
కణేకల్లు: కరువు కోరల్లో చిక్కుకున్న అనంత రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అనంతపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వకర్త అనంత వెంకట్రామిరెడ్డి, పార్లమెంట్ సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య విమర్శించారు. ఆ పార్టీ కణేకల్లు మండల కన్వీనర్ ఆలూరు చిక్కణ్ణ, మాజీ ఎంపీపీ ఆలేరి రాజగోపాల్‌రెడ్డి, సీనియర్ నాయకులు కళేకుర్తి జయరామిరెడ్డి, మారెంపల్లి మారెన్నలతో కలిసి సోమవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు సమస్యల పరిష్కారానికి జిల్లాలో ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎలాంటి కృషి చేయడం లేదని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారన్నారు. ఉపాధి నిధులను నీరు–చెట్టుకు మళ్లించి కూలీలకు పనులు లేకుండా చేశారన్నారు. యంత్రాలతో పనులు చేయించడం ద్వారా భారీగా ప్రజాధనం పక్కదారి పట్టించారన్నారు.
నాలుగేళ్లుగా హెచ్చెల్సీ ఆయకట్టుకు సకాలంలో సాగునీటిని విడుదల చేయించలేకపోయారన్నారు. టీబీ డ్యామ్‌లో ఆశించిన మేర నీళ్లున్నా... ఆయకట్టుకు సాగునీటిని అందివ్వలేని అసమర్థ ప్రభుత్వం ఏపీలో తప్ప మరెక్కడా లేదని విమర్శించారు. అదను దాటాక నీరివ్వడంతో వరి పంట దిగుబడులు తగ్గి రైతులు నష్టపోయారని తెలిపారు. వచ్చిన అరకొర దిగుబడులకు మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేక మరింత నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చిందన్నారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలను సీఎం చంద్రబాబు దగా చేస్తున్నారన్నారు. డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు..
మాఫీ మాట మరచి పెట్టుబడి నిధి, పసుపు కుంకుమ పేరిట దశవారీగా రూ.10వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. ఉపాధిహామీ పథకంలో భాగంగా ఇటీవల ఎక్కువగా మెటీరియల్ కంపోనెంట్ పనులు చేస్తుండటంతో కూలీలకు పనులు లేకుండా పోయాయన్నారు. దీంతో కూలీలు వలస బాట పట్టాల్సి వచ్చిందన్నారు. తనను చూసి కరువు పారిపోయిందని చెబుతున్న చంద్రబాబు అది నిజం కాదన్న వాస్తవం గ్రహించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు విక్రం సింహారెడ్డి, పి.సాదత్, టీఎస్‌ఎస్ రవూఫ్, నబీసా, లక్ష్మీకాంతరెడ్డి, నరేంద్రరెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, జిలాన్, టైగర్ బాషా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment