ముంగిసలూ కబ్జా చేస్తాయి!
జంతు ప్రపంచం
వీటి ప్రధాన ఆహారం కీటకాలు, పీతలు, వానపాములు, బల్లులు, పాములు, కోళ్లు మొదలైనవి. అయితే అవి మాత్రమే తినాలని లేదు. మాంసాహారం దొరక్కపోతే శాకాహారాన్ని లాగించేస్తాయి. దుంపలు, మొక్కలు, పళ్లు... ఏవి దొరికితే వాటితో కడుపు నింపేసుకుంటాయి!
ఇవి ఆహారాన్ని చాలా పద్ధతిగా తింటాయి. ఓ మొక్కను తినేటప్పుడు పిచ్చి ఆకులుంటే తీసి పక్కన పారేసి మరీ తింటాయి. కొన్ని రకాల పండ్లు తినేటప్పుడు గింజలు తీసి పారేస్తుంటాయి. గుడ్లను ఏదైనా బలమైన వస్తువుతో పగులగొడతాయి. లేదంటే బండకేసి కొట్టి, పగిలిన తర్వాత సొనను తింటాయి!
విషపూరితమైన పాముల్ని సైతం ముంగిసలు చంపేస్తాయని మనకు తెలుసు. అయితే విషాన్ని పూర్తిగా హరాయించుకునే శక్తి వీటికి ఉందని అనుకుంటే పొరపాటు. వీటికి పాముల్ని చంపే టెక్నిక్ బాగా తెలుసంతే. పాముల్ని అటు తిప్పి ఇటు తిప్పి, విసిగించి అలసిపోయేలా చేస్తాయి. తర్వాత తలను తొక్కిపెట్టి చంపుతాయి. అలా అని విషాన్ని అస్సలు తట్టుకోవని కూడా కాదు. కొంతమేర వరకూ విషం వీటిని ఏమీ చేయలేదు. కానీ ఎక్కువసార్లు కాటుకి గురైనా, ఎక్కువ మోతాదులో విషం శరీరంలోకి చేరినా ప్రాణాలు కోల్పోతాయని పరిశోధనల్లో తేలింది!
వీటికి ఒంటరిగా నివసించడం ఇష్టం. అయితే రక్షణ ఉండదన్న భయంతో గుంపులు గుంపులుగా జీవించడానికి సిద్ధపడతాయి. ప్రమాద సూచికలేవైనా కనిపించగానే ఒక విచిత్రమైన శబ్దం చేసి మిగతా వాటన్నింటినీ అప్రమత్తం చేస్తాయి! ముంగిస పిల్లలకు జన్మించిన కొన్ని వారాల వరకూ కళ్లు కనబడవు. అలాగే... కొన్ని నెలల వరకూ విషాన్ని తట్టుకునే శక్తి కూడా ఉండదు. దాంతో తల్లులు తమ పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాయి. శత్రువుల కంటబడకుండా గుంపు మధ్యలో పిల్లల్ని దాచిపెట్టుకుంటాయి!
వీటికి ఒక్కచోట ఉండటం ఇష్టముండదు. ఎప్పుడూ కొత్త కొత్త ప్రదేశాలు చూస్తూండాలి. అందుకే వారానికోసారి నివాసాన్ని మార్చేస్తాయి!గోతులే వీటి నివాసం. అయితే కష్టపడి గోతిని తవ్వుకోవు. వేరే జంతువులేవైనా తవ్విన గోతుల్ని కబ్జా చేసి, వాటిలో నివసిస్తుంటాయి. ఇతర జీవులు తన నివాసంలో ప్రవేశించకుండా, గొయ్యి చుట్టూ ఒకలాంటి ఘాటైన ద్రవాన్ని వెదజల్లుతాయి! నాలుగు కాళ్ల జీవి అయినా కూడా ముంగిస రెండు కాళ్లతో మేనేజ్ చేయగలదు. రెండు కాళ్లమీద నిలబడగలదు, నడవగలదు, పరుగెత్తనూగలదు!