antya pushkaram
-
భక్తి ఎగసె.. గోదారి మురిసె
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎగసింది.. తన చెంతకొచ్చిన బిడ్డల తన్మయత్వాన్ని చూసి గోదారమ్మ మురిసింది. అందుకేనేమో.. ఆ తల్లి గోదారి ఉరకలెత్తి ప్రవహిస్తోంది. అంత్య పుష్కరాలు ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో జిల్లాలోని ఘాట్లన్నీ భక్తజన సందోహంతో కిక్కిరిశాయి. ఓ వైపు వరద గోదారి ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు భక్తులు సైతం వరదలా తరలివస్తున్నారు. అంత్య పుష్కరాల్లో తొమ్మిదో రోజైన సోమవారం నదీ తీరమంతా జన సందోహంతో కిటకిటలాడింది. కొవ్వూరు గోష్పాద క్షేత్రానికి ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వచ్చారు. సోమవారం ఇక్కడ 60 వేల మందికి పైగా పుష్కర స్నానాలు ఆచరించారు. వరద పోటెత్తడంతో గోష్పాద క్షేత్రంలోని మొదటి రెండు ఘాట్లను పూర్తిగా మూసివేశారు. మరో మూడు రోజుల్లో గోదావరి అంత్య పుష్కరాలు ముగియనుండటంతో భక్తుల సంఖ్య పెరుగుతోంది. పట్టిసీమ పుష్కర ఘాట్‌లో భక్తులు స్నానాలు చేసి భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పోలవరం, గూటాల ఘాట్లలో వరద ఎక్కువగా ఉన్నప్పటికీ భక్తుల సంఖ్య తగ్గలేదు. సిద్ధాంతంలో కేదారేశ్వరుడు కొలువుతీరడం, సోమవారం కావడంతో భక్తులు పోటెత్తారు. 13 వేలకు పైగా భక్తులు ఇక్కడ పుష్కర స్నానాలు చేసినట్టు అంచనా. పోలీసులు కృష్ణా పుష్కరాలకు తరలివెళ్లడంతో ఘాట్ల వద్ద ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. భక్తులు తీవ్ర ఇబ్బం దులకు గురయ్యారు. కేదారీఘాట్‌లో గల మూడు రేవుల్లో ఒక రేవును మూసివేశారు. పెరవలి మండలంలో గోదావరి తీరం భక్తులతో నిండిపోయింది. మహిళలు గోదారమ్మకు పసుపు, కుంకుమ చీరసారెలతో పూజలు నిర్వహించారు. ఎనిమిది పుష్కర ఘాట్లలో వేలాది మంది పుణ్యస్నానాలు ఆచరిం చారు. నరసాపురంలోని ఘాట్లకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వలంధర రేవు, అమరేశ్వర ఘాట్ల వద్ద రద్దీ నెలకొంది. స్నానాల అనంతరం శివాలయాలను దర్శించుకుని పూజలు చేశారు. పోలీస్ యంత్రాంగం, ఇతర శాఖల సిబ్బంది కృష్ణా పుష్కరాలకు వెళ్లిపోవడంతో మొత్తం భారం ఎన్ఎస్ఎస్ వలంటీర్లపై భారం పడింది. ఉదయం సముద్రంలో పాటు కారణంగా ఘాట్లలో నీటిమట్టం లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆచంట మండలం కరుగోరుమిల్లి పుష్కర ఘాట్ పూర్తిగా నీట మునిగింది. ఘాట్‌కు వెళ్లే రహదారిపైకి వరద నీరు చేరింది. దీంతో ఇక్కడ పుష్కర స్నానాలను నిలుపుదల చేశారు -
జన శిరమున.. జల దీవెన
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఇటు అంత్య పుష్కరం.. అటు శ్రావణం.. ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభ పరిఢవిల్లింది. సౌభాగ్య ధాత్రి ఆశీస్సుల కోసం సతులంతా గోదారమ్మ ఒడిలో జలకమాడారు. గౌరీ కటాక్షం కోసం శ్రావణ శుక్రవారం పూజలు ఆచరించారు. గండాలను, పాపాలను కడిగేయగా.. మూడు మునకలే చాలుగా అంటూ భక్త జనమంతా జల దీవెనను తలకు పోసుకున్నారు. జననీ.. గంగాభవానీ అంటూ.. ఆ పావన వాహినిని కీర్తించారు. శ్రావణ మాసం తొలి శుక్రవారం శోభ గోదావరి అంత్య పుష్కరాల్లోనూ కనిపించింది. పుష్కర స్నానాల అనంతరం భక్తులంతా సమీపంలోని అమ్మవార్ల ఆలయాలను దర్శించుకున్నారు. నదిలో వరద ప్రవాహం పెరగడంతో కొన్నిఘాట్లను మూసివేయాల్సిన పరిస్థితి తలెత్తింది. నిండుగా ప్రవహిస్తున్న గోదావరిని నిండైన భక్తితో కొలిచి చల్లగా చూడాలని మొక్కుతూ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో సుమారు 13 వేల మంది భక్తులు స్నానాలు ఆచరించారు. శుక్రవారం కూడా నరసాపురంలోని ఘాట్లలో భక్తుల రద్దీ కొనసాగింది. వలంధర రేవులో వేకువజాము నుంచే భక్తులు స్నానాలు ఆచరించారు. కొవ్వూరు వద్ద గోదావరి ఉగ్రరూపంతో ఉంటే నరసాపురంలో మాత్రం ప్రశాంతంగా దర్శనమిచ్చింది. నదిలో తగినంత నీరు లేక భక్తులు ఇబ్బంది పడ్డారు. సముద్రానికి దగ్గరగా ఉండటంతో ఆటుపోట్ల ప్రభావం ఈ ఘాట్‌పై ఉంటుంది. అంత్యపుష్కరాల ప్రారంభం నుంచీ నరసాపురం గోదావరిలో పాటు సమయంలోనూ భక్తులు స్నానాలకు ఇబ్బంది పడేంతగా నీటిమట్టం తగ్గలేదు. శుక్రవారం మాత్రం ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల వరకూ నీటిమట్టం దారుణంగా పడిపోయింది. దీంతో జల్లు స్నానాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఆచంట మండలం కోడేరు, పెదమల్లం, కరుగోరుమిల్లి, భీమలాపురం ఘాట్ల వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పెదమల్లంలో మాచేనమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్ధాంతం కేదారీఘాట్‌లో ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో గోదావరి మాతకు లక్ష కుంకుమ పూజ నిర్వహించారు. గోదారమ్మకు పసుపు కుంకుమలు సమర్పించి హారతులిచ్చారు. కుంకుమ పూజల్లో 108 మంది మహిళలు పాల్గొన్నారు. కేదారీఘాట్‌లో 6వ రోజున 6వేల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిట్టు అధికారులు లెక్కగట్టారు. ప్రమాదకర ఘాట్ల మూసివేత గోదావరిలో వరద ప్రవాహం పెరగడంతో కొవ్వూరులోని పాత పుష్కర ఘాట్‌ను మూసివేశారు. గత ఏడాది పుష్కరాల్లో విస్తరించిన నూతన ఘాట్లలో మాత్రమే అనుమతించారు. పెరవలి మండలంలోని ఖండవల్లి, కానూరు అగ్రహారం, ముక్కామల, ఉమ్మిడివారిపాలెం, కాకరపర్రు గ్రామాల్లోని 6 ఘాట్లు మూతపడ్డాయి. -
పట్టిసీమలో భక్తుల పాట్లు
పోలవరం : పట్టిసీమ పుష్కరఘాట్‌లో పుణ్యస్నానాలకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గోదావరికి వరద పెరగడంతో భక్తుల రాకపోకల కోసం నదిలో వేసి ఇసుక బస్తాలు మునిగిపోయే దుస్థితి నెలకొంది. అయినా వాటిపైనే భక్తులు స్నానాలకు నడిచి వెళ్తున్నారు. మండలంలోని పట్టిసీమతోపాటు గూటాల, పోలవరం ఘాట్లలో జనం పలుచగా కనిపిస్తున్నారు. పట్టిసీమ శివక్షేత్రంలో భక్తులకు పులిహార ప్రసాదం అందజేశారు. వృద్ధులు, చిన్నారుల కోసం పట్టిసీమ రేవులో జల్లుస్నానాలు ఏర్పాటు చేశారు.