
దోచుకోవడమే టీడీపీ ధ్యేయం
∙ కళ్యాణదుర్గం ప్లీనరీలో ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ నేతలు
కళ్యాణదుర్గం : టీడీపీ పాలన దోచుకోవడమే ధ్యేయంగా సాగుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కళ్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం నియోజకవర్గ ప్లీనరీ సమావేశాన్ని సమన్వయకర్త ఉషాశ్రీచరణ్ అధ్యక్షతన నిర్వహిం చారు. ముఖ్య అతిథిగా హాజరైన అనంత మాట్లాడుతూ ప్రజలు టీడీపీ నాయకులను నమ్మి ఓట్లేస్తే వారు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతి పని లోనూ దోచుకోవడానికి చూస్తున్నారని మండిపడ్డారు. కళ్యాణదుర్గం అభివృద్ధి చెందిందంటే దివంగత లక్ష్మీదేవమ్మ, అనంత వెంకటరెడ్డిల హయాంలోనేనని, ప్రస్తుతం వైఎస్సార్‌సీపీతోనే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.
ఆ నమ్మకాన్ని ప్రజలకు కలిగించేలా ధైర్యంగా ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచిం చారు. పరిటాల రవి మంత్రిగా ఉంటూ శాసిస్తున్న సమయంలోనూ ఎదురొడ్డి పోరాడిన నాయకులు, కార్యకర్తలు ఇక్కడ ఎందరో ఉన్నారన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాల్సిన టీడీపీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆయన కుమారుల చేతుల్లో బందీ అయ్యారని, వారు ఎమ్మెల్యే పీఠాన్ని అవినీతి పీఠంగా మార్చుకున్నారని విమర్శించారు. అందరం ఐకమత్యంతో పోరాడి ఇక్కడ కూడా వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేద్దామన్నారు. ప్లీనరీ పరిశీలకుడిగా హాజరైన ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పాలు తాగే మనువడికి అవినీతి పాఠాలు నేర్పిన ఘనుడు సీఎం చంద్రబాబు అని విమర్శించారు. అక్షరా భ్యాసం సమయంలో అ – అంటే అమరా వతి, ఆ – అంటే ఆదాయమని, అమరావతిలో ఆదాయం ఉందంటూ మనువడికి విద్య నేర్పిన చరిత్ర సీఎంకే దక్కిందన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి సమాధానం చెప్పాలంటే చంద్రబాబు వణికిపోతున్నారన్నారు.
రాజన్న రా జ్యం కోసం ప్రజలు జగన్‌ను ముఖ్యమంత్రిని చే యాలని కోరుకుంటున్నారన్నారు. పరిస్థితి వైఎ స్సార్‌సీపీకి అనుకూలంగా ఉందని, అందరూ ఐకమత్యంతో టీడీపీ అరాచకాలు, మోసాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఒకే ఒక్క కేసులో ఇరుక్కుపోయిన చంద్రబాబు రాత్రికి రా త్రే విజయవాడకు మకాం మార్చారన్నారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడకుండా ప్రత్యేక హోదా కోసం, ప్రజా సమస్యలపైనా పోరాడుతూనే ఉన్నారన్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు మూడేళ్ల పాలనలో అభివృద్ధి గుండుసున్నా అన్నారు. జన్మభూమి కమిటీల నుంచి చంద్రబాబు వరకు అవినీతిలో కూరుకుపోయారన్నారు. పట్టిసీమలో 600 కోట్ల అవినీతి జరిగిందని కాగ్ అక్షింతలు వేసినా వారికి సిగ్గు రాలేదన్నారు. జిల్లాలో టీడీపీని ఆదరించినా ప్రజాప్రతినిధులు చేసిందేమీ లేదన్నారు. హంద్రీ నీవా నీరు రావాలంటే జగన్ సీఎం కావాలన్నారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మేలు జరిగేందు కోసం వైఎస్సార్‌సీపీని గెలిపించి రాజన్న రాజ్యాన్ని తీసుకొద్దామన్నారు. ప్రజా సంక్షేమం కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఎంతైనా ఉందన్నారు.
వైఎస్సార్‌సీపీ మడకశిర సమన్వయకర్త తిప్పేస్వామి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సీఎం కావడం తథ్యమన్నారు. దళితులంతా టీడీపీ మోసాలను గ్రహించి వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇవ్వాలన్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ ‘ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆశీస్సులతో కళ్యాణదుర్గంకు వచ్చా.. అందులో భాగంగానే గడపగడపకూ తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకున్నా.. ఒక్క అవకాశం ఇవ్వండి’ అని విజ్ఞప్తి చేశారు. ఉచిత కంటి ఆపరేషన్లు చేయిస్తామని, వికలాంగులకు కృత్రిమ అవయవాలు అందజేస్తామని చెప్పారు. కళ్యాణదుర్గం చెరువులకు నీరు నింపేదాక పోరాటాలు చేస్తామన్నారను. మహిళలకు ఈ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందంటూ.. ఎమ్మెల్యే రోజా, తహసీల్దార్ వనజాక్షి ఉదంతాలను ప్రస్తావించారు.