గుడ్‌విల్... రూ.3 కోట్లు
ఎక్సైజ్‌శాఖలో మామూళ్ల వ్యవహారంపై అవినీతి నిరోధకశాఖ కొరడా ఝులిపించిన సమయంలో అన్నీ సంచలనాలే. వ్యాపారులే కాదు.. అధికారులు సైతం కేసుల పాలయ్యారు. అయినా, ఈ భయం కొన్నాళ్లే కనిపించింది. ఈ ఏడాది కొత్తగా ఏర్పా టైన మద్యంషాపులపై అప్పుడే పడిపోతున్నారు. ఆబ్కారీశాఖలోని విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు జిల్లావ్యాప్తంగా ఏర్పాటైన కొత్త దుకాణాలనుంచి గుడ్‌విల్ రూపంలో జిల్లా ఎక్సైజ్ అధికారులు కనీసం రూ.3కోట్లు వసూలు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నెలనెలా ఇచ్చే మామూళ్లకు తోడు, ‘గుడ్‌విల్ ’ కింద ఒక్కో షాపునుంచి సగటున రూ.లక్ష డిమాండ్ చేస్తుండడంతో దుకాణదారులు గుడ్లు తేలేస్తున్నారు.
జిల్లాలో మొదటివిడతలో 255 మద్యం దుకాణాలను లాటరీ ద్వారా ఖరారు చేశారు. ఆ తర్వాత మరో 12 షాపులనూ ఓకే చేశారు. మొత్తంగా ఇప్పుడు 267 మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. నెలరోజులపాటు ఓపిక పట్టిన ఎక్సైజ్ అధికారులు ఇక, తమ ప్రతాపం మొదలుపెట్టారు. ప్రతిషాపునకు కనీసం రూ.లక్ష గుడ్‌విల్‌గా ఇవ్వాలని షరతు పెట్టారు. ప్రతిషాపు నుంచి రూ.లక్ష వ సూలు చేస్తే ఆ మొత్తమే రూ.2.67కోట్లు అవుతోంది. వ్యాపారం ఎక్కువగా సాగే దుకాణాలు, ఒక మండలంలో కేవలం రెండు షాపు లు మాత్రమే ఉంటే వారి బిజినెస్ ఎక్కువగా సాగుతుంది కాబట్టి అలాంటి షాప్‌కు లక్ష కంటే ఎక్కువే డిమాండ్ చేస్తున్నారు. అంతా కలిపి గుడ్‌విల్ కింద రూ.3కోట్ల వసూలుకు స్కెచ్ వేశారని సమాచారం.
ఇదీ... లెక్క!
ప్రతీ షాప్ కొత్తగా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వ్యాపారులు, డిపార్టుమెంటు మధ్య మంచి సంబంధాలు ఉండాలి కాబట్టి, గుడ్‌విల్ ఇవ్వాలన్నది ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారుల కండీషన్.నెల నెలా ప్రతీ దుకాణం నుంచి ఇవ్వాల్సిన మామూలు దీనికి అదనం. షాపు ఉన్న ఏరియా, జరిగే వ్యాపారాన్ని బట్టి రూ.6వేల నుంచి రూ.15వేలు ఒక్కో సర్కిల్ పరిధిలో ఇవ్వాలి. ఇది రమారమి ఒక్కో షాప్‌కు ఇది ఏటా రూ.1.50లక్షలు అవుతోంది.ఇంతే మొత్తంలో పోలీసులకు ముట్టజెప్పాల్సి ఉంటోంది. అంటే మరో రూ.1.50లక్షలు. వెరసి ఏడాదిలో ఒక దుకాణం నుంచి రూ.3లక్షలు మామూళ్లు ముట్టజెప్పాల్సిందే.
మద్యం వ్యాపారులు విక్రయాల్లో పాటించాల్సిన నిబంధనలను అక్కడక్కడా అమలు చేయరు. దీంతో ఒక షాప్‌పై కేసు రాస్తే రూ.లక్ష ఫైన్‌తో పాటు, 15రోజులు దుకాణం బంద్ పెట్టాలి. దీంతో ఇదంతా ఎందుకు, ముందే గుడ్‌విల్, మామూళ్లు ఇచ్చేసుకుంటే, ఎక్సైజ్ అధికారులు కూడా చూసీచూడనట్లు వదిలేస్తారన్న ఆశ వ్యాపారులది.ుంచి ఆదాయం ఉంటే స్టేషన్లలో పోస్టింగ్ కోసం కొందరు ఎక్సైజ్ సీఐలు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి ఆర్డర్లు తెచ్చుకుంటున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.
ఒక్క నల్లగొండ ఎస్‌హెచ్‌ఓ కింద ఏకంగా 56 మద్యం దుకాణాలు ఉన్నాయి. అంటే, ఇక్కడ పనిచేసే వారికి వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఇక్కడ పనిచేస్తున్న కొందరు సిబ్బంది మధ్య పర్సెంటీజీల పంపకాల్లో తేడాలో వచ్చి ఘర్షణ పడినట్లు చెబుతున్నారు. మద్యం దుకాణాల లెసైన్సులను ఖరారు చేసి, ఫైల్‌క్లియర్ చేసేది తామే కాబట్టి ఎస్సైలకు గుడ్‌విల్ అమౌంట్ ఎందుకు పంచాలి..? అంతా మాకే కావాలని కొందరు సీఐలు పేచీ పెడుతున్నట్లు సమాచారం.
మొత్తంగా తెలుస్తోందేమంటే, జిల్లా ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారులు, మరికొందరు ఉద్యోగులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు.