భారత్‌కు స్విస్ ఖాతాదారుల వివరాలు!
నల్లధనంపై పోరులో ముందడుగు
జాబితాను సిద్ధం చేస్తున్న స్విట్జర్లాండ్
పన్ను ఎగవేతదారుల వివరాలపై ప్రత్యేక కసరత్తు
జ్యూరిచ్: నల్లధనానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మరింత ఊతం లభించింది. స్వదేశంలో పన్నులు ఎగ్గొట్టి తమ బ్యాంకుల్లో సొమ్ము దాచుకున్నట్లు అనుమానిస్తున్న భారతీయులపై స్విట్జర్లాండ్ దృష్టి సారించింది. ఈ మేరకు ఓ జాబితాను సిద్ధం చేసే పనిలో పడినట్లు స్విస్ ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించాయి. ‘స్విట్జర్లాండ్‌లోని వివిధ బ్యాంకుల్లో ఉన్న నిధులు ఎవరివో గుర్తించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగా భారతీయులు, భారతీయ సంస్థలపై దృష్టి సారించాం’ అని స్విస్ ప్రభుత్వాధికారి ఒకరు తాజాగా వెల్లడించారు. ఆ జాబితాలోని వారంతా ట్రస్టులు, స్విస్ కంపెనీలు, ఇతర దేశాలకు చెందిన సంస్థల పేర్లతో ఇక్కడి బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచుకున్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ వివరాలను ఎప్పటికప్పుడు భారత్‌కు అందజేస్తున్నట్లు కూడా పేర్కొన్నారు.
ఈ విషయంలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో కలిసి పనిచేస్తామని, సిట్‌కు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అయితే భారతీయుల వివరాలను మీడియాకు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. పన్నుల విషయంలో పాలనాపరమైన సహకారం అందించడానికి భారత్ సహా 36 దేశాలతో స్విట్జర్లాండ్ ఒప్పందాలు కుదర్చుకుంది. ఈ ఒప్పందం మేరకే వ్యవహరిస్తున్నట్లు ఇక్కడి అధికారులు చెబుతున్నారు. ఇక స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్లదనం లక్షల కోట్లలో ఉంటుందని వస్తున్న కథనాలను కూడా స్విస్ ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. స్విస్ నేషనల్ బ్యాంక్ తాజాగా వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం ఇక్కడి బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము సుమారు రూ. 14 వేల కోట్లు ఉంటుంద ని అంచనా వేసిన సంగతి తెలిసిందే.
తమ బ్యాంకుల్లో ఉన్న నిధుల మూలాలను గుర్తించే ప్రక్రియలో భాగంగా స్విస్ ప్రభుత్వం ఈ కసరత్తు చేస్తోంది. అయితే ఈ సొమ్మంతా నల్లధనమేనని చెప్పలేమని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఈ వివరాలు అందగానే విచారణ చేపట్టి అక్రమంగా సొమ్ము దాచుకున్న వారిపై తగిన చర్యలు చేపడతామని నల్లధనంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం చైర్మన్ జస్టిస్ ఎం.బి. షా స్పష్టం చేశారు.
భారత్‌కు 58వ ర్యాంక్.. స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న విదేశీ నిదుల్లో భారతీయుల వాటా చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది! ఈ విషయంలో భారత్ 58వ స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ వ్యవస్థలో మొత్తం 1.6 ట్రిలియన్ డాలర్ల మేర పేరుకున్న విదేశీ నిధులను గుర్తించగా ఇందులో భారత్ వాటా 0.15 శాతం(2.03 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ = రూ. 14 వేల కోట్లు) మాత్రమేనని తేల్చారు. 20 శాతం వాటాతో యూకే తొలి స్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో అమెరికా, వెస్టిండీస్, జర్మనీ, గెర్నెసీ దేశాలు ఉన్నాయి. స్విస్‌లోని 283 బ్యాంకుల నుంచి సేకరించిన వివరాలతోఈ జాబితా రూపొందుతుంది. 2012లో 70వ స్థానంలో ఉన్న భారత్ ఈసారి 58వ ర్యాంకు పొందింది.