Mongoose
-
నాగ పంచమి.. గిన్నెలో పాలను తాగిన ముంగిస
రాయచూరు రూరల్: శ్రావణ మాసంలో వచ్చే నాగ పంచమి రోజున మహిళలు భక్తిశ్రద్ధలతో వ్రతాలు, నోములను ఆచరించారు. సోమవారం నాగ పంచమి సందర్భంగా నగరంలోని నాగేష్ కట్ట వద్ద నాగ ప్రతిమలకు, పుట్టలకు మహిళలు పాలు పోసి తమ మొక్కులు తీర్చుకున్నారు. పిల్లలకు పాలు పంపిణీ నాగ పంచమి సందర్భంగా సోమవారం నగరంలో పద్మావతి, అంబేడ్కర్ నగర్, ఉరుకుంద ఈరణ్ణ కాలనీ, తాలూకాలోని మండలగేరలో రవి పాటిల్ ఫౌండేషన్ అధ్యక్షుడు రవి పాటిల్ పిల్లలకు పాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్, రాజశేఖర్ పాటిల్, శరణు, మంజునాథ్, రాజు, రఘపతి, జంబప్ప, మునియప్పలున్నారు. నాగేంద్ర ఆలయంలో పూజలు కంప్లి: బుక్కసాగర గ్రామ సమీపంలోని కొండల్లో విజయనగర రాజుల కాలంలో ఏర్పాటు చేసిన ఏడు పడగల నాగేంద్రుడి ఆలయం నాగుల చవితి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఈ ఆలయానికి మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్ రోడ్డు వేయించడంతో వాహన రాకపోకలు సునాయాసంగా సాగుతున్నాయి. గిన్నెలో పాలను తాగిన ముంగిస నాగుల చవితికి పాము పుట్టలు, రాతి నాగప్పలకు పాలు పోయడం ఆచారం. అయితే పాముతో పోటీ పడే ముంగిస కూడా పాలు తాగిన ఘటన హరపనహళ్లి తాలూకాలో జరిగింది. తాలూకాలోని కరిబసవేశ్వర అనే వ్యక్తి ముంగిస నిత్యం ఆహారాన్ని సేవించే వేళ గిన్నెలో పాలను పోసివ్వడంతో ముంగిస ఆ పాలు తాగింది. -
పిల్లల కథ: గర్వభంగం
దండకారణ్యపు లోతట్టు ప్రాంతంలో ఒక మంచినీటి కోనేరు ఉండేది. ఆ పరిసర ప్రాంతాల్లోని జీవులకు అదే నీటి వనరు. రాజైన సింహం కూడా అక్కడే దాహం తీర్చుకునేది. మడుగు సమీపంలోనే ఒక పుట్టలో ముసలి ఆడ తాచు, తన బిడ్డతో జీవిస్తుండేది. యువ పాము దుందుడుకు స్వభావం కలది. క్రమశిక్షణ లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ అందరినీ ఆట పట్టించేది. ఎవరైనా మందలిస్తే కాటు వేస్తానని బెదిరించేది. ఒకసారి మృగరాజు దప్పిక తీర్చుకోవటానికి కోనేటికి వచ్చింది. అయితే చుట్ట చుట్టుకుని దారికి అడ్డంగా పడుకుని గురకలు పెట్టసాగింది యువ పాము. ‘పక్కకి తొలుగు!’ అని సింహం ఆజ్ఞాపించింది. నిద్రమత్తులో ఉన్న ఆ పాముకి వినబడలేదు. ‘రాత్రి తిన్న ఎలుకో, కప్పో అరగలేదనుకుంటా. నిద్రకు ఆటంకం కలిగించటమెందుకు? పోన్లే పాపమ’ని సింహం పెద్ద మనసు చేసుకుని పక్కనుండి పోయి, నీళ్ళు తాగి తిరిగి ఎడంగా వెళ్ళిపోయింది. కాసేపటికి నిద్ర లేచిన యువ పాముని బాట పక్కనున్న చెట్టు మీది తీతువు పిట్ట పలకరించి జరిగిన సంఘటనని చోద్యంగా చెప్పింది. అది విన్న పాము సంతోషంతో పడగ విప్పి, అంతెత్తున ఉప్పొంగింది. రాజైన సింహమే తనను గౌరవించిందనే అహంకారం దాని తలకెక్కింది. అగ్నికి ఆజ్యం తోడైనట్టు తీతువు మాటలు దాన్ని తారస్థాయికి తీసుకువెళ్ళాయి. ‘మీది సామాన్యమైన జాతి కాదు మిత్రమా! పురాణ పురుషుడైన కాళీయుడి వారసులు మీరు. అందుకే మీ తలలపై శ్రీకృష్ణుడి పాద ముద్రలు ఉంటాయి. కాబట్టే మృగరాజు నీ పట్ల సహనం చూపించాడు. మీ సర్పాల్లో ఎన్నో శాఖలున్నా పడగ విప్పగల సామర్థ్యం కేవలం మీ తాచు పాములకే ఉంది’ అంటూ ఆకాశానికెత్తేసింది. ఆ మాటలకు యువనాగు మరింత పెడసరంగా ప్రవర్తించసాగింది. తల్లి ఎన్నిమార్లు హితబోధ చేసినా దాని వైఖరి మారలేదు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని తల్లి పాము ఆందోళన చెందేది. (చదవండి👉 ఎవరు ఎక్కువ ప్రమాదం?) ఒకనాడు దాని ఆగడాలకు చరమగీతం పాడే పరిస్థితి వచ్చింది, ఆ దారిన ఒక ముంగిస రావటం తటస్థించింది. మార్గమధ్యంలో తిష్టవేసిన పాముని చూడగానే దానికి కోపం వచ్చింది. ‘దారిలోంచి తప్పుకో. నేను మంచినీరు తాగటానికి పోవాలి’ అంది అసహనంగా. యువసర్పం ఓసారి కళ్ళు విప్పి ముంగిసని చూసి, నాలుకలు చప్పరించి మళ్ళీ పడుకుంది. ఆ నిర్లక్ష్యానికి ముంగిస కోపం నెత్తికెక్కింది. ‘చెపితే వినపడటం లేదా? మర్యాదగా మార్గంలోంచి లే!’ అంటూ హుంకరించింది. యువపాము దానినసలు పట్టించుకోలేదు. అయితే ప్రమాదాన్ని గ్రహించిన తీతువు పిట్ట పాము దగ్గరకి వచ్చి, ‘పక్కకి జరుగు. లేకపోతే కొంపలంటుకుంటాయి’ అంది. యువపాము గీరగా చూస్తూ ‘చుంచెలుకకి నేను భయపడాలా? నా సంగతి దానికి తెలీదనుకుంటా. కాస్త మన ఘనతని వర్ణించి చెప్పు’ అంది తీతువుతో. ‘ఏంటీ? నేను ఎలుకనా? అసలు నేనెవరో తెలిస్తే పై ప్రాణాలు పైనే పోతాయి నీకు’ అంది ముంగిస ఆగ్రహంగా. ‘మరీ అంతగా గప్పాలు కొట్టుకోకు. నువ్వు ఎలుకవే కదా? మామూలు ఎలుకలైతే మూడు తింటాను. నువ్వు కాస్త పెద్దగా ఉన్నావు కాబట్టి నిన్నొక్కదాన్ని తింటే చాలు. మళ్ళీ వారం వరకూ వేట ప్రయాస ఉండదు’ అంటూ ఆవులించి మళ్ళీ పడుకోబోయింది. ముంగిసకి అహం దెబ్బతింది. ఈ పొగరుబోతు పాము పిల్లకి తగిన గుణపాఠం చెప్పాలనుకుంది. (చదవండి👉 జానకమ్మ తెలివి) ‘ఇదిగో ఆఖరుసారిగా హెచ్చరిస్తున్నాను. పక్కకి తప్పుకుని, దారి ఇస్తావా? లేక నా తడాఖా చూపించమంటావా?’ అంది. దాంతో యువనాగుకీ తిక్కరేగింది. సర్రున పైకి లేచి పడగ విప్పి, బుస కొట్టి ‘నాకు భుక్తాయాసంగా ఉండటం వల్ల ఇంతసేపు మాట్లాడనిచ్చాను. ఆకలితో ఉంటే ఈపాటికి నిన్ను గుటుక్కున మింగేసేదాన్ని’ అంటూ బలంగా కాటు వేసింది. ముంగిస లాఘవంగా తప్పించుకుని ‘ఓహో నీకు ఎలుకలా కనిపిస్తున్నానా? అయితే నేనెవరో నీకు తప్పక తెలియాల్సిందే, తగిన బుద్ధి చెప్పాల్సిందే’ అంటూ పోరాటానికి దిగింది. ముంగిసకీ, మూషికానికీ తేడా తెలియక యువపాము పీకలమీదకి తెచ్చుకుంటున్నదని తీతువు పిట్ట ఆవేదన చెందింది. దుడుకుతనంతో పాము పిల్ల వేస్తున్న కాట్ల నుండి తప్పించుకుంటూ, దాని చుట్టూ గుండ్రంగా తిరుగుతూ బాగా కవ్వించింది ముంగిస. దాని వ్యూహంలో చిక్కుకున్న యువపాము పదే పదే కాటు వేయటంతో దాని దగ్గరున్న విషం నిల్వ అయిపోయింది. తిరిగి ఉత్పత్తి కావటానికి కొంత సమయం పడుతుంది. అత్యుత్సాహంతో పోరాడటం వల్ల తొందరగా అలసి పోయింది. దాడి చేస్తే లొంగిపోయి, ప్రాణ రక్షణకై ఆర్తనాదం చేసే ఎలుకకీ, కాటు వేస్తున్నా తప్పించుకుని, ఎదురు దాడి చేస్తున్న ముంగిసకీ మధ్య భేదం మొదటిసారిగా అవగతమై యువపాము కళ్ళు తెరుచుకున్నాయి. కానీ అప్పటికే ఆలస్యమై పోయింది. ఒళ్లంతా గాయలతో నెత్తురోడుతోంది. బలహీన పడిన యువపాముపై ముంగిస అమాంతం దూకి మెడ పట్టుకుని కొరకబోయింది. ఈలోపు తీతువు పిట్ట హుటాహుటిన పోయి, దాని తల్లిని తీసుకు వచ్చింది. బిడ్డ చావబోతుండటం చూసి, తల్లడిల్లిన తల్లిపాము ముంగిసని శరణు కోరింది. ముసలి పాముని చూసి జాలి పడిన ముంగిస యువ పాముని వదిలేసి మరెప్పుడూ పొగరుగా ప్రవర్తించ వద్దని హెచ్చరించింది. ఆ పాఠం తర్వాత యువపాము బుద్ధిగా మసలుకోసాగింది. -
ముంగిసతో ఫోటోకి ఫోజులు.. నటిపై కేసు నమోదు
Bengali actress Srabanti Chatterjee: బెంగాలీ నటి స్రబంతి ఛటర్జీపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదైంది. గొలుసుతో కట్టేసి ఉన్న ముంగిసతో ఫోటో దిగి, దాన్ని సోషల్ మీడియాలో చేయడంతో ఆమెపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972లోని సెక్షన్లు 9, 11, 39, 48ఏ, 49, 49ఏ ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించి జంతువులను అక్రమంగా పట్టుకోవడం, రవాణా చేయడం, స్వాధీనం చేసుకున్నందుకు ఛటర్జీపై కేసులు నమోదు చేయబడ్డాయి. కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌లోని వైల్డ్‌లైఫ్ క్రైమ్ కంట్రోల్ సెల్, డేటా మేనేజ్మెంట్ యూనిట్ కార్యాలయం ముందు హాజరు కావాలని స్రబంతికి నోటీసులు పంపారు. అయితే వ్యన్య ప్రాణుల సంరక్షణ చట్టం గురించి తనకు అంతగా తెలియదని ఆమె అధికారులకు వివరించినట్లు తెలిసింది. ఇప్పటికే ఆమె అధికారుల ముందు హాజరుకాలేదు. ఈ విషయంపై స్రబంతిని మీడియా ప్రశ్నించగా..‘ఈ కేసు విచారణలో ఉది. అందుల్ల నేను ఏమి మాట్లాడలేను’అని బదులిచ్చారు. ఇక స్రబంతి ఛటర్జీ వ్యక్తిగత న్యాయవాది ఎస్కే హబీబ్ ఉద్దీన్ మాట్లాడుతూ.. ‘స్రబంతి ఇంకా అధికారులను కలవలేదు. వారిని కలిసిన తర్వాత మాత్రమే స్పష్టమైన వివరణ ఇవ్వగలం.కచ్చితమైన ఆరోపణలను తెలుసుకోవడానికి మేము త్వరలో అధికారులను కలుస్తాం’అని చెప్పారు. ఈ కేసు గురించి ఓ సీనియర్ అటవీశాఖ అధికారి మాట్లాడుతూ.. వన్యప్రాణులను బంధించడం ఒక్కటే నేరం కాదు, ప్రజల్లో ఆదరణ ఉన్న వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడడం వల్ల ఇతరులు తప్పులు చేసే అవకాశం ఉంది. అందుకే స్రబంతిపై కేసు నమోదైంది. దర్యాప్తుకు ఆమె సహకరించి, వన్యప్రాణుల సంరక్షణ కోసం తాము చేస్తున్న పోరాటానికి మద్తతుగా నిలవావాలని కోరారు. -
ఇదేం ముంగిస.. ఉన్నట్టుండి చస్తుంది.. మళ్లీ!
పక్షిని చంపి ఆహారంగా చేసుకుందామని వెళ్లిన ముంగిసకు చుక్కెదురైంది. పక్షి ఎదురు తిరగడంతో ఇక తన చావుకు వచ్చిందని గ్రహించి ముంగిస చావు తెలివితేటలు చూపించింది. మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదివిన కథ మాదిరి పక్షి, ముంగిస మధ్య సన్నివేశం జరిగింది. ఈ సన్నివేశం నెటిజన్లతో నవ్వులు పూయిస్తోంది. ఎలుగుబంటి ఎదురైతే శవంగా ప్రవర్తిస్తే తప్పించుకోవచ్చనే కథ చదివే ఉంటారు. ఆ మాదిరి ముంగిస, హార్న్‌బిల్ పక్షి మధ్య జరిగింది. ఆ సరదా ఘటన దక్షిణాఫ్రికాలోని సబి సాండ్స్ గేమ్ రిజర్వ్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండవుతోంది. పుసుపు ముక్కు గల హార్న్‌బిల్ పక్షి సరస్సులో నీరు తాగేందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సమయంలో అక్కడే ఉన్న ముంగిసలు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అందులో ఒక ముంగిస ఆ పక్షి వద్దకు వెళ్లి దాడి చేసేందుకు ప్రయత్నించింది. అయితే ముంగిసపై పక్షి ఎదురుదాడి చేసింది. దీంతో భయాందోళన చెందిన ముంగిస వెంటనే చావు తెలివితేటలు చూపించింది. మూర్చ వచ్చిన మాదిరి కొన్ని సెకన్ల పాటు బోర్లా పడుకుంది. దీంతో పక్షి దాన్ని ఏం చేయకుండా వెను తిరిగింది. మరొకసారి ముంగిస దాడి చేసేందుకు ప్రయత్నించగా మళ్లీ అదే సన్నివేశం జరిగింది. దీంతో అక్కడికి వచ్చిన సందర్శకులు, పర్యాటకులు ఈ సరదా సన్నివేశం చూసి నవ్వుకున్నారు. హార్న్‌బిల్ పక్షి, ముంగిస మధ్య జరిగిన ఆ సరదా సంఘటన ఇన్‌స్టాగ్రామ్‌లో వైల్డ్ లైఫ్ ప్రతినిధులు షేర్ చేశారు. మీరు చూడండి.. నవ్వేసేయండి. -
పాము ముంగిసల ఫైట్ వీడియో వైరల్!
పాము ముంగిసల వైరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా శత్రువులు అని చెప్పాలంటే కూడా వాళ్లు పాము, ముంగిసలు లాంటోళ్లు అని చెబుతాం. అలాంటిది ఒక పాము, ముంగిస రోడ్డు మీద కొట్టుకుంటూ కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోను ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అబ్ధుల్ కయ్యూమ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 29 సెకన్ల నిడివిగల ఈవీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘ఇదే ప్రకృతి అంటే. ఏ యోధుడు కూడా వెళ్లి వాటిలో ఏదో ఒకదానిని కాపాడటానికి ప్రయత్నించలేదు. అందుకు నాకు సంతోషంగా ఉంది. ప్రకృతిలో పోరాడే వాళ్లే జీవించగలుగుతారు అని మరోసారి అర్థం అవుతుంది’ అని ఫారెస్ట్ ఆఫీసర్ ట్వీట్ చేశారు.దీనికి నెటిజన్లు స్పందిస్తూ అక్కడ ఉన్నవారికి జంతువుల పట్ల చాలా దయ ఉంది అందుకే అక్కడ వారు ఎవరు వాటిని విషయంలో కలగజేసుకోలేదు అని కామెంట్ చేశారు. నిజంగా ప్రకృతి అంటే ఇదే అని మరొకరు కామెంట్ పెట్టారు. వాటిని మధ్యలోకి మనం వెళ్లకూడదు వాటి పనిని వాటిని చేసుకోనివ్వాలి అని మరొక యూజర్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. This is absolutely natural. I am happy that no crusader jumped in to save either species. It’s the survival of fittest which prevails in #nature Vid-WA. @IfsJagan @vivek4wild pic.twitter.com/RtsR5LosnI — Dr Abdul Qayum, IFS (@drqayumiitk) August 18, 2020 చదవండి: వైరల్: టాయిలెట్లోకి పాము ఎలా వచ్చింది! -
వెంటాడి.. వేటాడి!
‘వంద గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కూలిపోతుంది’ అంటారు.. ఈ చిత్రాన్ని చూస్తే సరిగ్గా అదే సామెత గుర్తుకు వస్తోంది కదూ! అడవిలో తనకు ఎదురే లేదని విర్రవిగే బూమ్స్లాంగ్ అనే విషసర్పాన్ని ఓ ముంగిస వేటాడింది. చెట్టు చిటారుకొమ్మన విశ్రమిస్తున్న ఆ పాము వీపుపైనే ఎక్కి తలను నోట కరిచి చంపేసింది. పాపం! ఏనుగులు, మనుషులను ఒక్క కాటుతో మట్టుబెట్టే సర్పాన్ని తన వాడైన పళ్లతో ముంగిస కరకరా నమిలేసింది. నమీబియాలోని ఎస్తోషా నేషనల్ పార్కులోనిదీ దృశ్యం. -
ముంగిసలూ కబ్జా చేస్తాయి!
జంతు ప్రపంచం వీటి ప్రధాన ఆహారం కీటకాలు, పీతలు, వానపాములు, బల్లులు, పాములు, కోళ్లు మొదలైనవి. అయితే అవి మాత్రమే తినాలని లేదు. మాంసాహారం దొరక్కపోతే శాకాహారాన్ని లాగించేస్తాయి. దుంపలు, మొక్కలు, పళ్లు... ఏవి దొరికితే వాటితో కడుపు నింపేసుకుంటాయి! ఇవి ఆహారాన్ని చాలా పద్ధతిగా తింటాయి. ఓ మొక్కను తినేటప్పుడు పిచ్చి ఆకులుంటే తీసి పక్కన పారేసి మరీ తింటాయి. కొన్ని రకాల పండ్లు తినేటప్పుడు గింజలు తీసి పారేస్తుంటాయి. గుడ్లను ఏదైనా బలమైన వస్తువుతో పగులగొడతాయి. లేదంటే బండకేసి కొట్టి, పగిలిన తర్వాత సొనను తింటాయి! విషపూరితమైన పాముల్ని సైతం ముంగిసలు చంపేస్తాయని మనకు తెలుసు. అయితే విషాన్ని పూర్తిగా హరాయించుకునే శక్తి వీటికి ఉందని అనుకుంటే పొరపాటు. వీటికి పాముల్ని చంపే టెక్నిక్ బాగా తెలుసంతే. పాముల్ని అటు తిప్పి ఇటు తిప్పి, విసిగించి అలసిపోయేలా చేస్తాయి. తర్వాత తలను తొక్కిపెట్టి చంపుతాయి. అలా అని విషాన్ని అస్సలు తట్టుకోవని కూడా కాదు. కొంతమేర వరకూ విషం వీటిని ఏమీ చేయలేదు. కానీ ఎక్కువసార్లు కాటుకి గురైనా, ఎక్కువ మోతాదులో విషం శరీరంలోకి చేరినా ప్రాణాలు కోల్పోతాయని పరిశోధనల్లో తేలింది! వీటికి ఒంటరిగా నివసించడం ఇష్టం. అయితే రక్షణ ఉండదన్న భయంతో గుంపులు గుంపులుగా జీవించడానికి సిద్ధపడతాయి. ప్రమాద సూచికలేవైనా కనిపించగానే ఒక విచిత్రమైన శబ్దం చేసి మిగతా వాటన్నింటినీ అప్రమత్తం చేస్తాయి! ముంగిస పిల్లలకు జన్మించిన కొన్ని వారాల వరకూ కళ్లు కనబడవు. అలాగే... కొన్ని నెలల వరకూ విషాన్ని తట్టుకునే శక్తి కూడా ఉండదు. దాంతో తల్లులు తమ పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాయి. శత్రువుల కంటబడకుండా గుంపు మధ్యలో పిల్లల్ని దాచిపెట్టుకుంటాయి! వీటికి ఒక్కచోట ఉండటం ఇష్టముండదు. ఎప్పుడూ కొత్త కొత్త ప్రదేశాలు చూస్తూండాలి. అందుకే వారానికోసారి నివాసాన్ని మార్చేస్తాయి!గోతులే వీటి నివాసం. అయితే కష్టపడి గోతిని తవ్వుకోవు. వేరే జంతువులేవైనా తవ్విన గోతుల్ని కబ్జా చేసి, వాటిలో నివసిస్తుంటాయి. ఇతర జీవులు తన నివాసంలో ప్రవేశించకుండా, గొయ్యి చుట్టూ ఒకలాంటి ఘాటైన ద్రవాన్ని వెదజల్లుతాయి! నాలుగు కాళ్ల జీవి అయినా కూడా ముంగిస రెండు కాళ్లతో మేనేజ్ చేయగలదు. రెండు కాళ్లమీద నిలబడగలదు, నడవగలదు, పరుగెత్తనూగలదు!