సాక్షి, రంగారెడ్డి జిల్లా: అఖిల భారత పశు గణనలో మన జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఐదేళ్లకోసారి నిర్వహించే పశు గణనను వంద శాతం పూర్తి చేసి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా మొదటిస్థానంలో నిలబడింది. గతేడాది అక్టోబర్ ఒకటిన ప్రారంభమైన పశుగణన ప్రక్రియ వాస్తవంగా అదే ఏడాది డిసెంబర్ 31తో ముగియాలి. వరుసగా వచ్చిన శాసనసభ, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గడువును జనవరి నెలాఖరు వరకు ప్రభుత్వం పొడిగించినట్లు అధికారులు పేర్కొన్నారు. మిగతా జిల్లాలతో పోల్చితే మన జిల్లా ఇప్పటికే వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేసింది. చివరిసారిగా 2012లో నిర్వహించిన సమయంలో.. జిల్లాలో 5.36 ఇళ్లను క్షేత్రస్థాయిలో సిబ్బంది పరిశీలించి వివరాలు నమోదు చేశారు.
ఈ లక్ష్యాన్ని ప్రామాణికంగా తీసుకున్న జిల్లా పశుసంవర్ధక శాఖ యంత్రాంగం ఇప్పటికే 5.77 లక్షల ఇళ్ల నుంచి వివరాలు సేకరించారు. గత ఐదేళ్ల నుంచి నివాసాల సంఖ్య పెరగడంతో.. ఇంటింటికి వెళ్లడం పూర్తి కావడానికి మరికొన్ని రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఆయా మండలాల్లో కొన్ని గ్రామాలు మిగిలాయని, ప్రస్తుతం వివరాల సేకరణ కొనసాగుతుందని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి కేవీఎల్ నర్సింహారావు తెలిపారు.
ఫిబ్రవరి 15 నాటికి జిల్లాలో పశుగణన సంపూర్ణంగా ముగుస్తుందని చెప్పారు. 126 మంది ఎన్యుమరేటర్లు, 39 మంది సూపర్‌వైజర్లతో కూడిన బృందాలు ప్రతి ఇంటికి వెళ్తూ పశువులు, పెంపుడు జంతువులు, పక్షుల వివరాలు సేకరిస్తున్నారు. ఒక్కో ఎన్యుమరేటర్ నెలకు గ్రామీణ ప్రాంతంలో 1,500 ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 2 వేల ఇళ్లకు వెళ్లి సమాచారం రాబడుతున్నారు. తొలిసారిగా గణనలో ట్యాబ్‌లను వినియోగిస్తున్నారు. సేకరించిన వివరాలను క్షేత్రస్థాయి నుంచే డేటా సెంటర్‌కు చేరవేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment