ఎంత అరగదీసినా, గంధం చెక్కకు సుగంధం తగ్గనట్టుగా... వందేళ్ల వయసు మీద పడి శరీరంలో సత్తువ తగ్గినా తమలో ఉన్న సాయం చేసే గుణంతో ఎలాగో ఒకలాగా చెయ్యందించాలని తాపత్రయ పడుతుంటారు. ఈ కోవకు చెందిన కేట్ ఆర్చర్డ్ వందేళ్ల వయసులో ఆకాశంలో ఎగురుతూ నిధులు సేకరించి సాయం చేయడానికి పూనుకుంది.‘సెంచరీలోనూ స్పీడు తగ్గలే’ అంటూ ఏకంగా యుద్ధవిమానం నడిపేసింది.
ఇంగ్లాండ్‌లోని కార్నవాల్‌లో నివాసముంటోన్న కేట్ ఆర్చర్డ్ ఆంగ్లో ఇండియన్. పదముగ్గురు సంతానంలో కేట్ ఒకరు. కేట్ చిన్నవయసులో ఆమె కుటుంబం ఇండియాలోనే ఉండేది. కేట్ తండ్రి ఇండియన్ రైల్వేస్‌లో చీఫ్ టెలిగ్రాఫ్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేసేవారు. 1941లో ఉమెన్స్ ఆగ్జిలరీ ఎయిర్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఈ ఫోర్స్‌లో తన ఇద్దరు తోబుట్టువులతో కలసి 20 ఏళ్ల వయసులో వాలంటీర్‌గా చేరింది. వాలంటీర్‌గా పనిచేస్తూనే ఫస్ట్‌క్లాస్ వారెంట్ ఆఫీసర్‌గా, సర్వీస్ అండ్ ఇండియా సర్వీస్ మెడల్స్‌ను అందుకుంది.
తరువాత ఎయిర్ డిఫెన్స్‌కు చెందిన చెన్నైలోని ఐదోనంబర్ ఫిల్టర్ రూమ్‌లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసింది. ఇలా పనిచేస్తూనే రెండో ప్రపంచ యుద్ధసమయంలో యుద్ధ విమానాలకు సిగ్నల్స్‌ను అందించేది. శత్రు యుద్ధవిమానాలను కూల్చడంలో ఈ సిగ్నల్స్ ప్రముఖ పాత్ర పోషించేవి. 24 గంటలపాటు వార్నింగ్ సిస్టమ్స్‌ను గమనిస్తూ ఎప్పటికప్పుడు పైలట్‌లకు సూచనలు ఇస్తుండేది. పనిప్రదేశంలో సహోద్యోగి నచ్చడంతో పెళ్లి చేసుకుని ఇంగ్లాండ్ వెళ్లి అక్కడే స్థిరపడింది.
ప్రస్తుతం కేట్‌కు 99 ఏళ్లు. మాతృభూమికి ఏదైనా చేయాలన్న కోరిక కలిగింది కేట్‌కు. దీంతో చారిటీ కోసం నిధులు సేకరించాలనుకుంది. ఇందుకోసం తను చేసిన ఉద్యోగానుభవాన్ని ఎంచుకుంది. సీహాక్ గ్లైడింగ్ క్లబ్‌ను కలిసి, గ్లైడర్ సాయంతో యుద్ధవిమానంలో ఆకాశంలో చక్కర్లు కొట్టింది. ఎంతో జాగ్రత్తగా టేకాఫ్ చేయడమేగాక, సురక్షితంగా ల్యాండ్ చేసింది. తన వందో పుట్టినరోజుకి కేవలం వారం రోజుల ముందు ఈ కార్యక్రమాన్ని చేపట్టిందామె. ఇలా చక్కర్లు కొట్టడం ద్వారా వచ్చిన నిధులను ఆర్మీ హీరోలకు సహాయ నిధిగా అందించనుంది కేట్.
‘‘ఆర్మీలో పనిచేసి, రిటైర్ అయిన వారంతా శారీరకంగా, మానసికంగా అలసిపోయి ఉంటారు. వీరికి సాయం చాలా అవసరం. అందుకే ఈ ట్రిప్‌ను చేపట్టాను. ట్రిప్ చాలా బావుంది. కొన్నిసార్లు నేను కూడా విమానాన్ని నియంత్రించ గలిగాను’’ అని చిరునవ్వుతో చెబుతున్న కేట్ సేవకు ఆకాశమే హద్దన్నట్లుగా ఎంతోమందిలో స్ఫూర్తినింపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment