⇒ ఒకేసారి రుణమాఫీ చేయాలి
⇒ సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం
⇒ నేడు వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయ ఎదుట ధర్నా
⇒ బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి
తాండూరు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, రైతాంగాన్ని విస్మరించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బోక్క నర్సింహారెడ్డి విమర్శించారు. తాండూరు మున్సిపాలిటీలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బ్యాంకుల నుంచి పంటరుణాలు అందక.. సాగు చేయడానికి డబ్బులు లేక అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నా ఈ సర్కార్‌కు పట్టింపులేదని ఆయన ధ్వజమెత్తారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. పంట రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని టీఆర్‌ఎస్ తుంగల్లో తొక్కిందన్నారు. ఒకేసారి కాకుండా విడతల వారీగా రుణమాఫీ చేయడంవల్ల రైతులకు ప్రయోజనం చేకూరడం లేదన్నారు. విడతలుగా మాఫీ చేయడంవల్ల ఇచ్చిన రుణం వడ్డీకే సరిపోతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మిగితా పంట రుణమాఫీని ఒకేసారి విడుదల చేస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. రెండేళ్లుగా వర్షాలు లేవని,ఽ ఈసారి ఆశించినస్థాయిలో వర్షాలు కురుస్తున్నందున పంటల సాగుకు పెట్టుబడుల కోసం రైతులు వెళితే బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమానికి పాటుపడతామని కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ఇప్పుడు పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. కేంద్రం కరువు సాయం కింద రాష్ట్రానికి రూ.791 కోట్లు ఇస్తే ఇంతవరకు ఖర్చు చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందజేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేయడం లేదని ఆరోపించారు. ఈ పథకాన్ని ప్రభుత్వం నీరు గారుస్తోందని విమర్శించారు. రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు అంజన్‌కుమార్, ప్యాట బాల్‌రెడ్డి, యూ.రమేష్‌కుమార్, గాజుల శాంత్‌కుమార్, కృష్ణ, పూజారి పాండు, బొప్పి అంజలి, బాలేశ్వర్, సురేష్, భద్రేశ్వర్, పుల్‌మామిడి బాల్‌రాజ్, వివేక్, రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పట్టణంలోని వివిధ వార్డుల్లో నెలకొన్న తాగునీరు, వీధి దీపాలు, మురుగుకాల్వల సమస్యలపై జిల్లా అధ్యక్షుడు నాయకులతో కలిసి మున్సిపల్ కమిషనర్ సంతోష్‌కుమార్‌కు వినతిపత్నాన్ని, సీడీని అందజేశారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
రైతు వ్యతిరేక సర్కార్
Published Tue, Jul 19 2016 6:06 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement