
ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం
తిమ్మాపూర్: పెద్దపల్లి నియోజకవర్గంలోని డీ83, డీ86 కాలువలకు నీళ్లు వదిలి చెరువులు, కుంటలు నింపాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు, టీడీపీ నాయకులతో కలిసి ఎల్‌ఎండీలోని సీఈ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.విజయరమణారావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తాగు, సాగునీటికి ఇబ్బంది ఉండదని చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ సర్కారు ఇప్పుడు రైతులను పూర్తిగా విస్మరించిందన్నారు. ఎస్సారెస్పీలో 21 టీఎంసీల నీరుంటే ఆయకట్టుకు నాలుగు తడుల నీరు ఇచ్చామని, ఇప్పుడు 16 టీఎంసీలుంటే తాగునీరు ఇవ్వ డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆనాడు బాబ్లీని టీడీపీ అడ్డుకుంటే కేసీఆర్ విమర్శించి, తెలంగాణ వస్తే సస్యశ్యామలం చేస్తానని చెప్పాడని, మంత్రి హరీష్‌రావు సిద్దిపేటకు నీరు తీసుకెళ్తూ జిల్లా ప్రజలకు నీరివ్వడం లేదని విమర్శించారు. కేసీఆర్, హరీష్‌రావు, ఈటెల రైతులకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్, మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దద్దమ్మలని అన్నారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లికి నీరిచ్చినపుడు పెద్దపల్లికి ఎందుకివ్వరని ప్రశ్నించారు. చెరువుల్లో నీరు నింపితే భూగర్భజలాలు పెరిగి తాగునీటికి ఇబ్బంది ఉండదన్నారు. నీరు విడుదల చేస్తామని స్పష్టమైన హామీచ్చే వరకు లేచేది లేదని ఆఫీసు ఎదుట భైఠాయించారు. పోలీసులు చెప్పడంతో జీవీసీ 4 ఎస్‌ఈ అనిల్‌కుమార్ అక్కడకు చేరుకోగా ఆయనతో విజ యరమణారావు మాట్లాడారు.
సీఈతో మాట్లాడిన ఎస్‌ఈ రెండు రోజుల తర్వాత నీటిని విడుదల చేస్తామని హామీవ్వడంతో శాంతించారు. నాలుగు రోజుల్లో నీరు ఇవ్వకుంటే రైతుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని, మెడలు వంచి తీసుకెళ్తామని ఆయన అన్నారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుతో మాట్లాడి గైక్వాడ్ నుంచి నీటిని తీసుకురవాలని కేసీఆర్‌కు ఆయ న సూచించారు. ధర్నాలో టీడీపీ నాయకులు గంట రాములు, పాల రామారావు, కొట్యాల శంకర్, వంగల తిరుపతిరెడ్డి, అక్కపాక తిరుపతి, రావుల రమేష్, రామంచ గోపాల్‌రెడ్డి, కంది అశోక్‌రెడ్డి, గోపు మల్లారెడ్డి, ఎల్లయ్య, రాములు, సురేందర్‌రెడ్డి, రాజిరెడ్డి, రైతులు, మహిళలు పాల్గొన్నారు.