బ్యాడ్జర్లు బాత్రూములు కట్టుకుంటాయా?! | BADGER causes Radisson Blu hotel, Sweden to shutdown | Sakshi
Sakshi News home page

బ్యాడ్జర్లు బాత్రూములు కట్టుకుంటాయా?!

Published Sat, Mar 14 2015 11:54 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

బ్యాడ్జర్లు బాత్రూములు కట్టుకుంటాయా?! - Sakshi

బ్యాడ్జర్లు బాత్రూములు కట్టుకుంటాయా?!

జంతు ప్రపంచం
ప్రపంచంలో మొత్తం ఎనిమిది రకాల బ్యాడ్జర్లు మాత్రమే ఉన్నాయి. కాస్త ఎలుగుబంటిలాగ, కాస్త ముళ్లపందిలాగ కనిపించే ఈ జంతువులు అమెరికా, యూకే తదితర దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి!
మగ బ్యాడ్జర్‌ను ‘బోర్’ అని, ఆడదాన్ని ‘సా’ అని అంటారు!
పుట్టినప్పుడు బ్యాడ్జర్లకు కళ్లు కనిపించవు.

నాలుగు వారాలు గడిచిన  తర్వాత మెల్లమెల్లగా కనిపించడం మొదలవుతుంది!
బ్యాడ్జర్ పిల్లలు చలిని తట్టుకోలేవు. అందుకే చలికాలం వచ్చేలోపు ఇవి విపరీతంగా తింటాయి. ఒంట్లో కొవ్వు పెంచుకుని, ఆ వేడి ద్వారా చలి నుంచి తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటాయి!     వ్యాంపైర్ జాతి గబ్బిలాలు రక్తం తాగి జీవిస్తాయని అంటారు. వీటిలో మూడు రకాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇవి అమెరికాలోని కొన్ని జూలలో తప్ప మరెక్కడా కనిపించడం లేదు అంటారు జీవ శాస్త్రవేత్తలు!  బ్యాడ్జర్లు తవ్వినంత వేగంగా మరే జీవీ గోతులు తవ్వలేదు!
వీటి జీవన విధానం మనుషుల జీవన విధానంలాగ ఓ క్రమ పద్ధతిలో సాగుతుంది. ఇవి తమ నివాసంలో ఉన్న గదుల్ని చక్కగా పంచుకుంటాయి. తల్లిదండ్రులకి ఓ గది, ఒక్కో పిల్లలకీ ఒక్కో గది అన్నట్టుగా కట్టుకుంటాయి. వేటి గదిలో అవి నివసిస్తాయి!
తమ నివాసంలో ఎలుకల వంటి ఇతర జంతువులు రావడానికి, చెత్తా చెదారం చేరడానికి వీల్లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంటాయి బ్యాడ్జర్లు. పాలిథీన్ కవర్లు, ఆకులు వంటివన్నీ ఏరి తెచ్చుకుని రంధ్రాలను మూసి పెడతాయి!
మరీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఇవి ఎక్కడ పడితే అక్కడ మలమూత్రాలను విసర్జించవు. తమ నివాసాలకు దగ్గరలో గొయ్యి తీసి పెట్టుకుంటాయి. అందులోనే విసర్జిస్తాయి. అది నిండిపోయాక ఇసుక, మట్టి, చెత్తతో కప్పేసి, మరో గొయ్యి తీసుకుంటాయి!
రకరకాల పురుగులు, పండ్లు తిన్నప్పటికీ... వీటి ప్రధాన ఆహారం మాత్రం వానపాములు. ఎక్కువగా రాత్రిపూటే ఆహారాన్ని తింటాయి. ప్రతి రాత్రీ కడుపుకు పట్టినన్ని వానపాముల్ని ఆరగించేస్తాయి!
వీటి ఘ్రాణశక్తి అమోఘంగా ఉంటుంది. నేలమీద ఉండి... నేల లోపల ఉన్న జంతువుల వాసన పసిగట్టేస్తాయి. ఈ లక్షణం వీటికి వానపాముల్ని పట్టుకోవడంలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే చిన్న చిన్న శబ్దాలను కూడా పసిగట్టేస్తాయి. కానీ కంటి చూపు మాత్రం అంతంతమాత్రంగా ఉంటుంది!
వీటి చర్మం చాలా మందంగా ఉండటం వల్ల అంత త్వరగా గాయపడవు. అయితే వీటి గోళ్లు, దంతాలు చాలా పదునుగా ఉండటం వల్ల ఇతర జంతువులు మాత్రం వీటివల్ల బాగానే గాయపడుతుంటాయి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement