తపతి... కురు మాత!
ఓ వింధ్య కొండమ్మ... ఓ సాత్పూర కోనమ్మ... రెండు వేల అడుగుల ఎత్తులో అలవోకగా జాలువార్చిన కొన్ని నీటి చుక్కలే నా ప్రయాణానికి తొలి అడుగులు. భారతమాత హృదయం నుంచి ఉద్భవించాను. నేను పుట్టిన ప్రదేశాన్ని ముల్తాయ్, మూల్తాపి అనీ పిలుస్తారు. నన్ను మాత్రం తపతి, తపి, తప్తి, తాపి... రకరకాలుగా పిలుస్తారు. నేను ఎంతటి వేసవి తాపాన్నయినా ఇట్టే తీరుస్తాను. నా తండ్రి సూర్యభగవానుడు. నేను చంద్రవంశ రాజు శన్వరుణ్ణి వివాహమాడాను. నాకు, శన్వరుడికి పుట్టిన బిడ్డకు ‘కురు’ అని పేరు పెట్టుకున్నాను. కురువంశానికి ఆద్యుడు నా కొడుకు కురుడే. మహాభారతాన్ని ఒక తాటి మీదకు తెచ్చిన రాజవంశం అది. దాయాదుల పోరుతో నిర్వంశం అయిన వంశం కూడా. అయినా పాండురాజు కుమారులు తాము వేరంటూ తమ తండ్రి పేరుతో కొనసాగారు కానీ, కౌరవులు, పాండవులు అందరూ నా తనయుడు కురుని పౌత్రులే. ఇంత గొప్ప రాజవంశానికి మూల మాతను కావడంతోనే హిందువులు నన్ను అంతగా ఆరాధిస్తారు. థాయ్‌ల్యాండ్ వాసులు కూడా ఓ నదికి నా పేరు పెట్టుకున్నారు. గంగా స్నానం, నర్మద దర్శనం వలన కలిగే పుణ్యం నన్ను స్మరించుకుంటేనే వస్తుందని నాకు మహోన్నతమైన స్థానాన్నిచ్చాయి మన పురాణాలు.
పశ్చిమంగా సాగే ప్రయాణం!
భరతమాత గుండెను స్పృశిస్తూ మొదలైన నేను పశ్చిమ ముఖంగా సాగిపోతుంటాను. భారతమ్మ ఒడి నుంచి ఎన్నో నదులు తూర్పు ముఖంగా సాగిపోతుంటాయి. గవిల్ఘర్ కొండల్లో పుట్టిన నేను నర్మదక్కయ్యతోపాటుగా పడమటి తీరాన్నే నా గమ్యం అనుకున్నాను. మా ఇద్దర్నీ చూసిన ‘మాహి’ కూడా మా మార్గాన్నే పట్టింది. నర్మదతోపాటుగా సాగుతున్న నా ప్రస్థానాన్ని సాత్పూర పర్వతాలు వేరు చేస్తుంటాయి. మధ్యప్రదేశానికి దక్షిణ ఆగ్నేయంగా నేను పుట్టిన ప్రదేశం దక్కన్కు ముఖద్వారం వంటిది. నా ప్రయాణం ఏడు వందల కిలోమీటర్లే. అయితే నలభైకి పైగా ఉపనదులు నాతో జతకట్టి నన్ను పరిపుష్టం చేస్తూ ఉంటాయి. దాంతో భారతదేశం భూభాగంలో రెండు శాతం మేర నేలను నా ప్రవాహమే ఆక్రమించుకుంటోంది. అబ్బో! నాకెన్ని ఉపనదులో!! మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లా ముల్తాయ్‌లో పుట్టిన నాకు అదే జిల్లాలో మచ్నా, సంపనా నదులు తోడవుతాయి. ఆ తర్వాత మిగిలినవన్నీ పలుకరిస్తూ గుజరాత్ రాష్ట్రంలో సూరత్‌కి చేరేటప్పటికి ‘నేసు’ కలిసి అరేబియా సముద్రం ఇక ఎంతో దూరం లేదని చెబుతుంది. ఇక్కడ నేల నన్ను సునాయాసంగా సాగరంలో కలవనివ్వదు. ఎత్తుపల్లాలుగా ఉండి నా ప్రయాణాన్ని వెక్కిరిస్తుంటుంది. సాగర ఘోష వినిపిస్తూనే ఉంటుంది. ఎప్పడెప్పుడు చేరుకుందామా అనే ఉబలాటంతో పాయలుగా చీలి పలుచబడుతూ పల్లానికి జారిపోతూంటాను. నా కోసం వెతికే వారి దాహార్తిని తీర్చడానికి అక్కడక్కడా చెలమలుగా నిలిచి పోతాను. ఏది ఏమైనా నీటిని వినియోగించుకోవడం పాశ్చాత్యులకు తెలిసినంతగా భారతీయులకు తెలియదు. నా పాయల మధ్యలో ఆంగ్లో - పోర్చుగీసు కాలనీలు వచ్చిన తర్వాతనే నాకూ ఆ సంగతి తెలిసింది.
దక్షిణాదికి దారి...
బుర్హాన్పూర్లో పురాతన కాలంలో పాళీ భాషలో రాసిన బౌద్ధ శాసనాలను చూశాను. బుర్హాన్పూర్ పట్టణానికి 20 కిమీల దూరంలో ఆసిర్గఢ్ కోట కోసం పునాదులు తీయడాన్ని చూశాను. హూణుల దాడులను, ఆశా ఆహిర్ పాలనను చూశాను. గుజరాత్‌ను ఆక్రమించుకున్న తర్వాత హుమాయూన్ ఆసిర్గఢ్ కోటను సందర్శించడం నా కళ్ల ముందే జరిగింది. దక్షిణాదికి ముఖద్వారం ఇదేనంటూ దక్కను మీద దృష్టి పెట్టడం వంటి ఎన్నో చారిత్రక ఘట్టాలకు, వ్యూహాలకు ప్రత్యక్ష సాక్షిని. మరికొంత ముందుకెళ్తే కేదారేశ్వర్లో పురాతన శివాలయం, జల్గావ్లో ఛంగ్దేవ్లో ఛంగ్దేవ్ మహారాజ్ ఆలయాలను చూస్తుంటే నాటి గిరిజన సంస్కృతి, అడవి తల్లిని ఆశ్రయించిన వారి జీవనశైలి కళ్ల ముందు మెదులుతుంటాయి. గోండులు, కోర్కులు, కుర్మీలు, బోయలు, మెహరులు, కుంబిలు, చామరులు, బాణుల వంటి అడవిపుత్రులతోపాటు రాజపుత్రులు కూడా నా తీరాన్నే సంతోషంగా జీవించేవారు. మధ్యప్రదేశ్ దాటి మహారాష్ట్రలోకి అడుగుపెడుతుంటే అమరావతి జిల్లాలో మేల్ఘాట్ టైగర్ రిజర్వ్ పలకరిస్తుంది.
మూడో నంబరు జాతీయ రహదారికి అడ్డుగా ప్రయాణిస్తున్నానని నా మీద ‘ధులే’ దగ్గర ‘సావాల్దే’ వంతెన కట్టారు. అలాగే భుస్వాల్ దగ్గర ‘భుస్వాల్ - ఖాండ్వా’ రైల్వే వంతెన కూడా కట్టేశారు. ‘హమ్మయ్య! ఇక నేనెవరి ప్రయాణానికీ అడ్డుగా లేను’ అనుకునే లోపు హత్నూర్ డ్యామ్, ఉకై డ్యామ్‌లు... నాకు దాహార్తిని తీర్చి, పంటలను సస్యశ్యామలం చేయడంతోపాటు జలవిద్యుత్తుతో వెలుగునిచ్చే శక్తి కూడా ఉందని చెప్పాయి. సూరత్‌లో అడుగుపెడితే పరిశ్రమలే పరిశ్రమలు. ఎస్సార్ స్టీల్, రిలయెన్స్, ఓఎన్జిసి, ఎల్ అండ్ టి, గెయిల్, క్రిభ్కో, షెల్, ఎన్టిపిసి, జిఎస్‌పిసి, టొరంట్ పవర్ యూనిట్లు... ప్రపంచం అంతా నా కళ్ల ముందే ఉందన్నంత భరోసానిస్తుంటాయి. వజ్రాలు, దుస్తుల దుకాణాలైతే 60 వేలు... ఇంతటి భాగ్యాన్ని చూసి నా కళ్లు మిరుమిట్లు గొలుపుతాయో ఏమో వర్షాకాలంలో ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరిగి ఆరు లక్షల క్యూసెక్కుల నీటితో నగరాన్ని ముంచెత్తుతుంటాను. నా అల్లరిని అదుపు చేయడానికి వరదల నుంచి రక్షణ కోసం ప్రత్యేక చర్యలు మొదలవుతున్నాయి.
నా పేరుతో ఓ రైలు నడుస్తోంది తెలుసా? ఆ రైలు ప్రయాణం నిడివి 1726 కి.మీ.లు. నాకంటే ఎక్కువ దూరమే ప్రయాణిస్తోంది. నేను మధ్యప్రదేశ్‌లో పుట్టి మహారాష్ట్రను పలకరించి గుజరాత్ వరకు ప్రయాణిస్తుంటే నా పేరుతో నడిచే రైలు బీహార్‌లోని సూరాన్ జిల్లాలో మొదలై ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల మీదుగా గుజరాత్ వరకు ప్రయాణిస్తుంది. నాలాగే ఆ రైలు ప్రయాణం కూడా సూరత్ వరకే.
అదిగో... మాటల్లోనే గల్ఫ్ ఆఫ్ కాంబాత్ వచ్చింది. సముద్రపు ఆటుపోట్లకు డాల్ఫిన్లు ఎదురొస్తున్నాయి. అలలు ఆత్మీయంగా వచ్చి పాదాలు తాకుతున్నాయి. అరబిక్ కడలి తీరం ఎంత అందంగా ఉంటుందో వర్ణించడానికి మాటలు చాలవు. నేను ఇంతగా పరుగులు తీసింది ఈ సౌందర్యాన్ని చూడడానికే.
ప్రెజెంటేషన్: వాకా మంజులారెడ్డి
జన్మస్థానం
మధ్యప్రదేశ్ రాష్ట్రం, బేతుల్ జిల్లాలోని ముల్తాని.
సాత్పూర పర్వత శ్రేణులు
సంగమస్థానం
గుజరాత్ రాష్ట్రం, సూరత్ జిల్లా, గల్ఫ్ ఆఫ్ కాంబాత్ (దుమాస్)
ప్రవాహదూరం 724 కి.మీ.లు