ఆంగ్లో ఇండియన్ యువతిపై అత్యాచారం
సాక్షి, విశాఖపట్నం: స్థానికంగా ఒక స్టార్ హోటల్‌లో పనిచేస్తున్న ఆంగ్లో ఇండియన్ యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో ఆ హోటల్‌లో పనిచేస్తున్న శ్రీధర్ ఆమెతో ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకుని తనతో తీసుకెళ్లి స్నేహితునితో కలిసి ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు బాధితురాలు మూడవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
పోతీన మల్లయ్యపాలెం ప్రాంతానికి చెందిన యువతి నగరంలోని ఓ స్టార్ హోటల్ పనిచేస్తోంది. ఈ నెల 4వ తేదీ రాత్రి 11 గంటలకు విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిపోయింది. గతంలో ఆ హోటల్‌లో పనిచేసి మానేసిన శ్రీధర్ ఆమె నివాసానికి వెళ్లి తనతో బయటకు రమ్మన్నాడు. రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో ఆ యువతి వచ్చింది. ఇద్దరూ క్యాబ్‌లో ఆమె పనిచేస్తున్న హోటల్ వద్దకు చేరుకున్నారు. దాని వెనుక బీచ్ వైపు వెళ్లి కాసేపు ఇద్దరూ మద్యం (బీర్) సేవించారు. అనంతరం యువతి మత్తులోకి జారుకుంది. ఉదయం లేచి ఇంటికి వెళ్లిపోయారు.
ఇంటికి వెళ్లిన తర్వాత తనపై లైంగిక దాడి జరిగినట్లు యువతి గుర్తించింది. విషయం తల్లిదండ్రులకు చెప్పింది. అయితే పరువుపోతుందని భయపడి వారు ఈ విషయాన్ని బయటపెట్టలేదు. బాగా ఆలోచించుకుని ఈ నెల 7వ తేదీన మూవడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శ్రీధర్‌తో పాటు మరో వ్యక్తి కూడా తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో ఆ యువతి పేర్కొంది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకులు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. యువతిని వైద్య పరీక్షల కోసం కేజీహెచ్‌కు తరలించారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని, అయితే ఈ కేసులో స్పష్టత లేదని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు అన్నారు.
ఘటనపై సందేహాలు
ఇక తాజా సంఘటన స్టార్ హోటల్‌లో ఉద్యోగినిపై జరిగింది. అయితే నిందితులతో కలిసి బాధితురాలు మద్యం సేవించడం అనుమానాలకు తావిస్తోంది. పైగా ఇద్దరు నిందితుల్లో ఒకరు ఆమె పనిచేస్తున్న హోటల్‌లోనే పనిచేసి ఉండటంతో అతనితో ఆమెకు పూర్వ పరిచయం ఉందని, ఆ కారణంగానే అతను పిలవగానే కారులో వెళ్లి, మద్యం సేవించి ఉంటుందని భావిస్తున్నారు. చివరికి ఆ మత్తులో దొరికిన అవకాశాన్ని నిందితులు వినియోగించుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే రెండు రోజుల తర్వాత ఫిర్యాదు చేయడం కూడా సందేహాలకు తావిస్తోంది.