anti-farmer government
-
రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం
కణేకల్లు: కరువు కోరల్లో చిక్కుకున్న అనంత రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అనంతపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వకర్త అనంత వెంకట్రామిరెడ్డి, పార్లమెంట్ సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య విమర్శించారు. ఆ పార్టీ కణేకల్లు మండల కన్వీనర్ ఆలూరు చిక్కణ్ణ, మాజీ ఎంపీపీ ఆలేరి రాజగోపాల్‌రెడ్డి, సీనియర్ నాయకులు కళేకుర్తి జయరామిరెడ్డి, మారెంపల్లి మారెన్నలతో కలిసి సోమవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు సమస్యల పరిష్కారానికి జిల్లాలో ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎలాంటి కృషి చేయడం లేదని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారన్నారు. ఉపాధి నిధులను నీరు–చెట్టుకు మళ్లించి కూలీలకు పనులు లేకుండా చేశారన్నారు. యంత్రాలతో పనులు చేయించడం ద్వారా భారీగా ప్రజాధనం పక్కదారి పట్టించారన్నారు. నాలుగేళ్లుగా హెచ్చెల్సీ ఆయకట్టుకు సకాలంలో సాగునీటిని విడుదల చేయించలేకపోయారన్నారు. టీబీ డ్యామ్‌లో ఆశించిన మేర నీళ్లున్నా... ఆయకట్టుకు సాగునీటిని అందివ్వలేని అసమర్థ ప్రభుత్వం ఏపీలో తప్ప మరెక్కడా లేదని విమర్శించారు. అదను దాటాక నీరివ్వడంతో వరి పంట దిగుబడులు తగ్గి రైతులు నష్టపోయారని తెలిపారు. వచ్చిన అరకొర దిగుబడులకు మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేక మరింత నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చిందన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలను సీఎం చంద్రబాబు దగా చేస్తున్నారన్నారు. డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు.. మాఫీ మాట మరచి పెట్టుబడి నిధి, పసుపు కుంకుమ పేరిట దశవారీగా రూ.10వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. ఉపాధిహామీ పథకంలో భాగంగా ఇటీవల ఎక్కువగా మెటీరియల్ కంపోనెంట్ పనులు చేస్తుండటంతో కూలీలకు పనులు లేకుండా పోయాయన్నారు. దీంతో కూలీలు వలస బాట పట్టాల్సి వచ్చిందన్నారు. తనను చూసి కరువు పారిపోయిందని చెబుతున్న చంద్రబాబు అది నిజం కాదన్న వాస్తవం గ్రహించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు విక్రం సింహారెడ్డి, పి.సాదత్, టీఎస్ఎస్ రవూఫ్, నబీసా, లక్ష్మీకాంతరెడ్డి, నరేంద్రరెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, జిలాన్, టైగర్ బాషా తదితరులు పాల్గొన్నారు. -
రైతు వ్యతిరేక సర్కార్
⇒ ఒకేసారి రుణమాఫీ చేయాలి ⇒ సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం ⇒ నేడు వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయ ఎదుట ధర్నా ⇒ బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి తాండూరు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, రైతాంగాన్ని విస్మరించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బోక్క నర్సింహారెడ్డి విమర్శించారు. తాండూరు మున్సిపాలిటీలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బ్యాంకుల నుంచి పంటరుణాలు అందక.. సాగు చేయడానికి డబ్బులు లేక అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నా ఈ సర్కార్‌కు పట్టింపులేదని ఆయన ధ్వజమెత్తారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. పంట రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని టీఆర్ఎస్ తుంగల్లో తొక్కిందన్నారు. ఒకేసారి కాకుండా విడతల వారీగా రుణమాఫీ చేయడంవల్ల రైతులకు ప్రయోజనం చేకూరడం లేదన్నారు. విడతలుగా మాఫీ చేయడంవల్ల ఇచ్చిన రుణం వడ్డీకే సరిపోతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మిగితా పంట రుణమాఫీని ఒకేసారి విడుదల చేస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. రెండేళ్లుగా వర్షాలు లేవని,ఽ ఈసారి ఆశించినస్థాయిలో వర్షాలు కురుస్తున్నందున పంటల సాగుకు పెట్టుబడుల కోసం రైతులు వెళితే బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమానికి పాటుపడతామని కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. కేంద్రం కరువు సాయం కింద రాష్ట్రానికి రూ.791 కోట్లు ఇస్తే ఇంతవరకు ఖర్చు చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందజేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేయడం లేదని ఆరోపించారు. ఈ పథకాన్ని ప్రభుత్వం నీరు గారుస్తోందని విమర్శించారు. రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు అంజన్‌కుమార్, ప్యాట బాల్‌రెడ్డి, యూ.రమేష్‌కుమార్, గాజుల శాంత్‌కుమార్, కృష్ణ, పూజారి పాండు, బొప్పి అంజలి, బాలేశ్వర్, సురేష్, భద్రేశ్వర్, పుల్మామిడి బాల్‌రాజ్, వివేక్, రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పట్టణంలోని వివిధ వార్డుల్లో నెలకొన్న తాగునీరు, వీధి దీపాలు, మురుగుకాల్వల సమస్యలపై జిల్లా అధ్యక్షుడు నాయకులతో కలిసి మున్సిపల్ కమిషనర్ సంతోష్‌కుమార్‌కు వినతిపత్నాన్ని, సీడీని అందజేశారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం
తిమ్మాపూర్: పెద్దపల్లి నియోజకవర్గంలోని డీ83, డీ86 కాలువలకు నీళ్లు వదిలి చెరువులు, కుంటలు నింపాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు, టీడీపీ నాయకులతో కలిసి ఎల్ఎండీలోని సీఈ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.విజయరమణారావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తాగు, సాగునీటికి ఇబ్బంది ఉండదని చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కారు ఇప్పుడు రైతులను పూర్తిగా విస్మరించిందన్నారు. ఎస్సారెస్పీలో 21 టీఎంసీల నీరుంటే ఆయకట్టుకు నాలుగు తడుల నీరు ఇచ్చామని, ఇప్పుడు 16 టీఎంసీలుంటే తాగునీరు ఇవ్వ డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు బాబ్లీని టీడీపీ అడ్డుకుంటే కేసీఆర్ విమర్శించి, తెలంగాణ వస్తే సస్యశ్యామలం చేస్తానని చెప్పాడని, మంత్రి హరీష్‌రావు సిద్దిపేటకు నీరు తీసుకెళ్తూ జిల్లా ప్రజలకు నీరివ్వడం లేదని విమర్శించారు. కేసీఆర్, హరీష్‌రావు, ఈటెల రైతులకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్, మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దద్దమ్మలని అన్నారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లికి నీరిచ్చినపుడు పెద్దపల్లికి ఎందుకివ్వరని ప్రశ్నించారు. చెరువుల్లో నీరు నింపితే భూగర్భజలాలు పెరిగి తాగునీటికి ఇబ్బంది ఉండదన్నారు. నీరు విడుదల చేస్తామని స్పష్టమైన హామీచ్చే వరకు లేచేది లేదని ఆఫీసు ఎదుట భైఠాయించారు. పోలీసులు చెప్పడంతో జీవీసీ 4 ఎస్ఈ అనిల్‌కుమార్ అక్కడకు చేరుకోగా ఆయనతో విజ యరమణారావు మాట్లాడారు. సీఈతో మాట్లాడిన ఎస్ఈ రెండు రోజుల తర్వాత నీటిని విడుదల చేస్తామని హామీవ్వడంతో శాంతించారు. నాలుగు రోజుల్లో నీరు ఇవ్వకుంటే రైతుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని, మెడలు వంచి తీసుకెళ్తామని ఆయన అన్నారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుతో మాట్లాడి గైక్వాడ్ నుంచి నీటిని తీసుకురవాలని కేసీఆర్‌కు ఆయ న సూచించారు. ధర్నాలో టీడీపీ నాయకులు గంట రాములు, పాల రామారావు, కొట్యాల శంకర్, వంగల తిరుపతిరెడ్డి, అక్కపాక తిరుపతి, రావుల రమేష్, రామంచ గోపాల్‌రెడ్డి, కంది అశోక్‌రెడ్డి, గోపు మల్లారెడ్డి, ఎల్లయ్య, రాములు, సురేందర్‌రెడ్డి, రాజిరెడ్డి, రైతులు, మహిళలు పాల్గొన్నారు.