Animal World
-
ముంగిసలూ కబ్జా చేస్తాయి!
జంతు ప్రపంచం వీటి ప్రధాన ఆహారం కీటకాలు, పీతలు, వానపాములు, బల్లులు, పాములు, కోళ్లు మొదలైనవి. అయితే అవి మాత్రమే తినాలని లేదు. మాంసాహారం దొరక్కపోతే శాకాహారాన్ని లాగించేస్తాయి. దుంపలు, మొక్కలు, పళ్లు... ఏవి దొరికితే వాటితో కడుపు నింపేసుకుంటాయి! ఇవి ఆహారాన్ని చాలా పద్ధతిగా తింటాయి. ఓ మొక్కను తినేటప్పుడు పిచ్చి ఆకులుంటే తీసి పక్కన పారేసి మరీ తింటాయి. కొన్ని రకాల పండ్లు తినేటప్పుడు గింజలు తీసి పారేస్తుంటాయి. గుడ్లను ఏదైనా బలమైన వస్తువుతో పగులగొడతాయి. లేదంటే బండకేసి కొట్టి, పగిలిన తర్వాత సొనను తింటాయి! విషపూరితమైన పాముల్ని సైతం ముంగిసలు చంపేస్తాయని మనకు తెలుసు. అయితే విషాన్ని పూర్తిగా హరాయించుకునే శక్తి వీటికి ఉందని అనుకుంటే పొరపాటు. వీటికి పాముల్ని చంపే టెక్నిక్ బాగా తెలుసంతే. పాముల్ని అటు తిప్పి ఇటు తిప్పి, విసిగించి అలసిపోయేలా చేస్తాయి. తర్వాత తలను తొక్కిపెట్టి చంపుతాయి. అలా అని విషాన్ని అస్సలు తట్టుకోవని కూడా కాదు. కొంతమేర వరకూ విషం వీటిని ఏమీ చేయలేదు. కానీ ఎక్కువసార్లు కాటుకి గురైనా, ఎక్కువ మోతాదులో విషం శరీరంలోకి చేరినా ప్రాణాలు కోల్పోతాయని పరిశోధనల్లో తేలింది! వీటికి ఒంటరిగా నివసించడం ఇష్టం. అయితే రక్షణ ఉండదన్న భయంతో గుంపులు గుంపులుగా జీవించడానికి సిద్ధపడతాయి. ప్రమాద సూచికలేవైనా కనిపించగానే ఒక విచిత్రమైన శబ్దం చేసి మిగతా వాటన్నింటినీ అప్రమత్తం చేస్తాయి! ముంగిస పిల్లలకు జన్మించిన కొన్ని వారాల వరకూ కళ్లు కనబడవు. అలాగే... కొన్ని నెలల వరకూ విషాన్ని తట్టుకునే శక్తి కూడా ఉండదు. దాంతో తల్లులు తమ పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాయి. శత్రువుల కంటబడకుండా గుంపు మధ్యలో పిల్లల్ని దాచిపెట్టుకుంటాయి! వీటికి ఒక్కచోట ఉండటం ఇష్టముండదు. ఎప్పుడూ కొత్త కొత్త ప్రదేశాలు చూస్తూండాలి. అందుకే వారానికోసారి నివాసాన్ని మార్చేస్తాయి!గోతులే వీటి నివాసం. అయితే కష్టపడి గోతిని తవ్వుకోవు. వేరే జంతువులేవైనా తవ్విన గోతుల్ని కబ్జా చేసి, వాటిలో నివసిస్తుంటాయి. ఇతర జీవులు తన నివాసంలో ప్రవేశించకుండా, గొయ్యి చుట్టూ ఒకలాంటి ఘాటైన ద్రవాన్ని వెదజల్లుతాయి! నాలుగు కాళ్ల జీవి అయినా కూడా ముంగిస రెండు కాళ్లతో మేనేజ్ చేయగలదు. రెండు కాళ్లమీద నిలబడగలదు, నడవగలదు, పరుగెత్తనూగలదు! -
ఆహారాన్వేషణలో అతిచురుకైనవి
జంతు ప్రపంచం {పపంచంలో మొత్తం ఐదు వేల రకాల తూనీగలు ఉన్నాయి. ఇవి అన్ని ఖండాల్లోనూ ఉంటాయి... అంటార్కిటికాలో తప్ప! తూనీగలకు రెండు జతల రెక్కలుంటాయి. అయితే మిగతా కీటకాల్లాగ ఎగిరేందుకు రెక్కల్ని ఆడించాల్సిన అవసరం ఉండదు వీటికి. అందుకే ఈగలు తమ రెక్కల్ని సెకనుకు మూడు వందలసార్లు ఆడిస్తే, తూనీగలు మాత్రం ముప్ఫైసార్లే ఆడిస్తాయి! ఇవి చాలా వేగంగా ఎగురుతాయి. అలాగే పైనుంచి కిందికి, కింది నుంచి పైకి, పక్కలకు... ఎలా అయినా ఎగరగలవు!వీటి కనుగుడ్ల నిర్మాణంలో ఉన్న ప్రత్యేకత వల్ల... తల తిప్పకుండానే అన్ని వైపులకూ చూడగలుగుతాయి! చిన్న చిన్న పురుగులు, దోమలు, లార్వాలు, పూలలోని తేనె, చిన్న చిన్న చేపలు వీటి ఆహారం. దోమలను అన్నిటికంటే ఇష్టంగా తింటాయి. ఒక్కరోజులో కొన్ని వేల దోమల్ని హాం ఫట్ చేసేస్తాయి! ఇవి నేలమీద జీవించగలవు. నీటిలోనూ జీవించగలవు. అందుకే ఎక్కువగా నీటి చెలమల చుట్టుపక్కలే కనిపిస్తుంటాయి!చాలాసార్లు ఆడ, మగ తూనీగల మధ్య హక్కుల కోసం పోరాటం జరుగుతూ ఉంటుంది. ఇవి పోట్లాడుకుంటాయి. ఒకదాన్నొకటి తరుముకుంటాయి. ఎగరడంలో పోటీలు కూడా పెట్టుకుంటాయి. మగ తూనీగలు ఆడ తూనీగల మీద కోపంతో విరుచుకుపడుతుంటాయి కూడా! వీటి రెక్కలు చాలా బలహీనంగా, పలుచగా ఉంటాయి. వేడి ఎక్కువ తగిలితే వెంటనే కాలిపోతాయి. అందుకే అతి వేడిమి దగ్గరకు పోకుండా ఇవి జాగ్రత్తపడుతుంటాయి! ఇవి ఆహారాన్ని వేటాడటంలో చాలా చురుకుగా ఉంటాయి. ఒకేసారి రెండిటిని పట్టుకునేందుకు కూడా ప్రయత్నిస్తాయి. ఎగిరిపోతోన్న రెండు దోమల్ని టార్గెట్ చేసి, ఒకదాని తర్వాత ఒకదాన్ని వెంటవెంటనే పట్టుకోవడం గమనించిన వైడర్మ్యాన్ అనే జీవ శాస్త్రవేత్త ఈ విషయాన్ని బయటపెట్టారు! వీటికి నిల్వ ఆహారం నచ్చదు. ఎప్పటికప్పుడు తాజాగా వేటాడి తినాలి. కాసేపు నిల్వ అయినా ఇక దాన్ని ముట్టుకోవు! వీటికి కోపం చాలా ఎక్కువ. తాము వెళ్లేదారికి ఏదైనా అడ్డు వస్తే విసుగు వచ్చేస్తుంది వీటికి. ఎగిరేటప్పుడే వేరే తూనీగ తనను దాటి వెళ్లిపోవాలని చూసినా ఇవి తట్టుకోలేవు. దానికన్నా వేగంగా ఎగరాలని, దాన్ని డామినేట్ చేయాలని ప్రయత్నం చేస్తాయి! -
బ్యాడ్జర్లు బాత్రూములు కట్టుకుంటాయా?!
జంతు ప్రపంచం ⇒ ప్రపంచంలో మొత్తం ఎనిమిది రకాల బ్యాడ్జర్లు మాత్రమే ఉన్నాయి. కాస్త ఎలుగుబంటిలాగ, కాస్త ముళ్లపందిలాగ కనిపించే ఈ జంతువులు అమెరికా, యూకే తదితర దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి! ⇒ మగ బ్యాడ్జర్ను ‘బోర్’ అని, ఆడదాన్ని ‘సా’ అని అంటారు! ⇒ పుట్టినప్పుడు బ్యాడ్జర్లకు కళ్లు కనిపించవు. నాలుగు వారాలు గడిచిన తర్వాత మెల్లమెల్లగా కనిపించడం మొదలవుతుంది! ⇒ బ్యాడ్జర్ పిల్లలు చలిని తట్టుకోలేవు. అందుకే చలికాలం వచ్చేలోపు ఇవి విపరీతంగా తింటాయి. ఒంట్లో కొవ్వు పెంచుకుని, ఆ వేడి ద్వారా చలి నుంచి తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటాయి! వ్యాంపైర్ జాతి గబ్బిలాలు రక్తం తాగి జీవిస్తాయని అంటారు. వీటిలో మూడు రకాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇవి అమెరికాలోని కొన్ని జూలలో తప్ప మరెక్కడా కనిపించడం లేదు అంటారు జీవ శాస్త్రవేత్తలు! బ్యాడ్జర్లు తవ్వినంత వేగంగా మరే జీవీ గోతులు తవ్వలేదు! ⇒ వీటి జీవన విధానం మనుషుల జీవన విధానంలాగ ఓ క్రమ పద్ధతిలో సాగుతుంది. ఇవి తమ నివాసంలో ఉన్న గదుల్ని చక్కగా పంచుకుంటాయి. తల్లిదండ్రులకి ఓ గది, ఒక్కో పిల్లలకీ ఒక్కో గది అన్నట్టుగా కట్టుకుంటాయి. వేటి గదిలో అవి నివసిస్తాయి! ⇒ తమ నివాసంలో ఎలుకల వంటి ఇతర జంతువులు రావడానికి, చెత్తా చెదారం చేరడానికి వీల్లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంటాయి బ్యాడ్జర్లు. పాలిథీన్ కవర్లు, ఆకులు వంటివన్నీ ఏరి తెచ్చుకుని రంధ్రాలను మూసి పెడతాయి! ⇒ మరీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఇవి ఎక్కడ పడితే అక్కడ మలమూత్రాలను విసర్జించవు. తమ నివాసాలకు దగ్గరలో గొయ్యి తీసి పెట్టుకుంటాయి. అందులోనే విసర్జిస్తాయి. అది నిండిపోయాక ఇసుక, మట్టి, చెత్తతో కప్పేసి, మరో గొయ్యి తీసుకుంటాయి! ⇒ రకరకాల పురుగులు, పండ్లు తిన్నప్పటికీ... వీటి ప్రధాన ఆహారం మాత్రం వానపాములు. ఎక్కువగా రాత్రిపూటే ఆహారాన్ని తింటాయి. ప్రతి రాత్రీ కడుపుకు పట్టినన్ని వానపాముల్ని ఆరగించేస్తాయి! ⇒ వీటి ఘ్రాణశక్తి అమోఘంగా ఉంటుంది. నేలమీద ఉండి... నేల లోపల ఉన్న జంతువుల వాసన పసిగట్టేస్తాయి. ఈ లక్షణం వీటికి వానపాముల్ని పట్టుకోవడంలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే చిన్న చిన్న శబ్దాలను కూడా పసిగట్టేస్తాయి. కానీ కంటి చూపు మాత్రం అంతంతమాత్రంగా ఉంటుంది! ⇒ వీటి చర్మం చాలా మందంగా ఉండటం వల్ల అంత త్వరగా గాయపడవు. అయితే వీటి గోళ్లు, దంతాలు చాలా పదునుగా ఉండటం వల్ల ఇతర జంతువులు మాత్రం వీటివల్ల బాగానే గాయపడుతుంటాయి! -
ఒంటె మూపురంలో ఏముంటుంది?
జంతుప్రపంచం అరేబియన్ ఒంటెలకు ఒకటే మూపురం ఉంటుంది కానీ ఆసియా ఒంటెలకు రెండు మూపురాలు ఉంటాయి! ఒంటె తన మూపురంలో నీటిని దాచుకుంటుందని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఇవి మూపురంలో కొవ్వును దాచుకుంటాయి ఒంటెలు. శరీరంలోని కొవ్వు అంతా మూపురంలోకి చేరి అక్కడ నిల్వ ఉంటుంది. దానివల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది. అందుకే ఎడారుల్లాంటి వేడి ప్రదేశాల్లో తిరిగినా, మంచి నీరు లేకపోయినా ఇవి ఏ ఇబ్బందీ లేకుండా జీవిస్తాయి! * నీళ్లు లేకపోయినా ఇవి చాలా రోజులు ఉండగలవు. అయితే నీళ్లు దొరికాయంటే మాత్రం ఒక్కసారి నలభై గ్యాలన్లు ఆపకుండా తాగేస్తాయి! * ఒంటెల కనుగుడ్లకు, కను రెప్పలకు మధ్య ఒక సన్నని పొరలాంటిది ఉంటుంది. ఎడారుల్లో తిరిగినప్పుడు ఇసుక కళ్లలో పడకుండా ఈ పొరే కాపాడుతుంటుంది! వీటి నోటి లోపలి భాగాలు ఎంత దృఢంగా ఉంటాయంటే... ముళ్ల చెట్లను, కాయలను తిన్నాసరే, చిన్న గాయం కూడా అవ్వదు! * ఇసుక, దుమ్ము రేగినప్పుడు తమ నాసికారంధ్రాలను మూసుకోగలిగే శక్తి ఒంటెలకు ఉంది! * ఆవుపాలలో కంటే ఒంటె పాలలో కొవ్వు, చక్కెర శాతం తక్కువగా ఉంటాయి. అయితే ఇవి తాగడం మంచిది కాదు. ఎందుకంటే ఇవి చాలా చిక్కగా ఉండటం వల్ల కడుపులో తిప్పడం, వాంతులు అవ్వడం జరగవచ్చు! * వీటికి చెమట అంత త్వరగా పట్టదు. పట్టాలంటే ఉష్ణోగ్రత నలభయ్యొక్క డిగ్రీలు దాటాల్సిందే! * ఇవి నీళ్లు లేని ప్రదేశాల్లో జీవిస్తాయి. అయినా వీటికి ఈత ఎలా వస్తుందో తెలియదు కానీ... అద్భుతంగా ఈదగలవు! -
పులులు మిమిక్రీ చేస్తాయా?!
జంతు ప్రపంచం ►పుట్టిన తర్వాత ఓ వారం రోజుల వరకూ పులులకు కళ్లు కనిపించవు. ఆ తర్వాతే మెల్లగా అన్నీ కనిపిస్తాయి. చూపు స్పష్టమవడానికి కాస్త సమయం పడుతుంది. పులికి ఎంత బలముంటుందంటే... అది తనకంటే రెండు రెట్లు పెద్దదైన జీవిని కూడా చాలా తేలిగ్గా చంపేయగలదు! ►ఆహారం విషయంలో పులులు చాలా స్వార్థంగా ఉంటాయి. ఒక జంతువును చంపి తిన్న తర్వాత ఇంకా మిగిలితే... దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి, ఆకులతో కప్పి మరీ దాచిపెడతాయి. ఆ తర్వాత మళ్లీ ఆకలేసినప్పుడు వెళ్లి తింటాయి! ►పులి పిల్లలు రెండేళ్ల వరకూ తల్లిని అంటిపెట్టుకునే ఉంటాయి. ఎందుకంటే అవి పద్దెనిమిది నెలల వరకూ వేటాడలేవు. అందుకే వేటలో నైపుణ్యం సంపాదించాక గానీ తల్లిని వదిలి వెళ్లవు! ►ఇవి ఒంటరిగా వేటాడటానికి ఇష్టపడతాయి. పైగా రాత్రిపూటే వేటాడతాయి! ►ఎంత ఒంటరిగా ఉండటానికి ఇష్టపడినా, సాటి పులి విషయంలో ఇవి చాలా స్నేహంగా మెలగుతాయి. తాను ఆహారాన్ని తింటున్నప్పుడు అక్కడికి మరో పులి వస్తే, దానికి తమ ఆహారాన్ని పంచుతాయివి! ఎందుకంటే, పులి ఆహారం కోసం, తనను తాను రక్షించుకోవడం కోసం తప్ప ఏ ప్రాణినీ చంపదు. పరిశీలిస్తుందంతే. అందుకే ఎప్పుడైనా పులి ఎదురుపడితే కంగారుపడి దాన్ని రెచ్చగొట్టకుండా... దాని కళ్లలోకే చూస్తూ, మెల్లగా వెనక్కి నడుస్తూ పోవాలని జీవ శాస్త్రవేత్తలు చెబుతుంటారు! ►పులులకు మిమిక్రీ చేయడం తెలుసు. ఒక్కోసారి వేటాడబోయే జంతువుని మోసగించడానికి, ఆ జంతువులాగే శబ్దాలు చేయడానికి ప్రయత్నిస్తాయి! పులుల జ్ఞాపకశక్తి మనుషుల కంటే ముప్ఫైరెట్లు ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి అవి దేనినైనా గుర్తు పెట్టుకున్నాయంటే... చనిపోయేవరకూ మర్చిపోవు. -
మేకకి జలుబు చేస్తుందా?!
జంతు ప్రపంచం * మేకపిల్లలకి గారమెక్కువ. తల్లి కాసేపు కనిపించకపోయినా కంగారు పడిపోతుంటాయి! * మేకలు పిల్లలను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాయి. పుట్టినప్పట్నుంచీ తమ కూతను వాటికి అలవాటు చేస్తాయి. ఎక్కడ ఉన్నా తల్లి కూతపెట్టగానే పిల్లలు వచ్చేస్తాయి. * మేక పిల్లల్ని కిడ్స్ అంటారు. * వీటికి ఐక్యత చాలా ఎక్కువ. చుట్టూ ఉండే వాటితో స్నేహంగా మెలగుతాయి. దేనికి కష్టం వచ్చినా అన్నీ చుట్టూ చేరతాయి! * చెట్లెక్కి దూకడమంటే సరదా. * వీటికి కింది వరుసలో కొన్ని పళ్లు, దంతాలు మాత్రమే ఉంటాయి. కాకపోతే దవడలు చాలా బలంగా ఉండటం వల్ల ఆహారం నమలడంలో ఇబ్బంది ఉండదు! * కొన్ని రకాల మేకలు అసలు నిద్రే పోవని పరిశోధనల్లో తేలింది! * మనుషుల్లాగే మేకలకు కూడా జలుబు చేస్తుంది. * మేకలు తమ శరీర బరువు కంటే ముప్ఫై శాతం ఎక్కువ బరువును మోసేంత బలంగా ఉంటాయి! * వీటికి కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువ. ముఖ్యం గా ఆహారం విషయంలో. ఏదైనా కొత్త పదార్థం కనిపిస్తే నోటిలో పెట్టుకుని చప్పరిస్తాయి. తినొచ్చు అని నిర్ణయించుకున్న తర్వాతే ఆరగిస్తాయి! * మేకల్లో కొన్ని జాతుల వాటికి అకస్మాత్తుగా నాడీవ్యవస్థ దెబ్బ తింటుంది. కండరాలు, నరాలు పని చేయడం మానేస్తాయి. దాంతో ఇవి సొమ్మసిల్లి పడిపోతాయి. మళ్లీ మామూలవుతాయి. -
పచ్చగడ్డే కాదు.. పచ్చిమాంసమూ తింటాయి!
జంతు ప్రపంచం * పుట్టినప్పుడు దాదాపు అన్ని జింకలకీ ఒంటిమీద తెల్లని మచ్చలుంటాయి. కాలం గడిచేకొద్దీ కొన్నింటికి చెరిగిపోతాయి. కొన్నిటి శరీరంపై మిగిలిపోతాయి! * పుట్టిన అరగంటకే ఇవి నడుస్తాయి. నెల తిరిగేసరికే పరుగెత్తుతాయి. * ఇవి నాలుగు పళ్లతో పుడతాయి. మిగతా పళ్లు తరువాత మొలుస్తాయి! * జింకలన్నీ శాకాహారులని చాలామంది అనుకుంటారు. కానీ కొన్ని రకాల జింకలు మాంసాన్ని కూడా తింటాయి! * వీటి చెవులు ఎంత బాగా పని చేస్తాయంటే... కొన్ని కిలోమీటర్ల దూరంలో వినిపించే శబ్దాలను కూడా స్పష్టంగా వినగలవు. అంతేకాదు... శబ్దం వచ్చే దిశకు తమ చెవుల్ని తిప్పి మరీ వింటాయి! * చిన్నగా కనిపిస్తుంటాయి కానీ ఇవి చాలా ఆహారాన్ని తింటాయి. దాదాపు గంట, రెండు గంటల పాటు తింటే కానీ వీటికి కడుపు నిండదు! * చలికాలం వస్తే ఇవి బద్దకంగా అయిపోతాయి. ఆహారం కూడా చాలా తక్కువగా తీసుకుంటాయి. మళ్లీ వేసవి రాగానే ఎక్కడలేని హుషారు వచ్చేస్తుంది! * ఏదైనా ప్రమాదం సంభవించబోతోందని అనుమానం వస్తే ఇవి తమ తోకల్ని పెకైత్తుతాయి. దాన్ని చూసిన ఇతర జింకలు పరుగందుకుంటాయి! * ఇవి కాస్త పిరికివనే చెప్పాలి. చిన్న చిన్న వాటికే బెదిరిపోతుంటాయి. శత్రువు దాడి చేసినప్పుడు మొదట ధైర్యంగా పరుగు తీసినా... ఉండేకొద్దీ బలహీనమైపోతాయి. దాంతో వాటికి చేతికి చిక్కి ఆహారంగా మారిపోతాయి! * ఇవి ఎప్పుడూ నేరుగా పరుగెత్తవు. వంకర టింకరగా, ముందువెనుకలు చూసుకోకుండా పరుగులు తీస్తాయి. దాంతో ఆ వేగాన్ని నియంత్రించుకోలేక ఒక్కోసారి అడ్డొచ్చినవాటిని గుద్దేస్తుంటాయి. అందుకే కొన్నిసార్లు చనిపోతుంటాయి కూడా! -
గోతిలో నివసించే పక్షి... కివీ!
జంతు ప్రపంచం - కివీ పక్షులకు తోక ఉండదు. రెక్కలు ఉన్నా చాలా చిన్నగా ఉంటాయి. అందుకే ఇవి ఎగురలేవు. - చూడడానికి చిన్నగా ఉన్నా కివీ చాలా బలమైన పక్షి. ముక్కు, కాళ్లు చాలా బలంగా ఉంటాయి. చర్మం మందంగా ఉంటుంది. ఈకలు ఉన్నిలాగా దళసరిగా ఉంటాయి. ఎముకలు దృఢంగా ఉంటాయి. - వీటికి శ్వాసరంధ్రాలు ముక్కు చివర ఉంటాయి. కుక్కల కంటే వేగంగా ఇవి వాసనలను పసిగట్టగలవు! - ఇవి రాత్రిపూట ఆహారాన్ని వేటాడతాయి. పురుగుల్ని ఏరుకోవడం కోసం ముక్కుతో నేలను లోతుగా తవ్వుతాయి. అలా తవ్వేటప్పుడు పెద్దగా శబ్దం చేస్తాయి. - పురుగులతో పాటు పువ్వులు, ఆకులు, సాలీళ్లు, లార్వాలు, చిన్న చిన్న చేపలు, కప్పలను తింటాయి కివీ పక్షులు. - విశ్రాంతి తీసుకునేటప్పుడు ఇవి మనుషుల మాదిరిగా రెండు కాళ్లూ చాపుకుని కూర్చుంటాయి! - వీటి కాళ్లు, ముక్కు చాలా బలంగా ఉంటాయి. వాటి సాయంతో లోతైన గొయ్యి తవ్వి, అందులో నివసిస్తాయి! - వీటికి కోపం చాలా ఎక్కువ. అవి నివసించే స్థలాన్ని వేరే జంతువులేవైనా కబ్జా చేయాలని చూస్తే తీవ్రంగా మండి పడతాయి. ముక్కుతో పొడిచి పొడిచి తరిమేయాలని చూస్తాయి! - కివీ పెట్టే గుడ్డు దాని శరీరపు బరువు కంటే పదిహేను శాతం ఎక్కువగా ఉంటుంది. దాంతో కడుపులో గుడ్డు ఉన్నప్పుడు పొట్ట బాగా సాగిపోయి నేలకు తగులుతుంటుంది. - ఇవి గుడ్లను పొదిగి వదిలేస్తాయి తప్ప... పిల్లలకు తిండి పెట్టి పెంచవు. పుట్టేటప్పటికి పిల్లల కడుపులో గుడ్డుసొన లాంటి ద్రవం ఉంటుంది. దాని కారణంగా కొన్ని రోజుల వరకూ తల్లి తిండి పెట్టకపోయినా అవి బతికేస్తాయి. ఆ తరువాత అవే ఆహారాన్ని వేటాడడం అలవాటు చేసుకుంటాయి!