annapureddypally
-
ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించారని శిక్ష
సాక్షి, కొత్తగూడెం(అన్నపురెడ్డిపల్లి) : అటవీశాఖ, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో నేరం రుజువు కావడంతో మొత్తం 24 మందికి సంవత్సరం జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.700 చొప్పున జరిమానా విధిస్తూ కొత్తగూడెం 3వ అదనపు కోర్టులో గురువారం తీర్పువెలువడింది. 2015 సంవత్సరానికి పూర్వం అన్నపురెడ్డి మండలం మర్రిగూడెం గ్రామ పరిసర అటవీభూముల్లో స్థానిక గిరిజనులు పోడు సాగుచేసుకున్నారు. ఆ భూములు అటవీశాఖవి కావడంతో ఆ శాఖ ఉద్యోగులు 2015 సం వత్సరంలో మొక్కల పెంపకం చేపట్టారు. కాగా తాము సాగుచేసుకుంటున్న భూముల్లో మొక్క లు నాటారంటూ స్థానికులు సుమారు 500 మంది న్యూడెమోక్రసీ, సీపీఎం ఆధ్వర్యంలో అటవీశాఖ ఉద్యోగులను అడ్డుకున్నారు. అటవీ శాఖ ఉద్యోగుల ఫిర్యాదుమేరకు పోలీస్స్టేషన్లో ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం తదితర నేరారోపణతో కేసు నమోదయింది. న్యూడెమోక్రసీ, సీపీఎం నాయకులు ఎస్కే ఉమర్, కాక మహేశ్లతోపాటు మొత్తం 24 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో స్థానికులు 22 మంది ఉన్నారు. ఇటీవల ఈ కేసులో సుమారు 14 మంది సాక్షులను న్యాయమూర్తి దేవీమానస విచారించారు. నేరం రుజువైనం దున సంవత్సరం జైలుశిక్ష, ఒక్కొ్కరికి రూ.700 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున సహాయ ప్రభుత్వ న్యాయవాది ఫణికుమార్ వాదించగా లైజన్ ఆఫీసర్ వీరబాబు సహకరించారు. -
పోలీసుల నుంచి తప్పించుకోబోయి..
సాక్షి, అన్నపురెడ్డిపల్లి: పోలీసుల నుంచి తప్పించుకోబోయి పరుగెత్తి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని కొండాయిగూడెం గ్రామ శివారులో ఆదివారం కోడి పందేలు నిర్వహించారు. స్థానిక పోలీసులు కోడి పందేల స్థావరం దగ్గరకు వెళ్తుండగా.. పందేలకు పాల్పడుతున్నవారు గమనించి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పరుగెత్తారు. వారిలో ఎర్రగుంట కే కాలనీకి చెందిన మళ్లా వెంకటేశ్వర్లు(55) కూడా ఉన్నాడు. ఆయన పరిగెడుతూ గ్రామ సమీపంలోని జామాయిల్ తోటలో కుప్పకూలి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయంపై ఎస్సై శ్రీరాముల శ్రీనును వివరణ కోరగా.. అనారోగ్యం కారణంగా మృతి చెంది ఉంటాడని భావిస్తున్నట్లు తెలిపారు. -
కొత్త మండలంగా అన్నపురెడ్డిపల్లి..?
సీఎం ఎదుట ప్రతిపాదించిన ఎమ్మెల్యే తాటి త్వరితగతిన నివేదిక సిద్ధం చేయాలని కలక్టర్కు ఆదేశాలు చండ్రుగొండ : కొత్త జిల్లాల విభజనలో భాగంగా పాలన సౌలభ్యం కోసం కొత్త మండలాలను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సోమవారం హైదరాబాద్లో తుది సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న నియోజకవర్గ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు చండ్రుగొండ మండలంలోని అన్నపురెడ్డిపల్లిని కొత్త మండలంలో చేయాలని సీఎం కేసీఆర్కు ప్రతిపాదనలు అందించినట్లు సమాచారం. అక్కడున్న పరిస్థితులను ఎమ్మెల్యే తాటి వివరించడంతో స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్, సమావేశంలో ఉన్న జిల్లా కలక్టర్ లోకేష్కుమార్ను త్వరిత గతిన నివేదిక సిద్ధం చేసి పంపాలని ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మండలకేంద్రం చండ్రుగొండకు అన్నపురెడ్డిపల్లి దాదాపు 23 కిలోమీటర్ల దూరంలో ఉండటంతోపాటు పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంగా ఉండటాన్ని, అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రెండు మండలాలు వేలేరుపాడు, కుక్కునూరు ఏపీలో విలీనం కావడాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించారు. ప్రస్తుతం చండ్రుగొండ మండలంలో ఉన్న అన్నపురెడ్డిపల్లితోపాటు పెంట్లం, రాజాపురం, అబ్బుగూడెం, మర్రిగూడెం పంచాయతీలు, ముల్కలపల్లి మండలంలోని చాపరాలపల్లి, సత్తుపల్లి మండలంలోని యాతాలకుంట పంచాయతీలు అన్నపురెడ్డిపల్లికి దగ్గరగా ఉంటాయని ప్రతిపాదనలో పేర్కొన్నారు. సీఎం ఆదేశాల నేపధ్యంలో జిల్లా, మండల అధికారులు భూవిస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, ఆదాయ వనరులు, జనాభా తరదిత అంశాలపై పూర్తి నివేదిక సిద్ధం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. అన్నపురెడ్డిపల్లిలో జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ వేంకటేశ్వరస్వామి, బ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దేవాలయాలున్న విషయం విధితమే. అన్నపురెడ్డిపల్లి కొత్త మండలం ప్రతిపాదనలో ఎమ్మెల్యేతోపాటు శివాలయం వ్యవస్థాపక ధర్మకర్త మారగాని శ్రీనివాసరావు కీలకపాత్ర వహిస్తున్నట్లు సమాచారం. అన్నపురెడ్డిపల్లిలో సంబరాలు.. అన్నపురెడ్డిపల్లి కొత్త మండలం ప్రతిపాదన తెరపైకి రావడంతో ఒక్కసారిగా గ్రామస్తులు సోమవారం రాత్రి సంబరాలు జరుపుకున్నారు. సర్పంచ్ కృష్ణకుమారి, టీఆర్ఎస్ మండల నాయకుడు పర్సా వెంకట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. పరస్పరం స్వీట్లు పంపిణీ చేసుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు.