ఆహారాన్వేషణలో అతిచురుకైనవి
జంతు ప్రపంచం
{పపంచంలో మొత్తం ఐదు వేల రకాల తూనీగలు ఉన్నాయి. ఇవి అన్ని ఖండాల్లోనూ ఉంటాయి... అంటార్కిటికాలో తప్ప! తూనీగలకు రెండు జతల రెక్కలుంటాయి. అయితే మిగతా కీటకాల్లాగ ఎగిరేందుకు రెక్కల్ని ఆడించాల్సిన అవసరం ఉండదు వీటికి. అందుకే ఈగలు తమ రెక్కల్ని సెకనుకు మూడు వందలసార్లు ఆడిస్తే, తూనీగలు మాత్రం ముప్ఫైసార్లే ఆడిస్తాయి!
ఇవి చాలా వేగంగా ఎగురుతాయి. అలాగే పైనుంచి కిందికి, కింది నుంచి పైకి, పక్కలకు... ఎలా అయినా ఎగరగలవు!వీటి కనుగుడ్ల నిర్మాణంలో ఉన్న ప్రత్యేకత వల్ల... తల తిప్పకుండానే అన్ని వైపులకూ చూడగలుగుతాయి! చిన్న చిన్న పురుగులు, దోమలు, లార్వాలు, పూలలోని తేనె, చిన్న చిన్న చేపలు వీటి ఆహారం. దోమలను అన్నిటికంటే ఇష్టంగా తింటాయి. ఒక్కరోజులో కొన్ని వేల దోమల్ని హాం ఫట్ చేసేస్తాయి! ఇవి నేలమీద జీవించగలవు. నీటిలోనూ జీవించగలవు. అందుకే ఎక్కువగా నీటి చెలమల చుట్టుపక్కలే కనిపిస్తుంటాయి!చాలాసార్లు ఆడ, మగ తూనీగల మధ్య హక్కుల కోసం పోరాటం జరుగుతూ ఉంటుంది. ఇవి పోట్లాడుకుంటాయి. ఒకదాన్నొకటి తరుముకుంటాయి. ఎగరడంలో పోటీలు కూడా పెట్టుకుంటాయి. మగ తూనీగలు ఆడ తూనీగల మీద కోపంతో విరుచుకుపడుతుంటాయి కూడా!
వీటి రెక్కలు చాలా బలహీనంగా, పలుచగా ఉంటాయి. వేడి ఎక్కువ తగిలితే వెంటనే కాలిపోతాయి. అందుకే అతి వేడిమి దగ్గరకు పోకుండా ఇవి జాగ్రత్తపడుతుంటాయి! ఇవి ఆహారాన్ని వేటాడటంలో చాలా చురుకుగా ఉంటాయి. ఒకేసారి రెండిటిని పట్టుకునేందుకు కూడా ప్రయత్నిస్తాయి. ఎగిరిపోతోన్న రెండు దోమల్ని టార్గెట్ చేసి, ఒకదాని తర్వాత ఒకదాన్ని వెంటవెంటనే పట్టుకోవడం గమనించిన వైడర్‌మ్యాన్ అనే జీవ శాస్త్రవేత్త ఈ విషయాన్ని బయటపెట్టారు! వీటికి నిల్వ ఆహారం నచ్చదు. ఎప్పటికప్పుడు తాజాగా వేటాడి తినాలి. కాసేపు నిల్వ అయినా ఇక దాన్ని ముట్టుకోవు! వీటికి కోపం చాలా ఎక్కువ. తాము వెళ్లేదారికి ఏదైనా అడ్డు వస్తే విసుగు వచ్చేస్తుంది వీటికి. ఎగిరేటప్పుడే వేరే తూనీగ తనను దాటి వెళ్లిపోవాలని చూసినా ఇవి తట్టుకోలేవు. దానికన్నా వేగంగా ఎగరాలని, దాన్ని డామినేట్ చేయాలని ప్రయత్నం చేస్తాయి!