టీడీపీ ఎమ్మెల్యే అవినీతి పర్వం
టీడీపీ ఎమ్మెల్యే అవినీతి పర్వం
Published Mon, Jul 17 2017 1:43 AM | Last Updated on Tue, Sep 5 2017 4:10 PM
- మహారాష్ట్ర నీటి పారుదల శాఖ పనుల్లో రూ.2,160 కోట్ల అవినీతి
- ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేనిపై ఏసీబీ కేసు నమోదు
- రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రాంతాల్లో భారీగా ఆస్తుల గుర్తింపు
- ఎమ్మెల్యేపై నాగపూర్‌లో చెక్‌బౌన్స్ కేసులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు అవినీతి బట్టబయలైంది. రూ.వెయ్యి విలువ చేసే పనికి రూ.లక్ష ఖర్చు పెట్టినట్లు బిల్లులు సృష్టించి అందినంత దోచుకున్నారు. రూ.వందల కోట్లు స్వాహా చేశారు. చివరికి మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) చేతికి పూర్తి ఆధారాలతో సహా చిక్కారు. మహారాష్ట్రలో విదర్భ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో జరిగిన అవినీతి బహిర్గతమైంది. ఈ వ్యవహారంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావును ఆరో నిందితుడిగా చేర్చారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు కొన్ని నెలల క్రితం ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎమ్మెల్యేకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రాంతాల్లో ఎమ్మెల్యే కూడబెట్టిన ఆస్తులపై ఏసీబీ దృష్టి సారించినట్లు సమాచారం. కొన్ని నెలలుగా సాగుతున్న ఈ వ్యవహారం ఆదివారం ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో టీడీపీలో తీవ్ర కలకలం రేగింది.
టెండర్ల నుంచి బిల్లుల దాకా ...
టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ పేరుతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనులు నిర్వహిస్తున్నారు. 2012లో మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విదర్భ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో రూ.వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు టెండర్లు ఆహ్వానించారు. ఈ క్రమంలో బొల్లినేని వెంకటరామారావు తన శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్ పేరుతో పనులు దక్కించుకున్నారు. టెండర్లు దాఖలు మొదలుకొని, బిల్లులు పొందే వరకూ ప్రతి దశలోనూ అడ్డగోలుగా వ్యవహరించి రూ.వందల కోట్లు దండుకున్నారు.
రుజువు చేస్తే రాజీనామా చేస్తా...
తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను రుజువు చేస్తే గంటలోగా రాజీనామా చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు సవాల్ విసిరారు. ఆయన ఆదివారం నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు.
Advertisement
Advertisement