Warplane
-
శతమానం: సెంచరీలోనూ సేవాగుణం తగ్గలే!
ఎంత అరగదీసినా, గంధం చెక్కకు సుగంధం తగ్గనట్టుగా... వందేళ్ల వయసు మీద పడి శరీరంలో సత్తువ తగ్గినా తమలో ఉన్న సాయం చేసే గుణంతో ఎలాగో ఒకలాగా చెయ్యందించాలని తాపత్రయ పడుతుంటారు. ఈ కోవకు చెందిన కేట్ ఆర్చర్డ్ వందేళ్ల వయసులో ఆకాశంలో ఎగురుతూ నిధులు సేకరించి సాయం చేయడానికి పూనుకుంది.‘సెంచరీలోనూ స్పీడు తగ్గలే’ అంటూ ఏకంగా యుద్ధవిమానం నడిపేసింది. ఇంగ్లాండ్‌లోని కార్నవాల్లో నివాసముంటోన్న కేట్ ఆర్చర్డ్ ఆంగ్లో ఇండియన్. పదముగ్గురు సంతానంలో కేట్ ఒకరు. కేట్ చిన్నవయసులో ఆమె కుటుంబం ఇండియాలోనే ఉండేది. కేట్ తండ్రి ఇండియన్ రైల్వేస్‌లో చీఫ్ టెలిగ్రాఫ్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. 1941లో ఉమెన్స్ ఆగ్జిలరీ ఎయిర్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఈ ఫోర్స్‌లో తన ఇద్దరు తోబుట్టువులతో కలసి 20 ఏళ్ల వయసులో వాలంటీర్‌గా చేరింది. వాలంటీర్‌గా పనిచేస్తూనే ఫస్ట్‌క్లాస్ వారెంట్ ఆఫీసర్‌గా, సర్వీస్ అండ్ ఇండియా సర్వీస్ మెడల్స్‌ను అందుకుంది. తరువాత ఎయిర్ డిఫెన్స్‌కు చెందిన చెన్నైలోని ఐదోనంబర్ ఫిల్టర్ రూమ్‌లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసింది. ఇలా పనిచేస్తూనే రెండో ప్రపంచ యుద్ధసమయంలో యుద్ధ విమానాలకు సిగ్నల్స్‌ను అందించేది. శత్రు యుద్ధవిమానాలను కూల్చడంలో ఈ సిగ్నల్స్ ప్రముఖ పాత్ర పోషించేవి. 24 గంటలపాటు వార్నింగ్ సిస్టమ్స్‌ను గమనిస్తూ ఎప్పటికప్పుడు పైలట్లకు సూచనలు ఇస్తుండేది. పనిప్రదేశంలో సహోద్యోగి నచ్చడంతో పెళ్లి చేసుకుని ఇంగ్లాండ్ వెళ్లి అక్కడే స్థిరపడింది. ప్రస్తుతం కేట్కు 99 ఏళ్లు. మాతృభూమికి ఏదైనా చేయాలన్న కోరిక కలిగింది కేట్కు. దీంతో చారిటీ కోసం నిధులు సేకరించాలనుకుంది. ఇందుకోసం తను చేసిన ఉద్యోగానుభవాన్ని ఎంచుకుంది. సీహాక్ గ్లైడింగ్ క్లబ్‌ను కలిసి, గ్లైడర్ సాయంతో యుద్ధవిమానంలో ఆకాశంలో చక్కర్లు కొట్టింది. ఎంతో జాగ్రత్తగా టేకాఫ్ చేయడమేగాక, సురక్షితంగా ల్యాండ్ చేసింది. తన వందో పుట్టినరోజుకి కేవలం వారం రోజుల ముందు ఈ కార్యక్రమాన్ని చేపట్టిందామె. ఇలా చక్కర్లు కొట్టడం ద్వారా వచ్చిన నిధులను ఆర్మీ హీరోలకు సహాయ నిధిగా అందించనుంది కేట్. ‘‘ఆర్మీలో పనిచేసి, రిటైర్ అయిన వారంతా శారీరకంగా, మానసికంగా అలసిపోయి ఉంటారు. వీరికి సాయం చాలా అవసరం. అందుకే ఈ ట్రిప్‌ను చేపట్టాను. ట్రిప్ చాలా బావుంది. కొన్నిసార్లు నేను కూడా విమానాన్ని నియంత్రించ గలిగాను’’ అని చిరునవ్వుతో చెబుతున్న కేట్ సేవకు ఆకాశమే హద్దన్నట్లుగా ఎంతోమందిలో స్ఫూర్తినింపుతోంది. -
Visakhapatnam: ఆ ఊహలన్నీ త్వరలోనే నిజం కానున్నాయి..
సాక్షి, విశాఖపట్నం: అందమైన బీచ్‌రోడ్డులో సరదాగా విహరిస్తూ ముందుకు సాగుతుంటే.. సాగరగర్భంలో శత్రు సైన్యానికి వణుకు పుట్టించిన సబ్‌మెరైన్.. దాని ఎదురుగా గగనతలంలో శత్రువులను గడగడలాడించిన టీయూ–142.. ఆ పక్కనే గాల్లో దూసుకుపోయే సీ హారియర్ యుద్ధ విమానం.. ఇలా వీటన్నింటిని చూస్తూ.. ఒక కప్పు కాఫీ తాగుతూ.. బీచ్ రోడ్డులో సరదాగా షాపింగ్ చేస్తే ఎంతో బాగుంటుందో కదా.. ఈ ఊహలన్నీ త్వరలోనే నిజం కానున్నాయి. బీచ్‌రోడ్డులో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం ఏర్పాట్లకు సన్నహాలు సాగుతున్నాయి. విశాఖ నగరాన్ని నంబర్ వన్ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గదర్శకాలకు అనుగుణంగా సందర్శకులకు మరింత శోభను అందించేలా బీచ్‌రోడ్డులో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్ నిర్మాణానికి వీఎంఆర్డీఏ చురుగ్గా అడుగులు వేస్తోంది. రూ.40 కోట్లతో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రణాళికలు, డీపీఆర్ సిద్ధం చేసింది. రూ.10కోట్లతో సీహారియర్ ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. సిద్ధమవుతున్న సీహారియర్ ఆర్కే బీచ్‌లో టీయూ–142 ఎయిర్‌క్రాఫ్ట్ సందర్శకులను ఎంతగానో అలరిస్తోంది. కురుసుర జలాంతర్గామి సందర్శకుల మనసు దోచుకుంటోంది. సాగరతీరానికి అదనపు ఆభరణంలా ఇప్పుడు సీ హారియర్ యుద్ధ విమానం సన్నద్ధమవుతోంది. 1983లో బ్రిటిష్ ఏరోస్పేస్ నుంచి కొనుగోలు చేసిన ఈ సీహారియర్ నౌకాదళం ఏవియేషన్ విభాగంలో చేరింది. గోవాలోని ఐఎన్ఎస్ హంస యుద్ధనౌకలో 32 ఏళ్ల పాటు దేశానికి సేవలందించింది. 2016లో సేవల నుంచి నిష్క్రమించింది. ఈ యుద్ద విమానాన్ని వీఎంఆర్డీఏ సాగరతీరంలో మ్యూజియంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాజీవ్ స్మృతి భవన్లో దీనికి సంబంధించిన మ్యూజియం నిర్వహించనున్నారు. ప్రస్తుతం దీనిని టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఉంచారు. సముద్రపు గాలులకు ఇది తుప్పు పట్టకుండా వీఎంఆర్డీఏ ప్రత్యేక కోటింగ్ పెయింట్ వేయించింది. త్వరలోనే ఇది రాజీవ్ స్మృతి భవన్‌కు చేరనుంది. చదవండి: (WorkFromHomeTowns: 24/7 విద్యుత్ సరఫరా.. హై స్పీడ్ ఇంటర్నెట్) ఇంటిగ్రేటెడ్ మ్యూజియం సీ హారియర్ మ్యూజియం అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ మ్యూజియంగా తీర్చిదిద్దనున్నారు. బీచ్‌రోడ్డుకు వచ్చే ప్రతి సందర్శకుడికీ సరికొత్త అనుభూతి కలిగించేలా మ్యూజియంను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించిన నేపథ్యంలో వీఎంఆర్డీఏ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న టీయూ–142, కురుసుర మ్యూజియంతో పాటు సీ హారియర్‌ను అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేటెడ్ మ్యూజియంగా తీర్చిదిద్దనున్నారు. మొత్తంగా రూ.40 కోట్ల అంచనా వ్యయంతో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం బీచ్‌రోడ్డులో అందుబాటులోకి రానుంది. రాజీవ్ స్మృతి భవన్లో సీహారియర్ మ్యూజియం పనులు వేగవంతం చేశారు. కోవిడ్ కారణంగా ఆలస్యమైనా.. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసేందుకు వీఎంఆర్డీఏ ఇంజినీరింగ్ విభాగం ప్రయత్నిస్తోంది. 2022 మార్చి నాటికి అందుబాటులోకి తీసుకురావడానికి ఆలోచన చేస్తున్నారు. ఫుడ్ కోర్టులు.. షాపింగ్‌లు... ఇంటిగ్రేటెడ్ మ్యూజియంలో భాగంగా రాజీవ్ స్మృతి భవన్లో సీ హారియర్ మ్యూజియం మార్చి నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. రూ.10 కోట్లతో మ్యూజియం అభివృద్ధి చేస్తున్నారు. అదే విధంగా రూ.10 కోట్లతో సబ్‌మెరైన్ మ్యూజియంకు సరికొత్త హంగులు అద్దనున్నారు. మరో రూ.20 కోట్లతో ఫుడ్ కోర్టులు, షాపింగ్ చేసుకునేలా సరికొత్త దుకాణాలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని వీఎంఆర్డీఏ సిద్ధమవుతోంది. సీహారియర్ మ్యూజియంలో వివిధ రకాల యుద్ధ విమానాల గురించి తెలుసుకునేలా సమగ్ర సమాచార ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. టీయూ–142 మ్యూజియం ముందు భాగంలో ఏర్పాటు చేసిన ఆర్చ్ మాదిరిగా సబ్‌మెరైన్ మ్యూజియంను తీర్చిదిద్దనున్నారు. వీటికి తోడుగా ఇంటిగ్రేటెడ్ మ్యూజియంలో విభిన్న హంగులు కొత్త అనుభూతిని అందివ్వనున్నాయి. సావనీర్ షాప్, సిమ్యులేషన్ గేమ్స్, కాఫీషాప్‌తో పాటు జోన్ల వారీగా విభిన్నతలు అందుబాటులోకి తీసుకురానున్నారు. టీయూ–142, సబ్‌మెరైన్, సీ హారియర్ విమానాలకు గుర్తులుగా కీచైన్లు, పుస్తకాలు, ట్రేలు, కాఫీ కప్పులు, జ్ఞాపికలు.. ఇలా ఎన్నో విభిన్నమైన వస్తువులతో కూడిన షాపింగ్ దుకాణాలు కొలువుదీరనున్నాయి. చదవండి: (చంద్రబాబు మంగమ్మ శపథాలను ఎవరూ నమ్మరు: కొడాలి నాని) సరికొత్త బీచ్‌ను చూస్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మూడు ప్రధాన మ్యూజియంలను అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేటెడ్ మ్యూజియంగా తీర్చిదిద్దే ప్రణాళికలు తయారు చేశాం. దీనికి సంబంధించిన రూట్‌మ్యాప్‌ను కమిషనర్ సూచనల మేరకు అమలు చేస్తున్నాం. సీహారియర్ మ్యూజియం అందుబాటులోకి వచ్చాక.. ప్రతి సందర్శకుడూ బీచ్‌ను సరికొత్తగా చూస్తారు. మ్యూజియంను సందర్శించడంతో పాటు జ్ఞాపకాలను తీసుకెళ్లేలా షాపింగ్ సౌకర్యం, పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. రాజీవ్ స్మృతిభవన్ మునుపటి రూపు చెక్కు చెదరకుండా నిర్మిస్తున్నాం. బీచ్‌లో నడుస్తుంటే వేలాడే సీహారియర్ని ప్రతి ఒక్కరూ చూడొచ్చు. ప్రత్యేకమైన విద్యుత్ దీపాల ధగధగలతో మ్యూజియం మెరవనుంది. – భవానీశంకర్, వీఎంఆర్డీఏ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఇలా.. సీహారియర్ మ్యూజియం వ్యయం - రూ.10 కోట్లు సబ్‌మెరైన్ హెరిటేజ్ మ్యూజియం వ్యయం - రూ.10 కోట్లు అండర్ గ్రౌండ్ పార్కింగ్ - రూ.17 కోట్లు ల్యాండ్ స్కేపింగ్, విద్యుదీకరణ వ్యయం - రూ.3 కోట్లు మొత్తం ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు వ్యయం - రూ.40 కోట్లు -
కోల్‌కతాలో రెండో టీయూ–142 మ్యూజియం
సాక్షి, విశాఖపట్నం: భారత నావికా దళంలో సుదీర్ఘ సేవలందించిన మరో యుద్ధ విమానం రెండో మ్యూజియంగా మారబోతోంది. ఒక దానిని ఇటీవలే విశాఖ సాగర తీరంలో ఏర్పాటుచేయగా.. ఇప్పుడు రెండో దానిని కోల్‌కతాలో మ్యూజియంగా తీర్చిదిద్దనున్నారు. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎనిమిది టీయూ–142 యుద్ధ విమానాలు 1988లో ఇండియన్ నేవీలోకి వచ్చి 29ఏళ్ల పాటు నిరంతరాయంగా విశేష సేవలందించాయి. వీటిని 2017 మార్చిలో నేవీ విధుల నుంచి తప్పించారు. తమిళనాడులోని అరక్కోణం నేవల్ ఎయిర్ బేస్ కేంద్రంగా ఇవి సముద్ర గగనతలంలో గస్తీ విధులు నిర్వహించాయి. కార్గిల్ యుద్ధంలోనూ పాల్గొన్నాయి. వాటి స్థానంలో కొత్తగా పీ8ఐ రకం అత్యాధునిక నిఘా విమా నాలను భారత్ కొనుగోలు చేసింది. నేవీ సేవల నుంచి నిష్క్రమించిన టీయూ–142 యుద్ధ విమానాల్లో ఒకదాన్ని ఇటీవల విశాఖలో ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియంగా తీర్చిదిద్దారు. దీనిని ఈ డిసెంబర్ ఏడో తేదీన భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభిం చారు. విశాఖ ఉత్సవ్ తొలిరోజైన డిసెంబర్ 28 నుంచి ఇందులో ప్రవేశానికి అనుమతించారు. దేశంలోకెల్లా తొలి ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం ఇదే. ఈ నేపథ్యంలో రెండో టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియాన్ని పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఏర్పాటుచేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖను కోరింది. ఇందుకు రక్షణశాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ రెండో ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం ఆరు నెలల్లో పూర్తిచేయనున్నారు. విశాఖ ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియాన్ని విజయవం తంగా పూర్తిచేసి అందరి ప్రశంసలందుకున్న.. ఆంధ్రకు చెందిన లెఫ్టినెంట్ కమాండర్ రమణ్‌కుమార్‌నే కోల్‌కతా మ్యూజియానికి కూడా ఇన్చార్జిగా పంపనున్నారు. -
'వారి కోసమే మా విమానం కూల్చారు'
లీ బోర్గెట్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ మరోసారి టర్కీపై విరుచుకుపడ్డారు. ఉగ్రవాద సంస్ధ ఇస్లామిక్ స్టేట్ నుంచి తన సంబంధాలు దెబ్బతింటాయనే తమ విమానాన్ని కూల్చివేసే ఘాతుకానికి టర్కీ దిగిందని అన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు చెందిన ఆయిల్ ను దిగుమతి చేసుకునే విషయంలో ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతోనే తమ యుద్ధ విమానాన్ని కూల్చి వేసిందని చెప్పారు. 'టర్కీ భూభాగంలోకి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ కు చెందిన ఆయిల్ పైప్ లైన్ ఉంది. ఇదంతా ఐఎస్ మాత్రమే నిర్వహిస్తుంది. దానిని తాము ఎక్కడ ధ్వంసం చేస్తామో అనే దురుద్దేశంతోనే మా విమానాన్ని కూల్చి వేశారు. మేం ఏ ఆరోపణలు ఊరికే చేయం. ప్రత్యేకమైన కారణం ఉంటేనే మాట్లాడతాం. మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి' అని పుతిన్ అన్నారు. పారిస్ లో ప్రపంచ వాతావరణ సదస్సుకు వచ్చిన సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టర్కీపై నిప్పులు చెరిగారు. అసలు తమ విమానాన్ని కూల్చాల్సిన అవసరమే లేదని అన్నారు.