Anti-party activities
-
అసమ్మతిపై టీఆర్ఎస్ కన్నెర్ర
సాక్షి, హైదరాబాద్: అసమ్మతి రాగం వినిపిస్తున్న పార్టీ నేతలపై టీఆర్ఎస్ కన్నెర్రజేస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా, పోటీగా కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఉమ్మడి నల్లగొండలో గురువారం బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో ఆ జిల్లాలోని మునుగోడు అసమ్మతి నేత వేనేపల్లి వెంకటేశ్వరరావుపై వేటు వేసింది. వెంకటేశ్వరరావును టీఆర్ఎస్ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటన జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడిన కారణంగా వేనేపల్లి వెంకటేశ్వరరావును బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నామని ప్రకటనలో తెలిపారు. వెంకటేశ్వరరావుపై బహిష్కరణ నిర్ణయం టీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారింది. ముందస్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సాగుతున్న టీఆర్ఎస్కు కొన్ని సెగ్మెంట్లలో అసమ్మతి నేతల తీరు ఇబ్బందిగా మారింది. టీఆర్ఎస్ అధిష్టానం తరఫున మంత్రి కేటీఆర్ అసమ్మతి నేతలతో భేటీ అవుతున్నారు. అయితే పార్టీ అభ్యర్థులకు పోటీగా ప్రచారం చేస్తున్న కొందరు నేతలు కేటీఆర్‌తో చర్చలకు సైతం రావడంలేదు. దీంతో వీరిపై కఠినంగా వ్యవహరించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. నల్లగొండలో సభ నేపథ్యంలోనే మునుగోడు అసమ్మతి నేత వెంకటేశ్వరరావును బహిష్కరించారు. మరికొందరు నేతల విషయంలోనూ టీఆర్ఎస్ ఇదే రకమైన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. చివరి అవకాశంగా ఓసారి చర్చలకు ఆహ్వానించాలని, అయినా దారికి రాకుంటే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అభ్యర్థులకు అడ్డంకులు.. కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు సొంత పార్టీ వారితోనే ఇబ్బందులు వస్తున్నాయి. కొందరు అసమ్మతి నేతలు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలనను పొగుడుతూ.. సీఎం కేసీఆర్ చిత్రపటాలు, గులాబీ రంగు జెండాలు వినియోగిస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. నామినేషన్ల సమయం వరకు తమకే టికెట్లు వస్తాయని చెబుతున్నారు. దీంతో ప్రత్యర్థి పార్టీల నేతలతో కంటే వీరితోనే టీఆర్ఎస్ అభ్యర్థులకు ఇబ్బందులు పెరుగుతున్నాయి. కేడర్‌లోనూ అయోమయం నెలకొంటోంది. పార్టీ అధిష్టానం నుంచి స్పష్టత రాక ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొనడం లేదు. ఇలా సొంత పార్టీ నేతలతో ఇబ్బంది పడే అభ్యర్థులు కేటీఆర్‌కు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. కేటీఆర్ పిలిచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దాదాపు 10 నియోజకవర్గాల నేతలు చర్చలకు సైతం రావడంలేదు. కొన్ని నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలు కూడా పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వీరి విషయంలోనూ పార్టీ కఠిన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. టీఆర్ఎస్ అభ్యర్థులకు పోటీగా తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్న కోరుకంటి చందర్ (రామగుండం), గండ్ర సత్యనారాయణరావు (భూపాలపల్లి), రాజారపు ప్రతాప్ (స్టేషన్‌ఘన్‌పూర్), చకిలం అనిల్‌కుమార్ (నల్లగొండ) విషయంలోనూ టీఆర్ఎస్ రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. వేములవాడ, రామగుండం, జగిత్యాల, స్టేషన్‌ఘన్‌పూర్, భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్, సత్తుపల్లి, మక్తల్, మునుగోడు నియోజకవర్గాల్లోని పలువురు ద్వితీయ శ్రేణి నేతలపైనా వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసింది. రెండు సభలు వాయిదా.. ముందస్తు ఎన్నికల వ్యూహంలో ముందున్న టీఆర్ఎస్.. ప్రచారంలో మాత్రం ఆ ఊపు కొనసాగించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ రద్దయిన మరుసటి రోజు సీఎం కేసీఆర్ హుస్నాబాద్‌లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 50 రోజుల్లో వంద నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు ప్రకటించా రు. ఎన్నికల షెడ్యూల్ వెలువడేందుకు సమయం ఉండటంతో ప్రచార వ్యూహాన్ని మార్చారు. ఉమ్మడి జిల్లాల వారీగా బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. అక్టోబర్ 3న నిజామాబాద్, 4న నల్లగొండ, 5న మహబూబ్‌నగర్, 7న వరంగల్, 8న ఖమ్మంల్లో సభలు నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటన జారీ చేసింది. అయితే ఆయా జిల్లాల్లో నెలకొన్న అసంతృప్తుల దృష్ట్యా వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల బహిరంగ సభలను వాయిదా వేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో స్టేషన్‌ఘన్‌పూర్, భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో అసమ్మతి ఎక్కువగా ఉంది. బహిరంగ సభ నిర్వహించే వరంగల్ నగరంలోని వరంగల్ తూర్పు నియోజకవర్గానికి అభ్యర్థిని ఖరారు చేయలేదు. దీంతో ఇక్కడ సభ వాయిదా వేశారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని సత్తుపల్లి, వైరా, ఖమ్మం నియోజకవర్గాల్లోనూ అసమ్మతి పూర్తిగా తొలిగిపోలేదు. దీంతో ఖమ్మంలో తలపెట్టిన బహిరంగ సభనూ వాయిదా వేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ నేతలు మంగళవారం మంత్రి కేటీఆర్‌ను కలసి బహిరంగ సభ విషయాన్ని ప్రస్తావించగా.. వరంగల్ బహిరంగ సభ ఉందని ఎవరు చెప్పారని కేటీఆర్ వారిని ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ రెండు బహిరంగ సభల నిర్వహణ తేదీలను త్వరలోనే ఖరారు చేయనున్నారు. ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో నిర్వహించే బహిరంగ సభల విషయంలోనూ నిర్ణయం తీసుకోనున్నారు. హుస్నాబాద్‌లో సభ నిర్వహించినందున ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సభ ఉండకపోవచ్చని తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రగతి నివేదన సభ నిర్వహించిన కారణంగా రంగారెడ్డి, హైదరాబాద్‌ల్లోనూ బహిరంగ సభలు నిర్వహించే అవకాశం లేదు. ఉమ్మడి జిల్లాల బహిరంగ సభల అనంతరం సీఎం కేసీఆర్ నేరుగా నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు పక్కా ప్రణాళికను రూపొందిస్తున్నారు. దసరా తర్వాత నియోజకవర్గాల వారీగా ప్రచార కార్యక్రమం మొదలుకానుంది. -
అసమ్మతి నేతకు టీఆర్ఎస్ పార్టీ షాక్!
సాక్షి, నల్గొండ : అసమ్మతి నేతకు టీఆర్ఎస్ పార్టీ షాకిచ్చింది. అసమ్మతి నేత వెంకటేశ్వర్ రావును పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. మునుగోడు సీటును ఆశించిన వెంకటేశ్వర్ రావు పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడ్డారని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయనను పలుమార్లు పిలిచి బుజ్జగించినా మాట వినకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇక నల్గొండ, సాగర్, మిర్యాలగూడ, తుంతుర్తిలోనూ అసమ్మతి నేతలు పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టారని చెప్పారు. దీంతో వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. -
కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ: పల్లా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతుల అభివృద్ధి కోసం తీసు కుంటున్న చర్యలతో కాంగ్రెస్, బీజేపీ భయపడుతున్నాయని ఆరోపించారు. రాజకీయంగా అడ్రస్ లేకుండా పోతామనే భయంతోనే కాంగ్రెస్, బీజేపీలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయన్నారు. -
మూడు నెలల్లో తేల్చాల్సిందే
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: చట్టసభల సభ్యుల అనర్హతపై నిర్ణయం ఆలస్యమైతే ఫిరాయింపుల నిరోధక చట్టం లక్ష్యాన్ని దెబ్బతీసినట్లేనని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. సభ్యుల అనర్హతపై అందిన ఫిర్యాదులను ఆయా సభల ప్రిసైడింగ్ అధికారులు పరిశీలించి మూడు నెలలలోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. జనతాదళ్(యు)కు చెందిన శరద్ యాదవ్, అలీ అన్వర్లు ఇద్దరూ తమ పార్టీలోని మెజారిటీ సభ్యుల మద్దతు కోల్పోవటంతోపాటు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నందునే వారిని రాజ్యసభ సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించామని రాజ్యసభ చైర్మన్ కూడా అయిన వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అనర్హత ఉత్తర్వులను మంగళవారం ఆయన విడుదల చేశారు. వీరిపై ఫిర్యాదు అందిన నెలలోపే విచారించి నిర్ణయం తీసుకున్నామన్నారు. పిటిషన్లను ప్రివిలేజ్ కమిటీకి పంపితే అక్కడ విచారణ జరిపి నివేదిక ఇచ్చేందుకు సమయం పడుతుందని..ఆపైన అంతిమ నిర్ణయం ప్రకటించేందుకు మరింత జాప్యం అవుతుందని తెలిపారు. ఇలాంటి కాలయాపన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాబట్టే పిటిషన్లను ప్రివిలేజ్ కమిటీకి పంపించలేదని తెలిపారు. ప్రజాస్వామ్య మనుగడకు కీలకమైన చట్టసభల సభ్యులపై అందిన ఫిర్యాదు వెంటనే పరిశీలించినట్లయితే.. వారు సభలో కూర్చునేందుకు అర్హులా కాదా అనేది తేలుతుందని.. అలా కాకుండా జాప్యం చేస్తే వారి సభ్యత్వాన్ని కాపాడినట్లవుతుందని తెలిపారు. ఇటువంటి సభ్యుల అండతో ప్రభుత్వాలు కూడా కొనసాగే ప్రమాదం కూడా ఉందని చెప్పారు. ఫిర్యాదు అందిన వెంటనే నిర్ణయం తీసుకోలేకపోతే ఫిరాయింపుతో కలిగే పరిణామాలు తెలియకుండానే ఆ సభ్యుడు కొనసాగే అవకాశముందన్నారు. ఇటువంటి పరిణామాలు ఫిరాయింపుల చట్టం అసలు ఉద్దేశాన్ని మరుగున పరుస్తాయని తెలిపారు. ఎవరైనా సభ్యుడు తమ పార్టీ నిర్ణయంపై బహిరంగంగా విమర్శించినా, వేరే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా అనర్హులేనని రాజ్యాంగంలోని పదో షెడ్యూల్చెబుతోందన్నారు. లెజిస్లేచర్ పార్టీ నాయకత్వంపై వివాదం తలెత్తిన సందర్భాల్లో మెజారిటీ సభ్యులు తీసుకునే నిర్ణయం లేదా అభిప్రాయానికే అంగీకారం ఉంటుందని చెప్పారు. అలాగే, జేడీ(యు)కు చెందిన శరద్‌యాదవ్‌కు మెజారిటీ సభ్యుల మద్దతు లేదని, అందుకే ఆ పార్టీకి నితీష్‌కుమార్‌నే అధ్యక్షుడిగా ఎన్నికల సంఘం కూడా గుర్తించిందని వివరించారు. బిహార్‌లోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు నితీష్‌కుమార్ ప్రకటించినందున జేడీ(యు) సభ్యత్వాన్ని ఆయన స్వచ్ఛందంగా వదులుకున్నట్లేనన్న నితీష్‌కుమార్ వాదనపై ఆయన స్పందిస్తూ... రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో రాజకీయ పార్టీల కూటములకు ఎలాంటి గుర్తింపు లేదన్నారు. కాగా, అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవటంలో జాప్యం చేస్తున్న ప్రిసైడింగ్ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ప్రిసైడింగ్ అధికారులు చేస్తున్న అనవసర జాప్యంపై సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం తెలిపిందని పేర్కొన్నారు. -
వైఎస్సార్ సీపీ నుంచి చంద్రగిరి జెడ్పీటీసీ సస్పెన్షన్
టీడీపీ నాయకుల కనుసన్నల్లో పనిచేస్తున్న సరిత సీఎం కటౌట్ల కాంట్రాక్ట్ పొందిన జెడ్పీటీసీ భర్త పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనడంతోనే సస్పెన్షన్ చంద్రగిరి: పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి జెడ్పీటీసీ సభ్యురాలు సరిత, ఆమె భర్త రమణమూర్తిని చంద్రగిరి ఎమ్మె ల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సూచనల మేరకు సోమవారం పార్టీ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు కే.నారాయణస్వామి సస్పెండ్ చేశా రు. పార్టీ చంద్రగిరి మండల పట్టణ అధ్యక్షుడు కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, చిల్లకూరి యుగంధర్‌రెడ్డికి ఈ మేరకు నారాయణస్వామి నుంచి ఆదేశాలు అందారుు. సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రశేఖర్‌రెడ్డి, యుగంధర్‌రెడ్డి మాట్లాడుతూ సరితను వైఎస్సార్ సీపీ తరఫున జెడ్పీటీసీగా గెలిపించామన్నారు. గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు సరిత, ఆమె భర్త రమణ మూర్తి పార్టీ నిర్వహించిన ఏ కార్యక్రమాల్లో పాల్గొనలేదని తెలిపారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యక్రమాలను సైతం ఏరోజూ నిరసించలేదన్నారు. అనునిత్యం టీడీపీ నాయకుల అదుపాజ్ఞల్లో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. స్వలాభం కోసం నారా చంద్రబాబు పంచన చేరారని తెలిపారు. ఫలితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కటౌట్లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే కాంట్రాక్టును ప్రభుత్వం నుంచి సరిత భర్త రమణమూర్తి దక్కించుకున్నారని తెలి పారు. దీనికి మండలంలోని టీడీపీ నాయకులు పూర్తి సహాయ సహకారాలు అందించారని చెప్పారు. చిన్నగొట్టిగల్లు మండలంలో సుమారు వంద ఎకరాల ప్రభుత్వ భూమి రమణమూర్తి ఆధీనంలో ఉందన్నారు. టీడీపీలోకి మారితే డీకేటీ భూమిని పట్టా చేయిస్తామని ఆ పార్టీ నాయకులు ఇచ్చిన హామీతో సరిత, ఆమె భర్త తెలుగుదేశం పార్టీ వైపు వెళుతున్నారని ఆరోపిం చారు. పైగా సీఎం సమక్షంలో సరిత, రమణమూర్తి టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలి పారు. దీంతో పాటు వైఎస్సార్ సీపీకి చెందిన కార్యకర్తలు, నాయకులను సైతం అనేక రకాలుగా ప్రలోభాలు, ఒత్తిడులకు గురిచేస్తున్నారన్నారంటూ పార్టీ కార్యకర్తలు వచ్చి తమ వద్ద ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. టీడీపీలోకి చేరమంటూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ఒత్తిడి చేయ డం బాధాకరమన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుండటంతో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి తెలిపామన్నారు. వారిని పార్టీనుంచి జిల్లా అధ్యక్షుడు బహిష్కరించారని తెలిపారు.