిహారాన్ని చూస్తే నిజంగానే రైతులకు ఒక్కసారి కూడా న్యాయం జరగలేదు. 2015కు సంబంధించి తాజాగా మంజూరు చేసిన రూ.109 66 కోట్లు పరిహారాన్ని చూస్తే వాతావరణ బీమా ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థమవుతుంది. చివరకు రైతులు చెల్లించిన ప్రీమియం కూడా వెనక్కి రాని విధంగా బీమా కంపెనీ మాయ చేస్తోంది. ఈ క్రమంలో ఈసారి కూడా 24 మండలాల రైతులకు కూడా కంటి తుడుపుగా పరిహారం మంజూరు చేసినట్లు కనిపిస్తోంది. జిల్లాలో కరువు ఉందని అధికారిక నివేదిక వర్షాలు లేక జిల్లాలో పంటలు దారుణంగా దెబ్బ తిని కరువు పరిస్థితులు రాజ్యమేలుతున్నాయని గతేడాది ఆగస్టు మూడో వారంలో జిల్లా అధికారులు నివేదిక పంపారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అనంతపురం జిల్లాలో 52 మండలాలు కరువు బారిన పడ్డాయని ప్రకటించింది. జూన్, జూలై, ఆగస్టు 18వ తేదీ నాటికి జిల్లాలో ఉన్న 63 మండలాల్లో 45 మండలాల్లో వర్షపాతం తక్కువగానూ (డెఫిసీట్), 7 మండలాల్లో మరీ తక్కువ (స్కానిటీ)గానూ మిగతా 11 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు. సుమారు 40 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. పంట దిగుబడులు గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉన్నందున జిల్లాలోని 63 మండలాలను కరువు జాబితాలోకి చేర్చాలని అధికార యంత్రాంగం నివేదించింది. కానీ.. వాతావరణ బీమా కొన్ని మండలాలకు పరిమితం చేస్తూ పరిహారం మంజూరు చేయడం.. 39 మండలాలను పూర్తిగా విస్మరించడంపై రైతులు కన్నెర చేస్తున్నారు. ఆగస్టు చివర్లో ఆశాజనకంగా వర్షాలు జూన్ నుంచి మొహం చాటేసిన వరుణుడు ఆగస్టు 18 తర్వాత కరుణించాడు. ఆగస్టుతో పాటు సెప్టెంబర్‌లో కూడా మంచి వర్షాలు పడ్డాయి. ఖరీఫ్ ముగిసే నాటికి 40 శాతం తక్కువగా ఉన్న స్థాయి నుంచి సాధారణ స్థాయికి చేరుకోవడం విశేషం. ఆగస్టులో 88.7 మిల్లీమీటర్లకు గానూ 88, సెప్టెంబర్‌లో 118.4కు గానూ 111 మి.మీ కురిసింది. ఎట్టకేలకు సీజన్ ముగిసేనాటికి 338.4 మి.మీకు 319 మి.మీ వర్షపాతం నమోదైంది. కానీ.. వాతావరణ బీమా మాయాజాలంతో ‘అనంత’ వేరుశనగ రైతులకు మరోసారి అన్యాయం జరిగిపోయింది. -
మొండి చేయి
అనంతపురం అగ్రికల్చర్ : వాతావరణ బీమాలో రైతులకు మొండిచేయి చూపారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో రైతన్నలు సర్వం కోల్పోయినా అధికారులు, బీమా సంస్థ ఏమాత్రం కరుణ చూపలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా పది మండలాల రైతులకు చిల్లిగవ్వ కూడ దక్కే పరిస్థితి లేకుండా పోయింది. వివరాల్లోకి వెళితే 2013-14 సంవత్సరంలో వేరుశనగ పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వాతావరణ బీమా పథకం కింద నష్టపరిహారం విడుదల చేసింది. జిల్లాలో 53 మండలాల్లోని 4,22,613 మంది రైతులకు రూ. 226,93,06,907 విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఒకేసారి 10 మండలాల రైతులకు నయా పైసా కూడా విడుదల చేయకుండా జాబితాలో జీరో అని పేర్కొనడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. చెన్నేకొత్తపల్లి, గుత్తి, గోరంట్ల, గుంతకల్లు, కుందుర్పి, మడకశిర, నల్లచెరువు, నంబులపూలకుంట, తాడిమర్రి, తాడిపత్రి మండలాలకు నష్టపరిహారం మంజూరు కాలేదు. అధికారుల లెక్కల ప్రకారం గతేడాది ఈ మండలాల్లో విస్తారంగా వర్షాలు కురిసి సమృద్ధిగా వర్షాలు పడ్డాయట. వాస్తవంగా 63 మండలాలు కరువు మండలాలుగా ప్రభుత్వమే ప్రకటించింది. ఏ మండలంలో కూడా అదునులో వర్షాలు పడిన దాఖలాలు లేవు. దీంతో మెట్ట భూముల్లో పంటలు సాగు చేసిన రైతులంతా తీవ్రంగా నష్టపోయారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే అధికారులు మాత్రం ఏకంగా వాతావరణ బీమాలో నుంచి పది మండలాలను తప్పించడం విమర్శలకు దారితీస్తోంది. వాతావరణ బీమా మంజూరు విషయంలో ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని బీమా ప్రీమియం చెల్లించిన రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. రఘువీరా సొంతమండలానికే దిక్కులేదు రాష్ట్రంలో పంటల బీమా అంటే గతంలో అందరూ అనంతపురం జిల్లా వైపు చూశారు. ఎందుకంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి హయాంలో అత్యధికంగా జిల్లాకు పంటల బీమా, నష్టపరిహారం రూపంలో రూ.వందల కోట్లు మంజూరయ్యాయి. అప్పట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న రఘువీరారెడ్డి కూడా జిల్లాకు నిధులు తీసుకురావడంలో కృషి చేశారు. గతేడాది రెవెన్యూ శాఖ మంత్రిగా రఘువీరారెడ్డి ఉన్నా.. వాతావరణ బీమాలో మడకశిరకు మెండిచేయి ఎదురు కావడం వ్యవసాయ శాఖలో చర్చనీయాంశమైంది.