'వారి కోసమే మా విమానం కూల్చారు'
లీ బోర్గెట్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ మరోసారి టర్కీపై విరుచుకుపడ్డారు. ఉగ్రవాద సంస్ధ ఇస్లామిక్ స్టేట్ నుంచి తన సంబంధాలు దెబ్బతింటాయనే తమ విమానాన్ని కూల్చివేసే ఘాతుకానికి టర్కీ దిగిందని అన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు చెందిన ఆయిల్ ను దిగుమతి చేసుకునే విషయంలో ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతోనే తమ యుద్ధ విమానాన్ని కూల్చి వేసిందని చెప్పారు. 'టర్కీ భూభాగంలోకి ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ కు చెందిన ఆయిల్ పైప్ లైన్ ఉంది.
ఇదంతా ఐఎస్ మాత్రమే నిర్వహిస్తుంది. దానిని తాము ఎక్కడ ధ్వంసం చేస్తామో అనే దురుద్దేశంతోనే మా విమానాన్ని కూల్చి వేశారు. మేం ఏ ఆరోపణలు ఊరికే చేయం. ప్రత్యేకమైన కారణం ఉంటేనే మాట్లాడతాం. మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి' అని పుతిన్ అన్నారు. పారిస్ లో ప్రపంచ వాతావరణ సదస్సుకు వచ్చిన సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టర్కీపై నిప్పులు చెరిగారు. అసలు తమ విమానాన్ని కూల్చాల్సిన అవసరమే లేదని అన్నారు.