anglo indian women
-
శతమానం: సెంచరీలోనూ సేవాగుణం తగ్గలే!
ఎంత అరగదీసినా, గంధం చెక్కకు సుగంధం తగ్గనట్టుగా... వందేళ్ల వయసు మీద పడి శరీరంలో సత్తువ తగ్గినా తమలో ఉన్న సాయం చేసే గుణంతో ఎలాగో ఒకలాగా చెయ్యందించాలని తాపత్రయ పడుతుంటారు. ఈ కోవకు చెందిన కేట్ ఆర్చర్డ్ వందేళ్ల వయసులో ఆకాశంలో ఎగురుతూ నిధులు సేకరించి సాయం చేయడానికి పూనుకుంది.‘సెంచరీలోనూ స్పీడు తగ్గలే’ అంటూ ఏకంగా యుద్ధవిమానం నడిపేసింది. ఇంగ్లాండ్‌లోని కార్నవాల్లో నివాసముంటోన్న కేట్ ఆర్చర్డ్ ఆంగ్లో ఇండియన్. పదముగ్గురు సంతానంలో కేట్ ఒకరు. కేట్ చిన్నవయసులో ఆమె కుటుంబం ఇండియాలోనే ఉండేది. కేట్ తండ్రి ఇండియన్ రైల్వేస్‌లో చీఫ్ టెలిగ్రాఫ్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. 1941లో ఉమెన్స్ ఆగ్జిలరీ ఎయిర్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఈ ఫోర్స్‌లో తన ఇద్దరు తోబుట్టువులతో కలసి 20 ఏళ్ల వయసులో వాలంటీర్‌గా చేరింది. వాలంటీర్‌గా పనిచేస్తూనే ఫస్ట్‌క్లాస్ వారెంట్ ఆఫీసర్‌గా, సర్వీస్ అండ్ ఇండియా సర్వీస్ మెడల్స్‌ను అందుకుంది. తరువాత ఎయిర్ డిఫెన్స్‌కు చెందిన చెన్నైలోని ఐదోనంబర్ ఫిల్టర్ రూమ్‌లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసింది. ఇలా పనిచేస్తూనే రెండో ప్రపంచ యుద్ధసమయంలో యుద్ధ విమానాలకు సిగ్నల్స్‌ను అందించేది. శత్రు యుద్ధవిమానాలను కూల్చడంలో ఈ సిగ్నల్స్ ప్రముఖ పాత్ర పోషించేవి. 24 గంటలపాటు వార్నింగ్ సిస్టమ్స్‌ను గమనిస్తూ ఎప్పటికప్పుడు పైలట్లకు సూచనలు ఇస్తుండేది. పనిప్రదేశంలో సహోద్యోగి నచ్చడంతో పెళ్లి చేసుకుని ఇంగ్లాండ్ వెళ్లి అక్కడే స్థిరపడింది. ప్రస్తుతం కేట్కు 99 ఏళ్లు. మాతృభూమికి ఏదైనా చేయాలన్న కోరిక కలిగింది కేట్కు. దీంతో చారిటీ కోసం నిధులు సేకరించాలనుకుంది. ఇందుకోసం తను చేసిన ఉద్యోగానుభవాన్ని ఎంచుకుంది. సీహాక్ గ్లైడింగ్ క్లబ్‌ను కలిసి, గ్లైడర్ సాయంతో యుద్ధవిమానంలో ఆకాశంలో చక్కర్లు కొట్టింది. ఎంతో జాగ్రత్తగా టేకాఫ్ చేయడమేగాక, సురక్షితంగా ల్యాండ్ చేసింది. తన వందో పుట్టినరోజుకి కేవలం వారం రోజుల ముందు ఈ కార్యక్రమాన్ని చేపట్టిందామె. ఇలా చక్కర్లు కొట్టడం ద్వారా వచ్చిన నిధులను ఆర్మీ హీరోలకు సహాయ నిధిగా అందించనుంది కేట్. ‘‘ఆర్మీలో పనిచేసి, రిటైర్ అయిన వారంతా శారీరకంగా, మానసికంగా అలసిపోయి ఉంటారు. వీరికి సాయం చాలా అవసరం. అందుకే ఈ ట్రిప్‌ను చేపట్టాను. ట్రిప్ చాలా బావుంది. కొన్నిసార్లు నేను కూడా విమానాన్ని నియంత్రించ గలిగాను’’ అని చిరునవ్వుతో చెబుతున్న కేట్ సేవకు ఆకాశమే హద్దన్నట్లుగా ఎంతోమందిలో స్ఫూర్తినింపుతోంది. -
ఆంగ్లో ఇండియన్ యువతిపై అత్యాచారం
సాక్షి, విశాఖపట్నం: స్థానికంగా ఒక స్టార్ హోటల్లో పనిచేస్తున్న ఆంగ్లో ఇండియన్ యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో ఆ హోటల్లో పనిచేస్తున్న శ్రీధర్ ఆమెతో ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకుని తనతో తీసుకెళ్లి స్నేహితునితో కలిసి ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు బాధితురాలు మూడవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. పోతీన మల్లయ్యపాలెం ప్రాంతానికి చెందిన యువతి నగరంలోని ఓ స్టార్ హోటల్ పనిచేస్తోంది. ఈ నెల 4వ తేదీ రాత్రి 11 గంటలకు విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిపోయింది. గతంలో ఆ హోటల్లో పనిచేసి మానేసిన శ్రీధర్ ఆమె నివాసానికి వెళ్లి తనతో బయటకు రమ్మన్నాడు. రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో ఆ యువతి వచ్చింది. ఇద్దరూ క్యాబ్‌లో ఆమె పనిచేస్తున్న హోటల్ వద్దకు చేరుకున్నారు. దాని వెనుక బీచ్ వైపు వెళ్లి కాసేపు ఇద్దరూ మద్యం (బీర్) సేవించారు. అనంతరం యువతి మత్తులోకి జారుకుంది. ఉదయం లేచి ఇంటికి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన తర్వాత తనపై లైంగిక దాడి జరిగినట్లు యువతి గుర్తించింది. విషయం తల్లిదండ్రులకు చెప్పింది. అయితే పరువుపోతుందని భయపడి వారు ఈ విషయాన్ని బయటపెట్టలేదు. బాగా ఆలోచించుకుని ఈ నెల 7వ తేదీన మూవడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీధర్‌తో పాటు మరో వ్యక్తి కూడా తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో ఆ యువతి పేర్కొంది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకులు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. యువతిని వైద్య పరీక్షల కోసం కేజీహెచ్‌కు తరలించారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని, అయితే ఈ కేసులో స్పష్టత లేదని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు అన్నారు. ఘటనపై సందేహాలు ఇక తాజా సంఘటన స్టార్ హోటల్లో ఉద్యోగినిపై జరిగింది. అయితే నిందితులతో కలిసి బాధితురాలు మద్యం సేవించడం అనుమానాలకు తావిస్తోంది. పైగా ఇద్దరు నిందితుల్లో ఒకరు ఆమె పనిచేస్తున్న హోటల్లోనే పనిచేసి ఉండటంతో అతనితో ఆమెకు పూర్వ పరిచయం ఉందని, ఆ కారణంగానే అతను పిలవగానే కారులో వెళ్లి, మద్యం సేవించి ఉంటుందని భావిస్తున్నారు. చివరికి ఆ మత్తులో దొరికిన అవకాశాన్ని నిందితులు వినియోగించుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే రెండు రోజుల తర్వాత ఫిర్యాదు చేయడం కూడా సందేహాలకు తావిస్తోంది.