సిద్ధుకు వార్షిక పరీక్ష !
సర్కార్ పనితీరుపై ‘14న సమన్వయ సమితి’ భేటీ
బెంగళూరుకు రానున్న కేంద్ర మంత్రి ఆంటోని
సంక్షేమ పథకాల అమలు నివేదికలు తెప్పించుకుంటున్న మంత్రులు
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం ‘సమన్వయ సమితి’ రూపంలో పరీక్షను ఎదుర్కొనబోతోంది. ఈనెల 14న బెంగళూరులో జరగబోయే సమన్వయ సమితి సమావేశానికి ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి ఆంటోనితో పాటు కర్ణాటక రాజకీయ వ్యవహారాల ఇన్చార్జ దిగ్విజయ్ సింగ్ హాజరవుతున్నట్లు సమాచారం. సిద్ధరామయ్య ఏడాది పాలనలో ఆయనతో పాటు మంత్రుల పనితీరు, వ్యవహార శైలిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటి వరకు చేపట్టిన సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరును సంబంధిత మంత్రులతో కలిసి సమీక్షించనున్నారు.
కరువు నివారణ పనులు, తాగునీటి ఎద్దడి నివారణకు సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్యంపై గవర్నర్ హన్సరాజ్ భరద్వాజ్ జోక్యం చేసుకోవడం.. ప్రభుత్వ పనితీరును తీవ్రంగా విమర్శించడం.. అదే రీతిలో సీఎం సైతం గవర్నర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన అంశాలు ఈ సమితి సమావేశంలో ప్రధాన ంగా చర్చకు వచ్చేఅవకాశం ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మంత్రుల మధ్య బేధాభిప్రాయాలు, అందుకు దారితీసిన కారణాలపై కూడా సమితి చర్చించనుంది. అభివృద్ధి పథకాలతో ఎంత మంది లబ్ధి పొందారు.. తదితర విషయాలను కూడా సంబంధిత మంత్రులు సమితి సభ్యులకు వివరించాల్సి ఉంటుంది. ఇందు కోసం ఇప్పటికే మంత్రులు తమతమ శాఖల ప్రగతిపై నివేదిక తయారు చేసుకుని తుది మెరుగులు దిద్దే పనిలో తలమునకలై ఉన్నారు.
ఇదిలా ఉండగా ఈ సమన్వయ సమితి సమావేశంలో ప్రభుత్వ పరంగానే కాకుండా పార్టీ పరంగా కూడా ఈ ఏడాది కాలంలో వచ్చిన మార్పులపై చర్చించనున్నారు. కొంతమంది మంత్రుల పనితీరుపై గవర్నర్ హన్స్‌రాజ్ భరద్వాజ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో వారి శాఖలను మార్చే విషయం, మంత్రి మండలిలో ఖాళీగా ఉన్న మూడు స్థానాల భర్తీపై కూడా ఈ సమావేశంలో స్పష్టత రానుంది. కాగా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆ పదవిలో ఉండటం లేదా దిగిపోవడం రాష్ట్రంలో లోక్‌సభ ఫలితాలపై ఆధారపడి ఉంటుందనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై కూడా సమితి సభ్యులు నిర్ణయం తీసుకోనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు.