మీరు మ్యాడ్ మెన్ కావద్దు!
కొత్త పుస్తకం: మై హజ్బెండ్ డజన్ట్ లవ్ మీ
ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, మరొక అమ్మాయితో ప్రేమాయణం సాగించడాన్ని చాలా గొప్పగా భావిస్తారు కొందరు మగాళ్లు. భర్త వేరొక అమ్మాయితో ఎఫైర్ సాగిస్తున్నాడని భార్యకు తెలిసిన రోజు ఇంట్లో రచ్చ రచ్చ అవుతుంది. ‘అలాంటిదేమీ లేదు’ అని బుకాయించాలని చూసినప్పటికీ భార్యాభర్తల మధ్య ప్రేమ స్థానంలో ‘అనుమానం’ అనే పెనుభూతం పెద్ద కుర్చీ వేసుకొని కూర్చుంటుంది. ఒకే ఇంట్లో ఉండి కూడా రెండు వేరు వేరు దీవుల్లో ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు...ఇలాంటి సమస్యలను తన పుస్తకంలో లోతుగా విశ్లేషించారు ఆండ్రూ జి. మార్షల్.
ఇటీవల విడుదలైన ‘మై హజ్బెండ్ డజన్ట్ లవ్మీ’ పుస్తకంలో భార్యాభర్తలకు ఉపకరించే కొన్ని విషయాలు...
ఆయనకు వేరే స్త్రీతో సంబంధం ఉందనే విషయం తెలిసినప్పుడు...మీ కడుపులో ఎన్నో అగ్నిపర్వతాలు రగులుతుంటాయి. అంతమాత్రాన ఆవేశమే సమస్యకు పరిష్కారం కాదు.
‘‘నేను మీకు నచ్చలేదేమో’’ అని సారీ చెప్పండి. మగవాడు పశ్చాత్తాపంతో బాధపడతాడు. మారిపోతాడు.
సంసారంలో ‘పారదర్శకత’ అనేది ముఖ్యం. ‘రహస్యం’ అనేది శత్రువు.
సమస్యకు ‘పరిష్కారం’ గురించి ఆలోచించాలి తప్ప ‘ప్రతీకారం’ గురించి ఆలోచించవద్దు.
భార్య ఎప్పుడూ ఏదో ఒకటి అంటుందనే సాకుతో...సంతోషాన్ని, శాంతిని బయట వెదుక్కోవడం మానేయాలి.
టీవి షో ‘మ్యాడ్ మెన్’లో మాదిరిగా మగాళ్ల సంబంధాలన్నీ పనిచేసే స్థలంలోనే మొదలవుతాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ప్రతి స్నేహం ప్రేమ కాదు. సంబంధం అంతకంటే కాదు.మౌనంగా ఉండి శత్రుత్వాన్ని పెంచుకోవడం కంటే, తగాదా పడైనా సరే సమస్యను పరిష్కరించుకోవడమే మేలు.
ఎవరి వాదన వారు వినిపించుకోవచ్చు. అపోహలను తొలగించుకోవచ్చు.
మోసం చేసే మగాడిలో ‘మోసం’ శాశ్వతం కాదు. ప్రేమతో అతడిని జయించవచ్చు.
ప్రతి నిరాశలోనూ ఒక ఆశ ఉంటుంది. ఇద్దరి మధ్య దూరం పెరిగినంత మాత్రాన ఇక ఎప్పుడూ దగ్గరవ్వరనికాదు...ప్రయత్నిస్తే కలవడం కష్టమేమీ కాదు.