animal counting
-
ముగిసిన జంతుగణన
సాక్షి, హైదరాబాద్: అడవుల్లో జంతువుల పరిరక్షణార్థం నిర్వహించిన 2 రోజుల జంతు గణన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. తెలంగాణ అటవీశాఖ ఆధ్వర్యంలో అటవీశాఖ ముఖ్య పరిరక్షక అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్లు శని, ఆదివారాల్లో ఈ సర్వేలో పాల్గొన్నారు. జంతువుల కదలికలు, అడవుల్లో నీటి చెలమల గుర్తింపు, అక్కడికి వచ్చే జంతువుల కదలికల ఆధారంగా ఈ సర్వే చేపట్టారు. సర్వేలో భాగంగా నీటి చెలమలు, వాగులు, నీటి వనరుల వద్ద వేటగాళ్లు బిగించిన ఉచ్చులను గుర్తించి తొలగించారు. మొత్తం 104 మంది వలంటీర్లు రాష్ట్రంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, కవ్వాల్ టైగర్ రిజర్వ్, ఏటూరు నాగారం వైల్డ్‌లైఫ్ సాంక్చురీలో 43 బృందాలుగా విడిపోయి ఈ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా 241 నీటి వనరుల వద్ద ఉదయం, సాయంత్రం, రాత్రి పొద్దుపోయిన తరువాత సందర్శనలు జరిపారు. అడవిలో సాయంగా ఉండేలా ప్రతీ బృందానికి స్థానిక అటవీశాఖ నుంచి ఒక గైడ్‌ను ఏర్పాటు చేశారు. అడవిలో వారి పర్యటన, రవాణా, వసతి తదితరాలకు అటవీ శాఖ ఏర్పాట్లు చేసింది. ఎన్జీవో, వలంటీర్ల కోసం శనివారం ఉదయం హైదరాబాద్‌లోని అరణ్య భవన్ నుంచి 3 బస్సులు కూడా అటవీశాఖ ఏర్పాటు చేసింది. సర్వేలో భాగంగా చెలమలు, వాగుల వద్ద లభించిన జంతువుల కాలిముద్రల వివరాలు సేకరించారు. ఈ సర్వేలో భాగంగా కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్ ఫాంథర్ (చిరుతను పోలిన పులి), అడవి కుక్కలు, ఎలుగు, సాంబార్ (జింకలో రకం), నీల్గాయ్, చౌసింగాలను నేరుగా చూసినట్లు అధికారులు తెలిపారు. ఏటూరు నాగారంలో ఇండియన్ బైసన్, నీల్గాయ్, పలు రకాల పాములు, పక్షులు చూసినట్లు వివరించారు. ప్రస్తుత సర్వే వివరాలకు అటవీశాఖ అదనపు సమాచారాన్ని కూడా జోడించి జంతు గణన పూర్తి చేయనుంది. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ, వరల్డ్ వైల్డ్ లైఫ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) డెక్కన్ బర్డర్స్, హిటికోస్, ఎఫ్‌డబ్ల్యూపీఎస్ తదితర సంస్థల వాలం టీర్లు సర్వేలో పాల్గొన్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న వలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలు, అటవీశాఖ సిబ్బందిని ఫారెస్ట్ ఫోర్స్ హెడ్ పీకే ఝా అభినందించారు. -
పశుగణనలో మనమే టాప్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అఖిల భారత పశు గణనలో మన జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఐదేళ్లకోసారి నిర్వహించే పశు గణనను వంద శాతం పూర్తి చేసి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా మొదటిస్థానంలో నిలబడింది. గతేడాది అక్టోబర్ ఒకటిన ప్రారంభమైన పశుగణన ప్రక్రియ వాస్తవంగా అదే ఏడాది డిసెంబర్ 31తో ముగియాలి. వరుసగా వచ్చిన శాసనసభ, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గడువును జనవరి నెలాఖరు వరకు ప్రభుత్వం పొడిగించినట్లు అధికారులు పేర్కొన్నారు. మిగతా జిల్లాలతో పోల్చితే మన జిల్లా ఇప్పటికే వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేసింది. చివరిసారిగా 2012లో నిర్వహించిన సమయంలో.. జిల్లాలో 5.36 ఇళ్లను క్షేత్రస్థాయిలో సిబ్బంది పరిశీలించి వివరాలు నమోదు చేశారు. ఈ లక్ష్యాన్ని ప్రామాణికంగా తీసుకున్న జిల్లా పశుసంవర్ధక శాఖ యంత్రాంగం ఇప్పటికే 5.77 లక్షల ఇళ్ల నుంచి వివరాలు సేకరించారు. గత ఐదేళ్ల నుంచి నివాసాల సంఖ్య పెరగడంతో.. ఇంటింటికి వెళ్లడం పూర్తి కావడానికి మరికొన్ని రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఆయా మండలాల్లో కొన్ని గ్రామాలు మిగిలాయని, ప్రస్తుతం వివరాల సేకరణ కొనసాగుతుందని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి కేవీఎల్ నర్సింహారావు తెలిపారు. ఫిబ్రవరి 15 నాటికి జిల్లాలో పశుగణన సంపూర్ణంగా ముగుస్తుందని చెప్పారు. 126 మంది ఎన్యుమరేటర్లు, 39 మంది సూపర్వైజర్లతో కూడిన బృందాలు ప్రతి ఇంటికి వెళ్తూ పశువులు, పెంపుడు జంతువులు, పక్షుల వివరాలు సేకరిస్తున్నారు. ఒక్కో ఎన్యుమరేటర్ నెలకు గ్రామీణ ప్రాంతంలో 1,500 ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 2 వేల ఇళ్లకు వెళ్లి సమాచారం రాబడుతున్నారు. తొలిసారిగా గణనలో ట్యాబ్‌లను వినియోగిస్తున్నారు. సేకరించిన వివరాలను క్షేత్రస్థాయి నుంచే డేటా సెంటర్‌కు చేరవేస్తున్నారు. -
ఒకే పులి..!
నిర్మల్ : మన జిల్లాలో పెద్దపులి అరుపులకన్నా.. మెరుపువేగంతో దూసుకెళ్లే చిరుతలే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎలుగుబంట్లూ తామేం తక్కువ కాదన్నట్లు సంఖ్య పెంచుకుంటున్నాయి. అడవి బర్రెలు, కుక్కలూ వందల్లో తమ ప్రాబల్యాన్ని చాటుకుంటున్నాయి. వీటిలో అధికశాతం జంతువులన్నీ కవ్వాల్ అభయారణ్యం పరిధిలోని కడెం, ఖానాపూర్, పెంబి రేంజ్‌ల్లోనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లకోసారి చేపట్టే జంతుగణన జిల్లాలో జనవరి 22 నుంచి 28వరకు పూర్తయింది. అటవీశాఖ అధికారులు, సిబ్బందితో పాటు పలువురు స్వచ్ఛంద సభ్యులు కూడా అడవుల్లో సంచరిస్తూ జంతువుల అడుగులు, వివిధ గుర్తులతో లెక్కింపు చేపట్టారు. పక్కా తేలని పులి లెక్క.. పులులకు సంబంధించిన కవ్వాల్ అభయారణ్యం ఉన్న నిర్మల్ జిల్లాలో ఒకటి లేదంటే రెండు మాత్రమే పెద్దపులులున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో దొరికిన ఆధారాలను బట్టి మూడు కూడా ఉండవచ్చంటున్నారు. దాదాపు ఒకట్రెండు పులులే వివిధ ప్రాంతాల్లో సంచరించి ఉంటాయన్న అనుమానాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇవి.. ఒకటా..రెండా.. మూడా అన్నది తేలాలంటే వాటి గుర్తులు, ఆనవాళ్ల ఆధారంగా ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాతే తేలుతుందని చెబుతున్నారు. జనవరి 22న ఖానాపూర్ రేంజ్ సోమావార్‌పేట్, కడెం రేంజ్‌లోని అల్లంపల్లి అటవీ ప్రాంతాల్లో పులి పాద ముద్రలు, మలం కనిపించాయి. వీటి ఆధారంగా రెండు పులులున్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఒకటే పులి ఆయా ప్రాంతాల్లో సంచరించి ఉండవచ్చన్న అనుమానాలున్నాయి. చిరుతలు.. ఎలుగులే ఎక్కువ.. పెద్దపులి తర్వాత ప్రధాన మాంసాహార జంతువుల్లో చిరుతపులుల సంఖ్య జిల్లాలో 30 ఉన్నట్లు గణనలో పేర్కొన్నారు. వీటికి రెండింతలు అంటే 60 ఎలుగుబంట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ మధ్యకాలంలో వీటి సంఖ్య బాగానే పెరిగిందని అంచనా వేస్తున్నారు. చిరుతలు తరచూ జనావాసాల్లోకి వస్తున్న సంఘటనలను బట్టి వీటి సంఖ్య పెరిగిందనే చెబుతున్నారు. ఇటీవల నర్సాపూర్(జి) మండలంలోనూ చిరుత పశువులను చంపింది. ఎలుగుబంట్లు, చిరుతల కంటే ఎక్కువగా అడవి బర్రెలు 250, అడవి కుక్కలు 200 ఉన్నాయి. ఆ రేంజ్‌ల్లోనే ఎక్కువ.. చదువులమ్మ కొలువైన బాసర నుంచి కడెం వరకు నిర్మల్ జిల్లా విస్తరించి ఉంది. గోదావరి సరిహద్దుగా ఉన్న జిల్లాలో ముథోల్, నిర్మల్ నియోజకవర్గాలకంటే ఖానాపూర్ నియోజకవర్గంలోనే అటవీశాతం ఎక్కువగా ఉంది. అందువల్లే.. ఈ నియోజకవర్గంలోని అటవీరేంజ్లైన ఖానాపూర్, కడెం, పెంబిల్లోనే జంతువుల సంఖ్య ఎక్కువగా ఉంది. కవ్వాల్ అభయారణ్యం పరిధిలోని ఈ రేంజ్లో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. కడెం రేంజ్ పరిధిలోని అల్లంపల్లి, ఖానాపూర్ పరిధిలోని సోమార్పేట్లోనే పులుల సంచారాన్ని గుర్తించారు. పులులు, చిరుతలు, ఎలుగుంట్లతో పాటు అడవి పిల్లులు, మర్నాగిలు, నక్కలు, తోడేళ్లు, జింకలు, నీలుగాయిలు, అడవి పందులు, హైనాలు జిల్లా అడవుల్లో ఉన్నట్లు గుర్తించారు. మొత్తం మీద జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతాల్లో నాలుగేళ్లలో జంతువుల సంఖ్య పెరిగినట్లుగా అధికారులు నిర్ధారించారు. దట్టమైన అడవుల్లోకి వెళ్లి.. గత నెల 22నుంచి 24వరకు మాంసాహార, 25 నుంచి 28వరకు ఇతర జంతువులను లెక్కించారు. ప్రధానంగా నీటిలభ్యత ఉండే ప్రాంతాల్లో, బురద మడుగుల్లో జంతువుల పాదముద్రలను ఎక్కువగా గుర్తించారు. దట్టమైన అడవుల్లో కిలో మీటర్ల పొడవునా అటవీశాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, వలంటీర్లు తిరుగుతూ జంతుగణన చేపట్టారు. అడుగులతో పాటు మలమూత్రాలను సేకరించారు. వీటి ఆధారంగానే ప్రస్తుతం జిల్లాలోని జంతువుల సంఖ్యను అంచనా వేశారు. పక్కగా వీటి సంఖ్యను గుర్తించడానికి పాద ముద్రలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో సేకరించారు. మలమూత్రాలను హైదరాబాద్‌లోని సీసీఎంబీ(సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) ల్యాబ్‌కు పంపించారు. అక్కడ పరీక్షించిన అనంతరం ఏయే జంతువులు ఎన్ని ఉన్నాయనేది పక్కాగా లెక్క తేలుతుందని అధికారులు పేర్కొంటున్నారు. శాకాహార జంతువులకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం అప్లోడ్ ఇంకా కొనసాగుతోంది. జిల్లాలో అడవుల వివరాలు.. జిల్లా అటవీ విస్తీర్ణం : 1,20,566.75 హెక్టార్లు కోర్ ఏరియా : 50,036.48 హెక్టార్లు బఫర్ ఏరియా : 20,369.26 హెక్టార్లు అటవీ శాతం : 33.08 అటవీ డివిజన్లు : నిర్మల్, ఖానాపూర్ రేంజ్‌లు : నిర్మల్, భైంసా, మామడ, దిమ్మదుర్తి (నిర్మల్ డివిజన్) ఖానాపూర్, కడెం, పెంబి, ఉండుంపూర్ (ఖానాపూర్ డివిజన్) జంతుగణన ప్రకారం.. పులులు : 2 చిరుత పులులు : 30 ఎలుగుబంట్లు : 60 అడవి బర్రెలు : 250 అడవి కుక్కలు : 200 అడవులతో పాటు జంతురక్షణ జిల్లాలో నాలుగేళ్ల వ్యవధిలో జంతువుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం జిల్లాలో రెండు పులులు సంచరిస్తున్నట్లు గుర్తించాం. వీటితోపాటు 30 చిరుతలు, 60ఎలుగుబంట్లు ఉన్నాయి. అడవులను కాపాడడంతో పాటు జంతుపరిరక్షణ చేపడుతున్నాం. జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజల సహకారం చాలా అవసరం. – దామోదర్‌రెడ్డి, జిలా అటవీశాఖాధికారి -
జూలై 16 నుంచి పశుగణన
అనంతపురం అగ్రికల్చర్ : జూలై 16 నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అఖిల భారత 20వ పశుగణన కార్యక్రమం చేపడుతున్నట్లు నోడల్ అధికారి డాక్టర్ గోల్డ్స్మన్ తెలిపారు. సోమవారం స్థానిక పశుసంవర్ధకశాఖ జేడీ కార్యాలయంలో డివిజన్ స్థాయి నోడల్ అధికారులతో ఆయన సమావేశమై చర్చించారు. జిల్లాలో ఉన్న పశువులు, గేదెలు, దున్నలు, ఎద్దులు, గొర్రెలు, మేకలు, పందులు, గాడిదలు, గుర్రాలు, కోళ్లు తదితర అన్ని రకాల మూగజీవాలకు సంబంధించిన కచ్చితమైన గణాంకాల కోసం ఇంటింటా సర్వే జరుగుతుందన్నారు. ఐదు మంది డివిజన్ నోడల్ అధికారులు, 32 మంది ఏరియా నోడల్ అధికారులు, 90 మంది సూపర్వైజర్లు, 225 మంది ఎన్యుమరేటర్లు ఇందులో భాగస్వాములవుతారన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా పశుగణన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.