కొలిక్కి వచ్చిన ‘ఆప్కో’ విభజన
45 షోరూంలు తెలంగాణకు ! తేలాల్సిన ఆంధ్రావాటా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సహకార సంఘం (ఆప్కో) విభజన ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే పాలక మండలి విభజనకు ఆమోదం లభించడంతో జూన్ మొదటి వారంలోగా ఈ పక్రియ కొలిక్కిరానుంది. ఎక్కడి ఆస్తులు అక్కడే ప్రాతిపదికన మార్గదర్శకాలు రూపొందిం చారు. సంస్థ ఆదాయం, అప్పులపై ఆడిట్ విభాగం లెక్కలు సిద్ధం చేస్తోంది. ఆప్కో ఉత్పత్తుల విక్రయాల్లో కీలకమైన షోరూములను రెండు కేటగిరీలుగా విభజించారు. ఉమ్మడి రాష్ట్రంలో వున్న షోరూంలు, గోదాములను ఎక్కడివి అక్కడే ప్రాతిపదికగా కేటాయిస్తారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న షోరూములు ఎవరికి చెందాలనేదానిపై ఏకాభిప్రాయానికి రావాల్సి వుంది. ఆప్కో పరిధిలో మొత్తం 184 షోరూంలుండగా, వీటిలో తెలంగాణ పరిధిలోకి 45 వస్తున్నాయి. మరో 26 షోరూంలు బయటి రాష్ట్రాల్లో అనగా గుర్గాంవ్, ఔరంగాబాద్, నాందేడ్, కాన్పూర్, న్యూఢిల్లీ, కటక్, కోల్‌కతా, బెంగళూరు, మైసూరు, దావణగెరి, బళ్లారి తదితర పట్టణాల్లో ఉన్నాయి. బయటి రాష్ట్రాల్లో ఒకటి కంటే ఎక్కువ షోరూంలు ఉన్న చోట రెండు రాష్ట్రాలకు సమాన నిష్పత్తిలో కేటాయిస్తారు. వరంగల్, హైదరాబాద్‌లోని ఆప్కో గోదాములు తెలంగాణకే చెందనున్నాయి.
పాలక మండలి విభజన పూర్తి
ప్రస్తుతం ఆప్కో పాలక మండలిలోని మొత్తం 24 మంది డెరైక్టర్లకుగాను తెలంగాణకు 11, ఆంధ్రప్రదేశ్‌కు 13 మందిని కేటాయించారు. దీంతో మురుగుడు హన్మంతరావు నాయక త్వంలోని ప్రస్తుత పాలకమండలి ఉనికి కోల్పోయినట్లే. 42ః58 నిష్పత్తిలో తెలంగాణ, ఏపీకి ఉద్యోగుల పంపిణీ జరగనుంది. స్థానికత ఆధారంగా తెలంగాణకు 108, ఏపీకి 200 మంది ఉద్యోగులను కేటాయించాలని నిర్ణయించారు. జూన్ మొదటి వారంలోగా విభజన ప్రక్రియ పూర్తికానున్నట్లు అధికారులు వెల్లడించారు