anti-corruption branch
-
టీడీపీ ఎమ్మెల్యే అవినీతి పర్వం
- మహారాష్ట్ర నీటి పారుదల శాఖ పనుల్లో రూ.2,160 కోట్ల అవినీతి - ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేనిపై ఏసీబీ కేసు నమోదు - రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రాంతాల్లో భారీగా ఆస్తుల గుర్తింపు - ఎమ్మెల్యేపై నాగపూర్‌లో చెక్‌బౌన్స్ కేసులు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు అవినీతి బట్టబయలైంది. రూ.వెయ్యి విలువ చేసే పనికి రూ.లక్ష ఖర్చు పెట్టినట్లు బిల్లులు సృష్టించి అందినంత దోచుకున్నారు. రూ.వందల కోట్లు స్వాహా చేశారు. చివరికి మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) చేతికి పూర్తి ఆధారాలతో సహా చిక్కారు. మహారాష్ట్రలో విదర్భ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగిన అవినీతి బహిర్గతమైంది. ఈ వ్యవహారంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావును ఆరో నిందితుడిగా చేర్చారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు కొన్ని నెలల క్రితం ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎమ్మెల్యేకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రాంతాల్లో ఎమ్మెల్యే కూడబెట్టిన ఆస్తులపై ఏసీబీ దృష్టి సారించినట్లు సమాచారం. కొన్ని నెలలుగా సాగుతున్న ఈ వ్యవహారం ఆదివారం ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో టీడీపీలో తీవ్ర కలకలం రేగింది. టెండర్ల నుంచి బిల్లుల దాకా ... టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ కంపెనీ పేరుతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనులు నిర్వహిస్తున్నారు. 2012లో మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విదర్భ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో రూ.వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు టెండర్లు ఆహ్వానించారు. ఈ క్రమంలో బొల్లినేని వెంకటరామారావు తన శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పేరుతో పనులు దక్కించుకున్నారు. టెండర్లు దాఖలు మొదలుకొని, బిల్లులు పొందే వరకూ ప్రతి దశలోనూ అడ్డగోలుగా వ్యవహరించి రూ.వందల కోట్లు దండుకున్నారు. రుజువు చేస్తే రాజీనామా చేస్తా... తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను రుజువు చేస్తే గంటలోగా రాజీనామా చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు సవాల్ విసిరారు. ఆయన ఆదివారం నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. -
గుడ్‌విల్... రూ.3 కోట్లు
ఎక్సైజ్‌శాఖలో మామూళ్ల వ్యవహారంపై అవినీతి నిరోధకశాఖ కొరడా ఝులిపించిన సమయంలో అన్నీ సంచలనాలే. వ్యాపారులే కాదు.. అధికారులు సైతం కేసుల పాలయ్యారు. అయినా, ఈ భయం కొన్నాళ్లే కనిపించింది. ఈ ఏడాది కొత్తగా ఏర్పా టైన మద్యంషాపులపై అప్పుడే పడిపోతున్నారు. ఆబ్కారీశాఖలోని విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు జిల్లావ్యాప్తంగా ఏర్పాటైన కొత్త దుకాణాలనుంచి గుడ్‌విల్ రూపంలో జిల్లా ఎక్సైజ్ అధికారులు కనీసం రూ.3కోట్లు వసూలు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నెలనెలా ఇచ్చే మామూళ్లకు తోడు, ‘గుడ్‌విల్ ’ కింద ఒక్కో షాపునుంచి సగటున రూ.లక్ష డిమాండ్ చేస్తుండడంతో దుకాణదారులు గుడ్లు తేలేస్తున్నారు. జిల్లాలో మొదటివిడతలో 255 మద్యం దుకాణాలను లాటరీ ద్వారా ఖరారు చేశారు. ఆ తర్వాత మరో 12 షాపులనూ ఓకే చేశారు. మొత్తంగా ఇప్పుడు 267 మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. నెలరోజులపాటు ఓపిక పట్టిన ఎక్సైజ్ అధికారులు ఇక, తమ ప్రతాపం మొదలుపెట్టారు. ప్రతిషాపునకు కనీసం రూ.లక్ష గుడ్‌విల్‌గా ఇవ్వాలని షరతు పెట్టారు. ప్రతిషాపు నుంచి రూ.లక్ష వ సూలు చేస్తే ఆ మొత్తమే రూ.2.67కోట్లు అవుతోంది. వ్యాపారం ఎక్కువగా సాగే దుకాణాలు, ఒక మండలంలో కేవలం రెండు షాపు లు మాత్రమే ఉంటే వారి బిజినెస్ ఎక్కువగా సాగుతుంది కాబట్టి అలాంటి షాప్‌కు లక్ష కంటే ఎక్కువే డిమాండ్ చేస్తున్నారు. అంతా కలిపి గుడ్‌విల్ కింద రూ.3కోట్ల వసూలుకు స్కెచ్ వేశారని సమాచారం. ఇదీ... లెక్క! ప్రతీ షాప్ కొత్తగా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వ్యాపారులు, డిపార్టుమెంటు మధ్య మంచి సంబంధాలు ఉండాలి కాబట్టి, గుడ్‌విల్ ఇవ్వాలన్నది ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారుల కండీషన్.నెల నెలా ప్రతీ దుకాణం నుంచి ఇవ్వాల్సిన మామూలు దీనికి అదనం. షాపు ఉన్న ఏరియా, జరిగే వ్యాపారాన్ని బట్టి రూ.6వేల నుంచి రూ.15వేలు ఒక్కో సర్కిల్ పరిధిలో ఇవ్వాలి. ఇది రమారమి ఒక్కో షాప్‌కు ఇది ఏటా రూ.1.50లక్షలు అవుతోంది.ఇంతే మొత్తంలో పోలీసులకు ముట్టజెప్పాల్సి ఉంటోంది. అంటే మరో రూ.1.50లక్షలు. వెరసి ఏడాదిలో ఒక దుకాణం నుంచి రూ.3లక్షలు మామూళ్లు ముట్టజెప్పాల్సిందే. మద్యం వ్యాపారులు విక్రయాల్లో పాటించాల్సిన నిబంధనలను అక్కడక్కడా అమలు చేయరు. దీంతో ఒక షాప్‌పై కేసు రాస్తే రూ.లక్ష ఫైన్‌తో పాటు, 15రోజులు దుకాణం బంద్ పెట్టాలి. దీంతో ఇదంతా ఎందుకు, ముందే గుడ్‌విల్, మామూళ్లు ఇచ్చేసుకుంటే, ఎక్సైజ్ అధికారులు కూడా చూసీచూడనట్లు వదిలేస్తారన్న ఆశ వ్యాపారులది.ుంచి ఆదాయం ఉంటే స్టేషన్లలో పోస్టింగ్ కోసం కొందరు ఎక్సైజ్ సీఐలు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి ఆర్డర్లు తెచ్చుకుంటున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఒక్క నల్లగొండ ఎస్హెచ్ఓ కింద ఏకంగా 56 మద్యం దుకాణాలు ఉన్నాయి. అంటే, ఇక్కడ పనిచేసే వారికి వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఇక్కడ పనిచేస్తున్న కొందరు సిబ్బంది మధ్య పర్సెంటీజీల పంపకాల్లో తేడాలో వచ్చి ఘర్షణ పడినట్లు చెబుతున్నారు. మద్యం దుకాణాల లెసైన్సులను ఖరారు చేసి, ఫైల్క్లియర్ చేసేది తామే కాబట్టి ఎస్సైలకు గుడ్‌విల్ అమౌంట్ ఎందుకు పంచాలి..? అంతా మాకే కావాలని కొందరు సీఐలు పేచీ పెడుతున్నట్లు సమాచారం. మొత్తంగా తెలుస్తోందేమంటే, జిల్లా ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారులు, మరికొందరు ఉద్యోగులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. -
లిక్కర్ స్కాంలో నేతల పాత్రపై ఏసీబీ ఆరా
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన మద్యం సిండికేట్ కుంభకోణంలో రాజకీయ నాయకుల పాత్రపైనా అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) కూపీ లాగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం ఏసీబీ అధికారులు అంతర్గతంగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు విశ్వసనీయంగా తెలి సింది. ఇప్పటివరకు ఈ కుంభకోణంలో 134 మంది అధికారులు, సిండికేట్లు, పోలీసు, ఎక్సైజ్ అధికారులను నిందితులుగా ఏసీబీ దర్యాప్తులో తేల్చింది. ఇందులో వంద మందిపై ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. మరో 34 మంది ఎక్సైజ్, పోలీసు అధికారులను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ నరసింహన్ నాలుగు రోజుల క్రితం అనుమతి ఇచ్చారు. దీంతో ఈ కేసుతో సంబంధం ఉన్న అందరు అధికారుల ప్రాసిక్యూషన్‌కు అనుమతి లభించిందని ఏసీబీ వర్గాలు తెలిపాయి. అయితే గవర్నర్ నుంచి అధికారిక ఉత్తర్వులు ఏసీబీకి ఇంకా అందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు, సిండికేట్లపై దర్యాప్తు పూర్తి చేసిన ఏసీబీ అధికారులు ఈ కుంభకోణంలో పాత్ర ఉందని అనుమానిస్తున్న రాజకీయ నాయకులపైనా దృష్టి పెట్టారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల పాత్రపై విచారణ జరపాలని గతంలో హైకోర్టు ఆదేశించిందని ఏసీబీకి చెందిన ఒక సీనియర్ అధికారి చెప్పారు. ఇప్పటికే తమ వద్ద కొంత సమాచారం ఉందని దీనిపై పూర్తిగా పరిశీలన జరిపి అదనపు వివరాలను పకడ్బందీగా సేకరిస్తామని తెలిపారు. -
ఏసీబీ వలలో ఏఈ
కడప అర్బన్, న్యూస్‌లైన్ : అవినీతి శాఖ అధికారుల వలలో మరో చేప చిక్కింది. అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ రాజారావు నేతృత్వంలో రూరల్ వాటర్ సప్లయ్ స్కీమ్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీరుగా పనిచేస్తున్న టి.విజయకుమార్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు.. చింతకొమ్మదిన్నె మండలం రసూల్పల్లెకు చెందిన కాంట్రాక్టర్ శ్రీనివాసుల రెడ్డి రూరల్ వాటర్ సప్లయ్ స్కీమ్ కింద రూ. 1.20 లక్షల విలువైన పనులు చేశాడు . బిల్లు మంజూరు కోసం ఎంబుక్‌ను కూడా తయారు చేశారు. రూ. 5 వేలు ఇస్తేనే బిల్లు మంజూరు చేస్తానని ఏఈ విజయకుమార్ మెలిక పెట్టాడు. దీంతో శ్రీనివాసులురెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏఈ విజయకుమార్‌కు శ్రీనివాసులరెడ్డి సోమవారం ఉదయం 11 గంటలకు లంచం ఇస్తుండగా డీఎస్పీ రాజారావు ఆధ్వర్యంలో అవినీతి శాఖ సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వివరాలను డీఎస్పీ మీడియాకు తెలియజేశారు. దాడి చేసిన వారిలో డీఎస్పీతోపాటు సీఐలు పార్థసారథిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, రామకిశోర్రెడ్డి ఉన్నారు. ఏఈ విజయకుమార్‌పై కేసు నమోదు చేసి మంగళవారం కోర్టులో హాజరుపర్చనున్నారు.